Share News

పాదయాత్రలో ప్రత్యేకం పుంగనూరు ఆవు

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:44 AM

గో రక్షణ కోసం కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సాగుతున్న బాలకృష్ణ గురుస్వామి మహాపాదయాత్రలో తోడుగా నడుస్తున్న తెలుగు రాష్ట్రానికి చెందిన పుంగనూరు జాతి ఆవు అందరినీ ఆకర్షిస్తోంది.

పాదయాత్రలో ప్రత్యేకం పుంగనూరు ఆవు
పాదయాత్రలో తన వెంట తీసుకెళ్తున్న పుంగనూరు జాతి ఆవుతో బాలకృష్ణ గురుస్వామి

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు గో రక్షణ పేరిట పాదయాత్ర

గురుస్వామికి తోడుగా ఆవు కూడా...

ఆవు కోసం ప్రత్యేక వాహనం, ఏర్పాట్లు

చౌటుప్పల్‌ టౌన, జనవరి 6 ( ఆంధ్రజ్యోతి) : గో రక్షణ కోసం కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సాగుతున్న బాలకృష్ణ గురుస్వామి మహాపాదయాత్రలో తోడుగా నడుస్తున్న తెలుగు రాష్ట్రానికి చెందిన పుంగనూరు జాతి ఆవు అందరినీ ఆకర్షిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన అఖిల భారత గో సేవ ఫౌండేషన చైర్మన బాలకృష్ణ గురుస్వామి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ 2024 సెప్టెంబరు 27న కాశ్మీర్‌లోని లాల్‌చౌక్‌ నుంచి గో రక్ష మహా పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర 14 రాష్ట్రాల మీదుగా ఐదు వేల కిలోమీటర్లు సాగి తమిళనాడులోని కన్యాకుమారిలో ముగియనుంది. గోరక్షణ కోసం జరుగుతున్న యాత్రలో స్వయంగా గోవు కూడా పాల్గొంటుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సుమారు 5 వేల కిలోమీటర్ల పాదయాత్రలో ఒక గోవు పాల్గొనడం ఇదే మొదటిగా నిర్వాహకులు తెలిపారు. ఇది ఒక నూతన ప్రక్రియకు నాందిగా వారు భావిస్తున్నారు.

పుంగనూరు జాతి గోవు

ఆంధ్రప్రదేశలోని చిత్తూరు జిల్లా పుంగనూరు జాతికి చెందిన ఆవు అనేక విశిష్టతలను కలిగి ఉంది. మూడు సంవత్సరాల 4 నెలల వయస్సు కలిగిన ఈ ఆవు కాశ్మీర్‌ నుంచి బాలకృష్ణ గురుస్వామి చేపట్టిన మహాపాదయాత్రలో ఆకర్షణగా నిలుస్తోంది. గురుస్వామి రోజుకు 35 నుంచి 40 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తుండగా, ఈ పాదయాత్రలో 6 నుంచి 8 కిలోమీటర్లు ఈ ఆవు నడుస్తుంది. ఆవుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక వాహనంలో ఫ్యాన్లతో పాటు ఏసీలను అమర్చారు. ఆయా ప్రాంతాలలో నెలకొనే వాతావరణాలను బట్టి ఆవు సంరక్షణకు ఫ్యాన్లు, ఏసీలను వినియోగిస్తుంటారు. ఈ గోవుకు అయ్యప్పమాల ధారణ చేశారు. ఆవుకు ఇరుమడిని కట్టారు. ఈ ఆవు 2025 మార్చి 5న కేరళలోని శబరిమలైలోని అయ్యప్పస్వామిని దర్శించుకుంటుంది. కేరళ రాష్ట్రంలో సాగే పాదయాత్రలో భాగంగా అయ్యప్పస్వామిని ఆవు దర్శించుకుంటుందని యాత్ర నిర్వాహకులు తెలిపారు. ఇందుకు సంబంధించి అక్కడ ప్రత్యేకఏర్పాట్లు చేయనున్నారు. పాదయాత్ర అనివార్య కారణాలతో 15 రోజులు ఆలస్యం కావడంతో అయ్యప్ప దర్శనం కూడా మరో 15 రోజులు పొడిగించే అవకాశాలు ఉంటాయి.

15 రోజుల విరామం అనంతరం

యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ చేరుకున్న పాదయాత్ర 15 రోజుల విరామం అనంతరం ఈ నెల 9న బాలకృష్ణ గురుస్వామి మహాపాదయాత్ర పునఃప్రారంభం కానుంది. కశ్మీర్‌లో ప్రారంభమైన మహా పాదయాత్ర హిమాచల్‌ ప్రదేశ, పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన, ఉత్తరప్రదేశ, మధ్యప్రదేశ, మహారాష్ట్ర మీదుగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించి డిసెంబరు 25న చౌటుప్పల్‌ పట్టణానికి చేరుకుంది. ఇక్కడ వ్యాన నుంచి ఆవును కిందకు దించే సమయంలో స్వాగతం పలికే భక్తుల రద్దీ అధికమై తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో ఆవు దూకడంతో బాలకృష్ణ గురుస్వామి గాయపడ్డారు. ఎముకలు విరగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్యుల సలహా మేరకు అప్పటి నుంచి చౌటుప్పల్‌లోనే చికిత్స పొందుతున్నారు. గురుస్వామి ఆరోగ్యం కొంత మెరుగు కావడంతో పాదయాత్రను ఇక్కడి నుంచి ఈ నెల 9న పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పాదయాత్ర తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో సాగనుంది. కేరళ నుంచి తిరిగి తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకుంటుంది. ఇప్పటివరకు 90రోజులు సాగిన ఈ పాదయాత్ర మరో 90రోజుల పాటు సాగి కన్యాకుమారికి చేరుకుంటుంది. 2024 సెప్టెంబరు 27న ప్రారంభమైన పాదయాత్ర 14రాష్ట్రాల మీదుగా 5 వేల పై చిలుకు కిలోమీటర్లు సాగి ఈ ఏడాది మార్చి 27న ముగియాల్సి ఉంది. కానీ గురుస్వామి గాయపడిన సంఘటనతో మరికొన్ని రోజులు ఆలస్యం జరగనుంది. ఇప్పటివరకు గురుస్వామి 2,780 కిలోమీటర్లు పాదయాత్ర చేయగా, మిగిలిన రాష్ట్రాల్లో మరో 2300 కిలోమీటర్ల పాదయాత్రను నిర్వహించాల్సి ఉంటుంది.

రెండున్నర అడుగుల ఎత్తు

ఈ ఆవు రెండున్నర అడుగుల ఎత్తు, మూడున్నర అడుగుల వెడల్పుతో బలిష్టంగా ఉంది. తోక నేలకు తాకుతుంది. సుమారు రెండు కిలోల వెండితో కిరీటం, గొలుసు, కాళ్ల కడాలు, కొమ్ములకు బుర్రలు తదితర ఆభరణాలతో పాటు పట్టు వసా్త్రలను అలంకరిస్తున్నారు. పుంగనూరు జాతి ఆవులు ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఈ జాతికి సంబంధించిన ఆవు పాలనే అభిషేకాలకు ఉపయోగిస్తారు. పచ్చగడ్డితో పాటు ఎండు గడ్డిని మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది. స్వచ్ఛమైన పాలను అందిస్తుంది. కొన్ని ప్రాంతాలలో వాతావరణం సరిపడక జ్వరం బారిన పడిన ఆవుకు అందుకు తగిన నివారణ మందులను తాగిస్తున్నట్లు బాలకృష్ణ గురుస్వామి తెలిపారు. బాలకృష్ణ గురుస్వామితో పాటు ఆవు స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో విశ్రాంతి తీసుకుంటుంది. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ప్రముఖ అయ్యప్ప భక్తుడు బొబ్బిళ్ల మురళి గురుస్వామి చేశారు.

ప్రధాన మోదీ ఇంటిలో...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటిలో పుంగనూరు జాతికి చెందిన ఆవు పూజలు అందుకుంటుంది. ఈ ఆవును పూజించిన అనంతరమే మోదీ తన అధికారిక, అనధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారు అని గురుస్వామి తెలిపారు.

Updated Date - Jan 07 , 2025 | 12:44 AM