అంత్యక్రియలకు అండగా నిలిచారు
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:38 AM
నాలుగు దశాబ్దాల కిందటే వలస వెళ్లినా..అంత్యక్రియలకు సొంత ఊరు అండగా నిలిచింది. ఇల్లు లేని ఓ నిరుపేదకు తన పూర్వీకుల ఇంటిముందు టెంట్ వేసి అంతిమసంస్కారానికి అండగా ఉంది.
ఆత్మకూరు(ఎం), జనవరి 30 (ఆంధ్రజ్యోతి): నాలుగు దశాబ్దాల కిందటే వలస వెళ్లినా..అంత్యక్రియలకు సొంత ఊరు అండగా నిలిచింది. ఇల్లు లేని ఓ నిరుపేదకు తన పూర్వీకుల ఇంటిముందు టెంట్ వేసి అంతిమసంస్కారానికి అండగా ఉంది. గురువారం యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలకేంద్రంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలకేంద్రానికి చెందిన కొంగరి మల్లయ్య(62)కు ముగ్గురు అన్నదమ్ములు. మల్లయ్య రెండోవాడు. కాగా చిన్నతమ్ముడు శ్రీశైలంతో కలిసి 40ఏళ్ల కిందట బతుకుదెరువు కోసం ఖమ్మం వలసవెళ్లాడు. అక్కడే ఉంటూ హమాలీగా పనిచేస్తూ భార్య, ఇద్దరు కుమార్తెలను పోషించుకుంటూ జీవనం సాగించాడు. అయితే మల్లయ్య స్వగ్రామానికి వచ్చిపోతుండేవాడు. కొంతకాలంగా మల్లయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ బుధవారం రాత్రి ఖమ్మంలో మృతి చెందాడు. ఖమ్మంలో ఇల్లు లేకపోవడం, బంధువులు ఎవరూ లేకపోవడంతో పుట్టిన ఊరిలోనే దహన సంస్కారాలు చేసేందుకు మల్లయ్య మృతదేహాన్ని గురువారం ఆత్మకూరు(ఎం)కు తరలించారు. అయితే గ్రామంలో తల్లిదండ్రులకు సంబంధించిన కొద్దిపాటి భూమి ఉండటంతో అక్కడే టెంట్ వేసి మృతదేహాన్ని ఉంచారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. మల్లయ్య కుటుంబ దీనస్థితి గ్రామస్థులను కంటతడిపెట్టించింది. ప్రస్తుతం మండల కేంద్రంలోని కురుమ సంఘం భవనంలో వారికి ఆశ్రయం కల్పించారు. బీఆర్‌ఎస్ తరపున ఆ పార్టీ మండల అధ్యక్షుడు బీ చందర్, మాజీ ఎంపీటీసీ వై కవిత చెరో రూ.5000, గొర్లకాపర్ల సంఘం మండల అధ్యక్షుడు కోరె భిక్షపతి రూ.4000 ఆర్థిక సహాయాన్ని మల్లయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు.