జిల్లాలోనే తొలి సేవాలాల్ ఆలయం
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:57 AM
గిరిజనుల ఆరాధ్య దైవమైన సంతసేవాలాల్ ఆలయాన్ని జిల్లాలోనే మొదటిసారి రాజాపేట మండలంలోని పుట్టగూడెం గ్రామంలో గ్రామస్థులు నిర్మిస్తున్నారు.

దాతల సహకారంతో ఆలయ నిర్మాణం
నేడు పుట్టగూడెంలో సేవాలాల్ జయంతి
రాజాపేట, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల ఆరాధ్య దైవమైన సంతసేవాలాల్ ఆలయాన్ని జిల్లాలోనే మొదటిసారి రాజాపేట మండలంలోని పుట్టగూడెం గ్రామంలో గ్రామస్థులు నిర్మిస్తున్నారు. గ్రామంలో 250 పైగా కుటుంబాలు ఉండగా 1800 జనాభా ఉంది. గ్రామంలోని గిరిజనులు అంతా తలా కొంత పోగుచేసి సుమారుగా 70 లక్షల రూపాయల అంచనాతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 16 లక్షల రూపాయలు వెచ్చించి ఆలయ గోపురాన్ని నిర్మించారు. ఆలయంలో సంతసేవాలాల్, మేరా మారి, సీత్లాభవాని, విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం వద్ద భక్తులకు వసతి సౌకర్యాలను కల్పిస్తున్నారు. 6 నెలల్లో ఆల యం పూర్తికానుంది. దీంతో పాటు గిరిజనుల సాంస్కృతిక సంప్రదాయాలకు అద్దం పట్టేటట్లుగా నిర్మాణం సాగించనున్నారు.
నిఽధులు సేకరణ ఇలా..
ఆలయ నిర్మాణం కోసం గ్రామస్థులు విరాళాలను అందిస్తున్నారు. గ్రామంలో ఏ విధమైన వివాదాలు జరిగినా గ్రామంలోనే పరిష్కరించుకుని, కొంత నగదును ఆలయానికి విరాళంగా అందజేస్తున్నారు. కొంత మంది దాతల సహకారంతో నిధులు సేకరణ జరిపి నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నారు.
నేడు సేవాలాల్ జయంతి
సంతసేవాలాల్ జయంతిని శనివారం మండంలోని పుట్టగూడెంలో గిరిజనులు ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయమే తమ ఇళ్లను శుభ్రం చేసుకుని గ్రామస్థులందరూ పిల్లపాపలతో సేవాలాల గుట్ట పైకి డప్పువాయిద్యాలతో తరలివెళ్తారు. ప్రతీ ఇంటి నుంచి నీటిని తీసుకువెళ్లి, మేరామారి, సంతసేవాలాల్ విగ్రహాలకు జలాభిషేకం నిర్వహిస్తారు. యజ్ఞంతో పాటు బోగ్‌పాండారు నిర్వహించి మొక్కులను చెల్లించుకుంటారు. కొద్దిసేపు తమ గ్రామస్థులతో సంప్రదాయాలు, తదితర అంశాలను చర్చించుకుంటారు. గ్రామస్థులందరూ ఐక్యంగా ఒకే దగ్గర కలుసుకొని సంప్రదాయాలు తమ కట్టుబాట్లు తదితర అంశాలను చర్చించుకుంటారు. అనంతరం గ్రామస్థులందరూ సహపంక్తి వనభోజనాలను నిర్వహిస్తారు.
జిల్లాలోనే మొదటిది
పుట్టగూడెంలో నిర్మిస్తున్న సంతసేవాలాల్ ఆలయం జిల్లాలోనే మొదటిది. ఇప్పటివరకు 15 లక్షల రూపాయలు వెచ్చించాం. ఆలయ నిర్మాణ కొంతవరకు జరిగింది. మరో ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి కానుంది.
-భూక్యా లచ్చునాయక్, గిరిజన నాయకుడు, పుట్టగూడెం