Share News

నేటితో ప్రచారానికి తెర

ABN , Publish Date - Feb 25 , 2025 | 12:49 AM

శాసనమండలి నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం తో గడువు ముగుస్తుంది.

నేటితో ప్రచారానికి తెర

టీచర్లతో వ్యక్తిగతంగా అనుసంధానానికి ప్రాధాన్యమిచ్చిన అభ్యర్థులు

సోషల్‌మీడియాలో విస్తృతస్థాయి ప్రచారం

తటస్థ, సైలంట్‌ ఓటర్లపైనే ఎక్కువ దృష్టి

నేటి సాయంత్రం నుంచి ఎన్నిక పూర్తయ్యే వరకూ సైలెన్స్‌ పీరియడ్‌ : కలెక్టర్‌

(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ): శాసనమండలి నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం తో గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో చివరిదశలో ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు ధీమాతో ప్రచారంలో దూసుకెళుతుంటే, ఉపాధ్యాయ సంఘాలు తాము మద్ధతిచ్చిన అభ్యర్థుల విజయంకోసం శ్రమిస్తున్నాయి.

సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఎన్నికలప్రచారం సాగుతోంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన అభ్యర్థులు దూకుడు పెంచారు. చివరిదశలో ఉపాధ్యాయ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరంచేశారు. బుధవారం సాయంత్రం నుంచి ఎస్‌ఎంఎ్‌సలు సైతం పెట్టకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించడంతో ఈలోపే ప్రతి ఉపాధ్యాయుడికీ తమ అభ్యర్థన వెళ్లేలా బరిలో నిలిచిన అభ్యర్థులు ఏర్పాట్లుచేసుకున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మరోసారి టీఎస్‌ యూటీఎఫ్‌ నుంచి బరిలో ఉండగా, పీసీసీ అధికార ప్రతినిధి, టీపీఆర్టీయూ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్థన్‌రెడ్డి, పీఆర్‌టీయూ-టీఎస్‌ నుంచి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్‌రెడ్డి, బీజేపీ నుంచి పులి సరోత్తమ్‌రెడ్డి, బీసీ సంఘాల మద్దతుతో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, సుందర్‌రాజ్‌ యాదవ్‌ సహా మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ స్థానంలో గెలవడం ద్వారా ఉపాధ్యాయ వర్గాల్లో తమ ఆధిక్యతను చాటేందుకు ఉధృతంగా ప్రచారం సాగించారు.

ప్రతి ఉపాధ్యాయుడికీ సందేశం చేరడమే లక్ష్యం

ఈ నియోజకవర్గంలో భిన్న తరహాలో ప్రచారం కొనసాగిం ది. ఉపాధ్యాయుల సమ్మేళనాలు, సమావేశాలతోపాటు అభ్యర్థులు నేరుగా ఓటర్లతో అనుసంధానమవుతూ తమకు ఓట్లేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఉపాధ్యాయ సంఘాల ద్వారా, సమావేశాల ద్వారా ఓట్లను అభ్యర్థిస్తూనే మరోవైపు సంఘాలకు అతీతం గా ఉపాధ్యాయులతో టెలీ కాన్ఫరెన్సు లు, గ్రూప్‌ కాల్స్‌ చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఉపాధ్యాయ నేతగా ఇప్పటివర కు తాము చేసిన పోరాటాలు, కృషిని గుర్తుచేయడంతోపాటు, ప్రస్తుతం నెలకొన్న ఉపాధ్యాయ సమస్యలు, సంక్షే మం, ప్రభుత్వ విద్యారంగంలో వచ్చిన మార్పులు, వ్యవస్థ బలోపేతానికి తాము చేపట్టబోయే కార్యాచరణను వివరించా రు. సంఘాలు ఏవైనా ఆయా ఉపాధ్యాయులతో తమకున్న సంబంధాలను గుర్తుచేస్తూ సెంటిమెంట్‌ని సైతం పండించారు. తమవాదాన్ని, సిద్ధాంతాన్ని తెలియజేస్తూ తమకే ఓటేయాలంటూ అభ్యర్థించారు. ప్రధాన అభ్యర్థులంతా ఈ తరహాలో ప్రతీ ఉపాధ్యాయ ఓటరుకి తమ గళం వినిపించేలా, కనీసం ఒక్కసారైనా వారిని నేరుగా ఓటు అభ్యర్థించేలా ఈసారి ప్రచారవ్యూహం అమలు చేశారు.

సోషల్‌ మీడియాలో హోరెత్తిన ప్రచారం

నియోజకవర్గం పరిధి విస్తృతంగా ఉండడంతో అభ్యర్థులంతా సోషల్‌ మీడియాను ప్రచారంలో విస్తృతంగా వినియోగించుకున్నారు. ఫేస్‌బుక్‌, వా ట్సాప్‌ గ్రూపులు, ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌వేదికలుగా ఉధృ తస్థాయిలో తమగళం వినిపించారు. తమకు ఓటేస్తే ఉపాధ్యాయుల కోసం చేసే పోరాటాలు, ఉపాధ్యాయ సమస్యలపై తాము చేసిన పోరాటాలు, ఉద్యమాలతోపాటు విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై తమ వైఖరులను సోషల్‌ మీడియా వేదిక గా పంచుకున్నారు. తమకు మద్దతిచ్చే సంఘాల ప్రతినిధులతో కూడిన వాట్స్‌పగ్రూపులు, ఉపాధ్యాయులుండే ప్రతీ వాట్సాప్‌ గ్రూపులతో ప్రతిరోజూ తమ కార్యక్రమాలను అప్‌డేట్‌ చేయడంతోపాటు, తమ విన్నపాన్ని సూచిస్తూ పోస్టులు కొనసాగించారు. గత ఎన్నికలకు పూర్తి భిన్నంగా ఈసారి సోషల్‌మీడియాలో ఉధృతస్థాయిలో ప్రచారం సాగింది.

సంఘాల్లో క్రియాశీలకంగా లేని ఉపాధ్యాయులపై ప్రత్యేక దృష్టి:

పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థులంతా తమకు మద్దతిచ్చే సంఘాల సభ్యులైన ఉపాధ్యాయులతో పాటు సంఘాల్లో క్రియాశీలకంగా లేని, తటస్థవైఖరితో ఉండే ఉపాధ్యాయులపై ఎక్కువగా శ్రద్ధ పెట్టారు. ప్రధాన సంఘాల్లో సభ్యత్వాలున్నప్పటికీ క్రియాశీలకంగా లేనటువంటి ఉపాధ్యాయులను గుర్తించి వారి మద్ధతు కోసం అభ్యర్థులు, వారికోసం పనిచేస్తున్న ఉపాధ్యాయ నాయకులు కృషి చేస్తున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది. ఇలాంటి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉండే చిన్నచిన్న సంఘాల నేతలను తరచూ కలుస్తూ తమకు మద్దతివ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల ఉపాధ్యాయులు, ఆదర్శపాఠశాలల ఉపాధ్యాయులు, కేజీబీవీ టీచర్లు, భాషాపండిట్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, రికగ్నైజ్డ్‌ స్కూళ్ల టీచర్లు, ఎయిడెడ్‌ స్కూళ్ల టీచర్ల ఓట్లపైన అభ్యర్థులు ఎక్కువగా దృష్టి సారించడం ఈసారి ఎన్నికల్లో ప్రత్యేకతగా చెప్పవచ్చు. మరోవైపు పోటీలో ఉన్న అభ్యర్థుల్లో నామమాత్రంగా ఉన్న అభ్యర్థుల మద్దతు సాధించేందుకు ప్రధాన అభ్యర్థులు చర్చలు జరుపుతున్నారు.

బీజేపీ మినహా కనిపించని రాజకీయ హడావిడి

ఈ ఎన్నికల్లో బీజేపీ మాత్రమే తమ అభ్యర్థిని నేరుగా బరిలో దించగా, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఎవరికీ మద్ధతివ్వలేదు. దీంతో బీజేపీ నేతలు మినహా మిగిలిన పార్టీల నేతలెవరూ ఈఎన్నికపై ఎక్కడా స్పందించలేదు. ప్రచారం చేయలేదు. ఈనియోజకవర్గ పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి ఎక్కడా ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోయినా, సంస్థాగతంగానూ ఇతర పార్టీలతో పోల్చితే చెప్పుకోదగ్గ బలం లేకపోయినా ఆపార్టీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంపై రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్‌, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ లక్ష్మణ్‌, ఎంపీలు ఈటెల రాజేందర్‌ సహా ఇతర కీలకనేతలంతా ప్రచారంలో పాల్గొనడమే కాకుండా గెలుపుకోసం పార్టీ అప్పగించిన కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలనే దిశగా ప్రత్యేకమైన ప్రణాళికను ఆపార్టీ అమలు చేస్తున్నట్లు ఉపాధ్యాయవర్గాల్లో చర్చసాగుతోంది. మరోవైపున కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అధికారికంగా ఎవరికీ మద్ధతివ్వకపోవడంతో ఆపార్టీల సానుభూతిపరులైన ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్ధులు ఆయాపార్టీలలో వారికున్న పరపతి, పరిచయాల ద్వారా ఉపాధ్యాయులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి క్షేత్రస్థాయి వరకు కొనసాగుతోంది.

48 గంటలపాటు సైలెన్స్‌ పీరియడ్‌ : కలెక్టర్‌

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ఈనెల 27న జరగనున్న నేపథ్యంలో 48గంటల సైలెన్స్‌ పీరియడ్‌ అమల్లో ఉంటుందని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తెలిపారు. 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు బహిరంగసభలు, సమావేశాలు, ఊరేగింపులు, ప్రచారాలు, రాజకీయపరమైన, అభ్యంతరకరమైన కంటెంట్‌తో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్క్‌ ఎస్‌ఎంఎ్‌సలపై నిషేధం కొనసాగుతుందన్నారు. సోషల్‌మీడియాపైనా నిశితమైన పరిశీలన కొనసాగుతుందని, సైలెన్స్‌ పీరియడ్‌లో నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే ఎన్నికల ప్రవర్తనానియామావళిననుసరించి కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సైలెన్స్‌ పీరియడ్‌లో జిల్లాయేతర వ్యక్తులేవరు జిల్లాలో ఉండవద్దని హెచ్చరించారు. అదేవిధంగా సైలెన్స్‌ పీరియడ్‌లో నియోజకవర్గమంతా, ఓట్లలెక్కింపు నిర్వహించే మార్చి 3వ తేదీన లెక్కింపు పూర్తయ్యేంతవరకు నల్లగొండ మన్సిపల్‌ పరిధిలో మద్యనిషేధం కూడా అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేంతవరకు జిల్లాలో 144వ సెక్షన్‌ సైతం అమల్లో ఉంటుందని కలెక్టర్‌ వెల్లడించారు.

జిల్లా పోలింగ్‌స్టేషన్లు పురుషులు స్త్రీలు మొత్తం

నల్లగొండ 37 2817 1866 4683

సూర్యాపేట 23 1702 962 2664

యాదాద్రి 17 638 346 984

సిద్దిపేట 4 123 43 166

జనగాం 12 614 388 1002

హనుమకొండ 15 2943 2272 5215

వరంగల్‌ 13 1474 878 2352

మహబూబాబాద్‌ 16 1112 551 1663

జె.భూపాలపల్లి 7 215 114 329

ములుగు 9 405 223 628

భద్రాద్రి 23 1068 954 2022

ఖమ్మం 24 2372 1717 4089

మొత్తం 200 15483 10314 25797

Updated Date - Feb 25 , 2025 | 12:49 AM