Share News

పాతగుట్టలో కన్నుల పండువగా ధ్వజారోహణం

ABN , Publish Date - Feb 08 , 2025 | 11:47 PM

యాదగిరిగుట్ట దేవస్థాన అనుబంధ ఆలయం పాతగుట్ట లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ధ్వజారోహణంతో ఉత్సవసంరంభం ఆరంభమైంది.

పాతగుట్టలో కన్నుల పండువగా ధ్వజారోహణం
పాతగుట్ట ఆలయంలో ధ్వజారోహణ పర్వాలు

భువనగిరి అర్బన, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : యాదగిరిగుట్ట దేవస్థాన అనుబంధ ఆలయం పాతగుట్ట లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ధ్వజారోహణంతో ఉత్సవసంరంభం ఆరంభమైంది. బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను భువి నుంచి దివికి ఆహ్వానించేందుకు మహావిష్ణువు వాహనం గరుత్మంతుడిని ఆహ్వానిస్తూ ధ్వజారోహణ పర్వాలను నిర్వహించారు. శ్వేతవస్త్రంపై గరుత్మంతుడిని వేదమంత్రాలతో ఆవాహన జరిపి గరుడముద్దలను ఎగురవేశారు. అనంతరం ఆ ముద్దలను భక్తులకు వితరణచేశారు. అంతకుముందు యాగ శాలలో హోమ పూజలు కొనసాగాయి. స్వామిని అలంకరించి తిరువీధులలో ఊరేగించారు. ఆలయయజ్ఞమండపంలో అధిష్ఠింపచేసి మూలమంత్ర జపం, మూర్తికుంభ, మహామూర్తి కుంభ, ఉపమూర్తి కుంభ స్థాపన చేశారు.

భేరీపూజ, దేవతాహ్వానం

నిత్యారాధనల అనంతరం సాయంత్రం భేరీపూజతో దేవతాహ్వానం జరిగింది. సప్తస్వరాలు, ఇష్ట వాయిద్యాలతో దిక్పాలకులను ఆహ్వానించడానికి శబ్ధ బ్రహ్మం, మూలమంత్ర జపంతో ప్రధాన వాయిద్యం ‘భేరీ’ని మ్రోగించి కంకణధారణ చేయడం ఈ ఉత్సవ ప్రత్యేకత. ఈ పూజా పర్వాలను దేవస్థాన ప్రధానార్చకులు నల్లంథిఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, ఉపప్రధానార్చకులు భట్టర్‌ సురేంద్రాచార్యులు, పాతగుట్ట ముఖ్య అర్చకులు కొడకండ్ల మాధవాచార్యులు, అర్చకబృందం, రుత్వికులు నిర్వహించగా వేడుకల్లో ఈవో భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నరసింహమూర్తి, డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవో దూశెట్టి క్రిష్ణ, పర్యవేక్షకుడు శంకర్‌నాయక్‌, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

నేటి నుంచి అలంకార సేవోత్సవాలు

పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నుంచి అలంకార సేవలు నిర్వహించనున్నారు. స్వామి వివిధ వాహనసేవల్లో ఉదయం, సాయంత్రం వేళలో దశావతారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆదివారం సింహవాహన, అశ్వవాహన సేవల్లో స్వామిని ఊరేగింపు నిర్వహించనున్నారు.

శాసో్త్రక్తంగా లక్ష పుష్పార్చన

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శనివారం ఏకాదశి పూజలు శాసో్త్రక్తంగా జరిగాయి. ప్రధానాలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులకు సహస్రనామ పఠనాలు, వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన చేపట్టారు. అదేవిధంగా నిత్యపూజలు కొనసాగాయి. పంచామృతాలతో అభిషేకించి తులసీ దళాలతో అర్చించారు. ప్రాకార మండపంలో సుదర్శన హోమం, నిత్య కల్యాణోత్సవం వైభవంగా చేపట్టారు.అదేవిధంగా అష్టభుజి ప్రాకార మండపంలో శతక పఠనాలతో హవనం నిర్వహించారు. అనంతరం గజవాహన సేవలో ఊరేగించి విశ్వక్సేనుడి తొలిపూజలతో నిత్య తిరుకల్యాణోత్సవం చేపట్టారు. సాయంత్రం ప్రధానాలయ ముఖమండపంలో దర్బారు సేవోత్సవం చేపట్టిన ఆచార్యులు సాయంత్రం అలంకార వెండీ జోడు సేవలు, సహస్రనామార్చనలు జరిపారు. శివాలయంలో నిత్యారాధనలు, యాగశాలలో నిత్య రుద్రహవన పూజలు కొనసాగాయి. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.39,96,694 ఆదాయం సమకూరినట్లు ఈవో భాస్కర్‌రావు తెలిపారు.

మరువలేని అనుభూతి కలిగింది

ప్రధాన న్యాయమూర్తి సుజోయ్‌పాల్‌

యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం మరువలేని గొప్ప అనుభూతి కలిగిందని హైకోర్టు ప్రధానన్యాయమూర్తి సుజోయ్‌పాల్‌ అన్నారు. స్వామిఅమ్మవారలను శనివారం ఆయన కుటుంబసమేతంగా దర్శించుకొని, మాట్లాడారు. స్వామివారిని దర్శించుకోవడం తాను అదృష్టంగా భావిస్తున్నానని, ఆధ్యాత్మిక భావన మరింత పెంపొందిందన్నారు. అద్భుతమైన నిర్మాణ ప్రాకారాలు, ఆలయ నిర్వాహణ తీరు ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. అంతకు ముందు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలకగా ధ్వజస్థంభానికి మొక్కులు తీర్చుకున్నారు. ఆయన వెంట యాదాద్రి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. జయరాజు, అదనపు న్యాయమూర్తి సంపూర్ణ ఆనంద్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 11:47 PM