టెంటు పీకేసి, అధికారులను నిలదీసి
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:36 AM
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామలక్ష్మీపురం గ్రామంలో నిర్వహించిన గ్రామసభ తీవ్రఉద్రిక్తతకు దారితీసింది. గ్రామ ప్రత్యేకాధికారి, ఆర్‌డబ్య్లూఎస్ ఏఈ రవికుమార్ లబ్ధిదారుల జాబితా చదువుతుండగా, గ్రామస్థులు ఒక్కసారిగా అర్హులకు ప్రభుత్వ పథకాలు అందలేదని ఆరోపిస్తూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు.

కోదాడ రూరల్, తుర్కపల్లి, గుండాల, చౌటుప్పల్ టౌన, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామలక్ష్మీపురం గ్రామంలో నిర్వహించిన గ్రామసభ తీవ్రఉద్రిక్తతకు దారితీసింది. గ్రామ ప్రత్యేకాధికారి, ఆర్‌డబ్య్లూఎస్ ఏఈ రవికుమార్ లబ్ధిదారుల జాబితా చదువుతుండగా, గ్రామస్థులు ఒక్కసారిగా అర్హులకు ప్రభుత్వ పథకాలు అందలేదని ఆరోపిస్తూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఉన్నతవర్గాలకు పథకాలు అందజేశారని, ఐదు నుంచి 10 ఎకరాలున్న రైతులను ఎంపిక చేశారని గ్రామసభను అడ్డుకుని, వేసిన టెంట్‌ను పీకేశారు. గ్రామంలో కాంగ్రెస్ రెండువర్గాలు ఉండగా, గ్రామ కార్యదర్శి బాలరాజు ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించడం వల్లే ప్రభుత్వ పథకాలు మొత్తం వారికే అందాయని ఆరోపిస్తూ మరో వర్గానికి చెందిన కొంతమంది కార్యదర్శిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అతను వెంటనే సభ నుంచి వెళ్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో తలదాచుకున్నాడు. దీంతో ఆందోళనకారులు పంచాయతీ కార్యాలయానికి తాళంవేశారు. దాంతో ఇరువర్గాలు ఒకరినొకరు నెట్టుకుంటూ కొట్టుకునేందుకు సిద్ధమయ్యారు. గ్రామసభ నిర్వహణకోసం ఒక్క పోలీ్‌సను మాత్రమే పంపడంతో ఆందోళనకారులను అదుపుచేయడం సాధ్యం కాలేదు. ఆందోళన విషయం తెలుసుకున్న ఎంపీడీవో రాంచందర్‌రావు, ఎంపీవో పాండురంగయ్యలు గ్రామానికి వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి సిబ్బందితో చేరుకుని గ్రామసభ నుంచి ఆందోళనకారులను బయటికిపంపారు. తిరిగి ప్రారంభమైన గ్రామసభలో అధికారులు లబ్ధిదారుల జాబితా చదువుతుండగా ఇరువర్గాల వారు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ప్రజాపాలనలో 400 ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా, 40మంది లబ్ధిదారుల పేర్లు మాత్రమే చదివి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఇరువర్గాలు ఒకరినొకరు ఘర్షణకు దిగి కొట్టుకున్నారు. పోలీసులు వెంటనే ఇరువర్గాలను శాంతింపచేసి బయటికి పంపారు. అధికారులను పోలీ్‌సపహారాలో కోదాడకు తరలించారు. ఇదిలా ఉండగా మూడురోజులు ముందే రామలక్ష్మీపురం లబ్ధిదారుల జాబితా సోషల్ మీడియాలో హల్‌చల్ కావడవంతో అర్హత కలిగిన లబ్ధిదారులు తీవ్రనిరాశకు లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే ఘర్షణ చోటుచేసుకుందని గ్రామస్థులు పేర్కొన్నారు.
కాళ్లు మొక్కుతా సార్...
గుండాల మండల కేంద్రంలో గ్రామసభలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతుండగా మండల కేంద్రానికి చెందిన శ్రీపతి లక్ష్మమ్మ తనకు అర్హత ఉన్నా పింఛన రావడం లేదని, సారూ నీ కాళ్లు మొక్కుతా పింఛన ఇప్పించండి అని కాళ్లు మొక్కే యత్నం చేసింది. వెంటనే ఎమ్మెల్యే స్పందించి తప్పకుండా పింఛన ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
గుండాల మండలం వంగాల గ్రామంలో సీసీరోడ్డు శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు నిరసన సెగ ఎదురైంది. అర్హత ఉన్నా ఇందిరమ్మ ఇల్లు, రేషన కార్డు జాబితాలో తమ పేర్లు లేవని కొంతమంది ప్లకార్డులతో నిరసన తెలిపారు. గమనించిన ఎస్‌ఐ సైదులు, పోలీస్ సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ ప్రతి ఒక్క పథకం అందేలా కృషి చూస్తానని ఎవ్వరూ అధైర్య పడవద్దని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
చౌటుప్పల్ మునిసిపాలిటీలోని 13వ వార్డులోని సమస్యలను పరిష్కరించడంలో చైర్మన వివక్ష చూపారంటూ స్థానికులు గ్రామసభను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.