Share News

సబ్‌ప్లాన్‌ చట్టం సర్వరోగ నివారిణి

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:47 AM

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం సర్వరోగ నివారిణి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ట్రైకార్‌ చైర్మన్‌ బెల్లయ్యనాయక్‌ ఆధ్వర్యంలో వారం రోజులుగా నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలోని ప్రాజెక్ట్‌ హౌస్‌లో నిర్వహిస్తున్న అఖిలభారత గిరిజన ఆదివాసీ కాంగ్రెస్‌ ప్రతినిధుల సాధికారత శిక్షణ తరగతుల ముగింపు సమావేశం శనివారం నిర్వహించారు.

సబ్‌ప్లాన్‌ చట్టం సర్వరోగ నివారిణి

ఆదివాసీలకు ప్రకృతే దైవం, దేహం

కాంగ్రెస్‌ శ్రేణులు ధైర్యంగా సంక్షేమ పథకాలు ప్రచారం చేయాలి

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

నాగార్జునసాగర్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం సర్వరోగ నివారిణి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ట్రైకార్‌ చైర్మన్‌ బెల్లయ్యనాయక్‌ ఆధ్వర్యంలో వారం రోజులుగా నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలోని ప్రాజెక్ట్‌ హౌస్‌లో నిర్వహిస్తున్న అఖిలభారత గిరిజన ఆదివాసీ కాంగ్రెస్‌ ప్రతినిధుల సాధికారత శిక్షణ తరగతుల ముగింపు సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి డిప్యూటీ సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా భూమి లేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలను అందజేసే కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఐటీడీఏలను పునరుద్ధరించడం, వాటికి బడ్జెట్‌ను కేటాయించి, నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి,సంక్షేమ పథకాలను కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు గ్రామాల్లో ధైర్యం గా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. దేశ సంపద ప్రజలకు దామాషా ప్రకారం అందాలి తప్ప కార్పొరేట్‌ శక్తులకు కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని బలహీన పరచాలని చూస్తుంటే కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని రక్షించేందుకు నడుంబిగించారని అన్నారు. సంవిధాన్‌ సమ్మేళన్‌ పేరిట ఆయన దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పీసా చట్టాన్ని నూరుశాతం అమలుచేస్తామన్నారు. ఆదివాసీలు భూమిని తల్లిగా, నదులను రక్తమాంసాలుగా భావిస్తార ని, వాటిని దూరం చేస్తే వారు ప్రాణం లేని శవాలుగా మారుతారన్నారు. ఆదివాసీలపై ప్రేమలేని వారు వారి నుంచి వాటిని దూరం చేయాలని చూశారని, కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. హక్కులపై స్వేచ్ఛగా ప్రశ్నించే చట్టాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఆ చట్టాలను అమలు చేసే బాధ్యత ప్రతీ కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. అటవీ హక్కుల చట్టం ద్వారా వచ్చిన భూములకు విద్యుత్‌ సౌకర్యం కల్పించేందుకు విద్యుత్‌ లైన్లు వేసే క్రమంలో అటవీ శాఖ నుంచి పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అందుకే అటవీ సాగు భూములకు సోలార్‌ విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని భావిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సాగునీటిని అందించి అటవీ భూములను సాగులోకి తెచ్చే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. సౌరశక్తికి అవసరమైన అన్నిఏర్పాట్లను ప్రభుత్వమే చేస్తుందన్నారు. కార్యక్రమంలో అధికారులు నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, సబ్‌కలెకట్ర్‌ నారాయణ్‌ అమిత్‌, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ , డీఎస్పీ రాజశేఖర్‌రాజు, సీఐ లు బీసన్న, జనార్ధన్‌, ఎస్‌ఐలు సంపత్‌, వీరబాబు, నారాయణరెడ్డి, కమిషనర్‌ శ్రీను, నాయకులు అఖల భారత ఆదివాసీ కాంగ్రెస్‌ చైర్మన్‌ కొప్పుల రాజు, ట్రైకార్‌ చైర్మన్‌ తేజావత్‌ బెల్లయ్యనాయక్‌, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, జడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌ కర్నాటి లింగారెడ్డి, హాలియా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శేఖర్‌రెడ్డి, నందికొండ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మాధవి, సక్రునాయక్‌, మునినాయక్‌, పాండునాయక్‌, నాగేశ్వర్‌నాయక్‌, స్వామినాయక్‌, చందునాయక్‌, నరేందర్‌నాయక్‌, నరే్‌షనాయక్‌ పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎంకు వినతుల వెల్లువ

ఆదివాసీ శిక్షణ కార్యక్రమానికి హాజరైన ప్రతినిధులు సాగర్‌లో పర్యటించారు. పలు చెంచు, గిరిజన, ఆదివాసీ, ఎరుకల, వడ్డెరకాలనీలను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి సమస్యలను తెలుసుకుని నివేదికలు తయారు చేశారు. గిరిజన, ఆదివాసీల తండాల్లోని సమస్యలను తీర్చాలని, అక్కడ గుర్తించిన సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు నివేదికను తయారుచేసి ట్రైకార్‌ చైర్మన్‌ బెల్లయ్యనాయక్‌ ఆధ్వర్యంలో అందజేశారు. వారం రోజులుగా శిక్షణ పొందిన 100 మందికి డిప్యూటీ సీఎం సర్టిఫికెట్లు అందజేశారు.

హెలిక్యాప్టర్‌లో సాగర్‌కు...

హైదరాబాద్‌ నుంచి డిప్యూటీ సీఎం విక్రమార్కతో పాటు మంత్రులు వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు హెలీక్యాప్టర్‌ ద్వారా సాగర్‌ హిల్‌కాలనీ బీసీ గురుకుల పాఠశాల మైదానానికి చేరుకున్నారు. వారికి నల్లగొండ జిల్లా కల్టెర్‌ ఇలా త్రిపాఠి, ప్రభుత్వ విప్‌ రాంచందర్‌నాయక్‌, ఎమ్మెల్యేలు జైవీర్‌రెడ్డి, బీఎల్‌ఆర్‌, సామేలు, బాలునాయక్‌, రాందాసులు స్వాగతం పలికారు.

మైక్‌ సౌండ్‌ పెంచమని పలుమార్లు మంత్రి విన్నపం

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడే ముందు మైక్‌ సౌండ్‌ పెంచాలని పలుమార్లు నిర్వాహకులను కోరారు. అంతేకాకుండా బెల్లయ్యనాయక్‌ను కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకువచ్చింది తానేనని మంత్రి గుర్తు చేశారు.

బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

బీజేపీ కులమతాల విభజనకు పాల్పడుతూ చిచ్చు పెడుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నా రు. రాజ్యాంగంలో ఆనాడే ఆదివాసీల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ పార్టీ ఆర్టికల్‌ 46 నిబంధనను తీసుకువచ్చిందన్నా రు. ఆదివాసీలను తీర్చిదిద్దే ఏకైక పార్టీ కాంగ్రెస్‌ అని, ఏకైక నాయకుడు రాహుల్‌గాంధీ అని అన్నారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అలాగే గుజరాత్‌ నుంచి మణిపూర్‌ వరకు రాహుల్‌గాంధీ చేసిన భారత్‌ జోడోయాత్ర ఎందరో అభాగ్యులకు గొంతుకగా నిలిచిందన్నారు. దేశంలో 11 రాష్ట్రాల్లో 20వేల మంది ఆదివాసీలను నాయకులుగా తీర్చిదిద్దేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్‌ పార్టీకి ఆదివాసీలను మరింతగా దగ్గరయ్యేలా చేస్తుందన్నారు. నెహ్రూ కాలంలోనే ఆదివాసీల కోసం రాజ్యాంగంలో అనేక నిబంధనలను చేర్చారని గుర్తు చేశారు. కానీ నేడు కేంద్రంలోని బీజేపీ మాత్రం మణిపూర్‌లో ఆదివాసీల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టిస్తోందన్నారు. ఆదివాసీల కోసం కాంగ్రెస్‌ అనేక సంక్షేమ చట్టాలను తీసుకువచ్చిందన్నారు. రాహుల్‌గాంధీ దూరదృష్టితోనే ఇటువంటి శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజల మద్దతు కాంగ్రెస్‌ పార్టీకి పూర్తిస్థాయిలో ఉందన్నారు. రాహుల్‌గాంధీ ప్రధాని కావాలంటే గ్రామస్థాయిలో కాంగ్రెస్‌ పథకాలను ప్రజాప్రతినిధులు ప్రచారం చేయాలన్నారు. జనాభాలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం భారతదేశం బాగుండాలంటే రాహుల్‌గాంధీ ప్రధాని కావాలన్నారు. అందుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

తండాలతో నాకు ఎక్కువ అనుబంధం : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

తండాలతో తనకు ఎక్కువ అనుబంధం ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాహుల్‌గాంధీ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరకు సామాజిక న్యాయం ఒక్కటే కాంగ్రెస్‌ ఎజెం డా అన్నారు. దళితులు, బీసీలు, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం అందిస్తామన్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి వెంకట్‌రెడ్డి సహకారంతో ప్రతి తండాలో ప్రభుత్వ పాఠశాల, ఆసుపత్రి భవనాలను నిర్మిస్తామన్నారు. అణగారిన వర్గాలను అభివృద్ధి చేయాలన్నదే రాహుల్‌గాంధీ ఉద్దేశమన్నారు. అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం ఒక్క కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమన్నారు. 2029లో రాహుల్‌గాంధీ ప్రధాని కాబోతున్నారని జోస్యం చెప్పారు. దేశంలో ఎక్కడాలేని.. విధంగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం విక్రమార్క ఆధ్వర్యంలో వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు రేషన్‌కార్డుల పంపిణీ చేస్తామని, కుటుంబంలో ఒక్కొక్కరికీ ఆరు కిలోల సన్న బియ్యం అందజేస్తామన్నారు. తండాలతో తనకు ఎంతో అనుబంధం ఉందని, పార్లమెంట్‌లో పలుమార్లు గిరిజనుల, ఆదివాసీల గురించి ప్రస్తావించానన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 12:47 AM