Share News

దర్వాజను చీల్చుకుని వచ్చి గాయపరిచి

ABN , Publish Date - Feb 27 , 2025 | 12:34 AM

రహదారిపై వెళ్తున్న వాటర్‌ ట్యాంకర్‌ టైరు పగిలిన ఘటనలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది.

దర్వాజను చీల్చుకుని వచ్చి గాయపరిచి
చికిత్స పొందుతున్న రామలక్ష్మి

వీధిలో పగిలిన వాటర్‌ ట్యాంకర్‌ టైరు

దర్వాజను చీల్చుకుని ఇంట్లోకి డెక్స్‌

ఇంట్లో ఉన్న వృద్ధురాలికి తగిలి గాయాలు

భువనగిరి టౌన, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : రహదారిపై వెళ్తున్న వాటర్‌ ట్యాంకర్‌ టైరు పగిలిన ఘటనలో ఓ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన బుధవారం యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరిలో జరిగింది. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక అర్బనకాలనీలో నీటిని విక్రయించే గోపాల కృష్ణకు చెదిన ప్రైవేటు వాటర్‌ ట్యాంకర్‌ కదులుతుండగానే వెనుక టైరు పగిలింది. దీంతో పగిలిన టైరు నుంచి వెలువడిన ఒత్తిడితో టైర్‌ డెక్స్‌ నుంచి వేరుపడిన రింగ్‌ పక్కనే మూసిఉన్న ఇంటి దర్వాజాను చీల్చుకుని లోపల మంచంపై కూర్చుని ఉన్న రామలక్ష్మికి తాకింది. దీంతో ఆమె కాలు విరగడంతో పాటు తలకు గాయాలయ్యాయి. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ పరిణామంతో కోలుకున్న వెంటనే కుటుంబసభ్యులు ఆమెను స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాలు విరగడంతో పాటు తలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన రామలక్ష్మి సోదరుడు భువనగిరి అర్బన కాలనీకి చెందిన సత్యనారాయణరెడ్డి ఇటీవలె మృతి చెందాడు. ఈ నేపథ్యంలో తమ్ముడి కుటుంబాన్ని పరామర్శించడానికి రామలక్ష్మి వచ్చింది. గాయపడిన తీరు స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే ఎంవీఐ కార్యాలయం జారీ చేసే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేనందునే ట్యాంకర్‌ కండీషన అదమంగా ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 27 , 2025 | 12:34 AM