గోవర్ధనగిరిధారిగా ఏకశిఖరవాసుడు
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:23 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి.

యాదగిరిగుట్ట, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. లోక కల్యాణం కోసం చేపట్టిన ఉత్సవాల్లో ఆరో రోజైన గురువారం యాదగిరీశుడిని ‘గోవర్ధనగిరిధారి’ అలంకరణలో భక్తులు సేవించారు. భక్తజన రక్షణే ధ్యేయంగా అవతారాలు దాల్చిన స్వామివారు ప్రకృతి బీభత్సం నుంచి కాపాడే భక్తజన బాంధవుడిగా శ్రీకృష్ణుడి లీలలను ప్రతిబింభించే అలంకరణలో దివ్య మనోహరంగా భక్తజనులకు దర్శనమిచ్చారు. తన చిటికెన వేలుతో గోవర్థన పర్వతాన్ని ఎత్తిపట్టి గోపాలులను రక్షించిన మహిమలను అర్చకులు అలంకార విశిష్టతను భక్తులకు వివరించారు.భక్తుల గోవిందనామ స్మరణల మధ్య వైభవంగా ఊరేగించారు. ఉత్సవాలను ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, అర్చక బృందం, వేదపడింతులు, రుత్వికులు శాసో్త్రక్తంగా నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నర్సింహమూర్తి, ఈవో భాస్కర్‌రావు, డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవోలు ప్రతాప నవీనకుమార్‌శర్మ, జూశెట్టి క్రిష్ణ, గజ్వేల్లి రమే్‌షబాబు, రఘు, పర్యవేక్షకులు నాగుల మహే్‌షగౌడ్, దీరావత రామరావునాయక్, రాజనబాబు, వాసం వెంకటేశ్వర్లు, దాసోజు నరేష్, రాకే్‌షరెడ్డి, ముద్దసాని నరేష్, వేముల వెంకటేశ, ఉద్యోగ, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
సింహ వాహనంలో నారసింహుడు
దుష్ట శిక్షణ..శిష్ఠ రక్షణకు నారసింహుడిగా అవతరించిన స్వామివారు రాత్రి మృగరాజు సింహవాహనంపై భక్త జనుల పూజలు అందుకున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రాత్రి వేళ దివ్యవాహన సేవలు అందుకోవడం ఆలయ సంప్రదాయం. పట్టువసా్త్రలు, ముత్యాల, బంగారు ఆభరణాలు, వజ్రవైఢూర్యాలతో తేజోరూపుడు నారసింహుడు అడవికే రాజైన సింహ వాహనంపై అధిష్ఠించి భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామునే స్వయంభువులను కొలుస్తూ నిత్యారాధనలు, ఆలయ మండపంలో దివ్య ప్రబంధ పారాయణాలు, మూలమంత్ర, మూర్తిమంత్ర జపాలు, క్షేత్ర మహాత్యం పఠనాలను రుత్వికులు, అర్చకులు చేపట్టారు. యాగశాలలో పంచసూక్తాలు, మూల మంత్రాలతో హోమ పూజలు జరిపారు. అలంకార సేవకు దేవస్థాన కల్యాణ మండపంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రుత్వికుల పారాయణాలు, మంగళవాయిద్యాల మధ్యన తిరువీధుల్లో ఊరేగారు. స్థానిక శ్రీ వైష్ణవ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రభాతభేరి సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు జరిపారు.
సీఎం సిబ్బంది
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం భద్రత సిబ్బంది ఆలయాన్ని సందర్శించారు. హైదరాబాద్ మొయినాబాద్‌లో శిక్షణ పూర్తిచేసుకున్న సిబ్బంది క్షేత్రాన్ని సందర్శించారు.
నేటి నుంచి విశేష ఘట్టాలు
మూడు రోజుల పాటు ప్రధాన ఘట్టాలు
ఏటా 11 రోజుల పాటు నిర్విఘ్నంగా సాగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో విశేష ఘట్టాలైన ఎదుర్కోళ్ల ఉత్సవం(శుక్రవారం), తిరుకళ్యాణమహోత్సవం(శనివారం), దివ్యవిమాన రథోత్సవం(ఆదివారం) వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల పాటు కొండకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇందుకోసం ఆలయ అధికారులు తాగునీరు, ప్రసాదాలు, ఉత్సవాల వేళ రెండు వేల మంది భక్తులకు అన్నదాన సదుపాయాలు కల్పనకు సర్వం సిద్ధం చేశారు. విశేష ఘట్టాలకు సీఎం ఏ రేవంతరెడ్డి ఉత్సవాలకు హాజరుకావొచ్చని సంకేతాలు ఉండగా దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ వస్తున్నట్లు సమాచారం. వార్షిక బ్రహ్మోత్సవాలకు ప్రముఖులు వస్తున్నందున మూడు రోజుల పాటు 300మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు యాదగిరిగుట్ట ఏసీపీ రమే్‌షకుమార్ తెలిపారు.
ఆకట్టుకున్న సంగీత సభలు
లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధార్మిక, సాహిత్య, సంగీత సభలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ శాస్త్రీయ సంగీత, తితిదే ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు గురువారం యాదగిరికొండపై ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు భక్తులను అలరించాయి. ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు ఏ.కే. శ్రీనివాసాచార్యులు (హైదరాబాద్) భగవత భక్తులు, రక్షించిన విధానంపై ఉపన్యాసం, 10 నుంచి 11.30 గంటల వరకు ముదపాక బాలసుందరం(తాడేపల్లిగూడెం) విరాటపర్వం హరికథ గానం, 11.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు స్వరణ డాన్స(హైదరాబాద్) అకాడమీ బృందం భరతనాట్యం, 12.15 నుంచి ఒంటి గంట వరకు వింజమూరి లక్ష్మీ బృందం(మహతి ఆర్ట్స్, హైదరాబాద్), దుర్గాబాయ్ దేశముఖ్(హైదరాబాద్) ఫైన ఆర్ట్స్ బృందం భక్తిసంగీతం కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.