Share News

కొత్త పీఏసీఎ్‌సల కోసం కసరత్తు ముమ్మరం

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:31 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 73మండలాల్లో కొత్తగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేయడంకోసం కసరత్తు ముమ్మరం చేశారు. అయితే సొసైటీల ఏర్పాటు అదనంగా చేస్తే ఉన్న సిబ్బందితోనే సొసైటీలను నడపాల్సి ఉంటుంది.

కొత్త పీఏసీఎ్‌సల కోసం కసరత్తు ముమ్మరం

అధికారులు, డీసీసీబీ పాలకవర్గం మల్లగుల్లాలు

రీఆర్గనైజేషన్‌ చేస్తే సిబ్బంది కొరతతో ఇబ్బందులే

ఉమ్మడి జిల్లాలో సొసైటీల కోసం ప్రతిపాదనలు

(ఆంధ్రజ్యోతి-నల్లగొండ): ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 73మండలాల్లో కొత్తగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేయడంకోసం కసరత్తు ముమ్మరం చేశారు. అయితే సొసైటీల ఏర్పాటు అదనంగా చేస్తే ఉన్న సిబ్బందితోనే సొసైటీలను నడపాల్సి ఉంటుంది. ప్రస్తుతం సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో కొత్త పీఏసీఎ్‌సల నిర్వహణ ఏ మేరకు సఫలీకృతమవుతాయన్న దానిపై ఆదిలోనే కొంతమేరకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా ఏర్పడిన మండలాల్లో నూతన పీఏసీఎ్‌సల ఏర్పాటుతోపాటు కొన్ని మండలాల్లో గ్రామాలసంఖ్య అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా సొసైటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల రీఆర్గనైజేషన్‌ కోసం జరుగుతున్న కసరత్తుపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకుంటుంది. సొసైటీల విస్తరణ జరిగితే ఆయా ప్రాం తాల భౌగోళిక పరిస్థితులు, రైతుల సంఖ్య, దూరం ఎంత ఉంటుంది అనే దానిపై పరిశీలించాల్సి ఉంటుంది. కొత్త సొసైటీలను ఏర్పాటుచేస్తే పంట రుణాల మం జూరు, ఎరువులు, విత్తనాల విక్రయం, ధాన్యం కొనుగోలు కేంద్రాలవంటి నిర్వహ ణ సేవల విస్తరణను మరింత పెంచాలని పాలకవర్గం ఆలోచిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని నూతన పీఏసీఎ్‌సలను ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.

నూతనంగా సొసైటీలను ఏర్పాటు చేయాలంటే ఆర్‌సీఎ్‌స(రిజిస్టర్‌ ఆఫ్‌ కోఆపరేటి వ్‌ సొసైటీస్‌) ఆమోదం తప్పనిసరిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో డీసీసీబీ చైర్మన్‌ కుంభం శ్రీనివా్‌సరెడ్డితోపా టు పలువురు అధికారులు పా ల్గొన్నారు. ఇందులో ఆర్‌సీఎస్‌ అధికారులతోపాటు ఇతర అనుబంధశాఖ అధికారులంతా పాల్గొని సమీక్షలు నిర్వహించారు. సొసైటీలను ఏర్పాటుచేస్తే అందుకు కావాల్సిన సిబ్బంది, కార్యాలయాలు ఇతర ఏర్పాట్లు అన్ని చేయాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని వస్తున్న ప్రతిపాదనలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆర్‌సీఎస్‌ ఆమోదం తెలియజేయనుంది. అంతా సులువుగా ఆమోదం తెలియజేస్తే నిర్వహణ భారం అధికమై సొసైటీలు నిర్వీర్యమయ్యే అవకాశాలుంటాయి. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 107 సొసైటీల వర కు ఉన్నాయి. ఈ సొసైటీలు అన్ని ప్రస్తుతం ప్రగతి పథంలో ఉన్న పరిస్థితుల్లో కొత్త సొసైటీల ఏర్పాటు వల్ల ప్రయోజనం మెరుగుపడాలి తప్ప ఏమాత్రం సొసైటీల నిర్వహణ సిబ్బంది కొరత మూలంగా ఇబ్బందులు తలెత్తకూడదనేది స్పష్టమవుతుంది. కొత్త సొసైటీల వల్ల ఆయా సొసైటీలకు చైర్మన్‌తోపాటు సీఈవో, కొత్త సిబ్బంది వస్తారు. ఆయా సొసైటీల పరిధిలో రైతులకు మెరుగైన సేవలు అందుతాయని నమ్మిన తర్వాతే ముందుకు సాగాలని డీసీసీబీ పాలకవర్గంతోపాటు ప్రభుత్వం ఆర్‌సీఎస్‌, నాబార్డు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రూ.2700కోట్లకు పైగా టర్నోవర్‌తో జిల్లా సహకారకేంద్ర బ్యాంకు ముందుకు సాగుతూ మొత్తం రూ.3వేల కోట్ల టర్నోవర్‌ చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సొసైటీల ఏర్పాటు వల్ల డీసీసీబీకి మరింత బలం చేకూరాలన్న ఆలోచనతో పాలకవర్గం అడుగులు వేస్తుంది. అదేవిధంగా ఇటీవల 20 రోజులపాటు నాబార్డు బృందం డీసీసీబీలో రెండేళ్లుగా నిర్వహణ తీరుపై పరిశీలన చేసి అభినందించింది. నూటికి99శాతం సరిగ్గా అకౌంటింగ్‌ నిర్వహించడం, అదేవిధంగా రుణాల పంపిణీ, డిపాజిట్‌ల పెంపుదల, టర్నోవర్‌, ఇతర అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి పాలకవర్గం పనితీరును మెచ్చుకున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు అత్యధికంగానే పీఏసీఎ్‌సలు వస్తాయన్న ఆలోచనతో, ఆశాభావంతో ఉన్నారు.

ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున ప్రతిపాదనలు

కొత్త సొసైటీలకోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రతిపాదనలు వస్తున్నట్లు సమాచారం. రాజకీయంగా చూస్తే చైర్మన్‌ పదవులతోపాటు, ఆ సొసైటీలకు డైరెక్టర్‌ పదవులకు కూడా అధికమవుతాయన్న ఆలోచనతో ఆ ప్రాంత రాజకీయనాయకులు కూడా ఉండటంతో తమకు సొసైటీలు కావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే జిల్లా సహకార అధికారులు, డీసీసీబీ పాలకవర్గం సమన్వయంతో కొత్త మండలాలను పరిగణలోకి తీసుకొని సొసైటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని మండలాలకు అఽధికంగా సొసైటీలు కావాలని కోరినట్లయితే వాటిని కూడా ఆర్‌సీఎస్‌ పరిశీలన చేయాల్సి ఉంటుంది. మండలానికి రెండు సొసైటీలు అవసరమనుకుంటే రీఆర్గనైజేషన్‌ చేయవచ్చు అని, అదే పెద్ద మండలం అని భావించి ఐదు సొసైటీలను కోరినట్లయితే అది సాధ్యమయ్యే పరిస్థితి కాదనేది స్పష్టం అవుతుంది. 2013 తర్వాత కొత్తగా సహకార సంఘాల ఏర్పాటు చేయలేదు. 2023లో కొత్త సొసైటీల ఏర్పాటుకోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి లేఖ రాసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు తీసుకోవాలని నిర్ణయించింది.

రైతులకు మెరుగైన సేవల కోసం కొత్త సొసైటీలు

రైతులకు మెరుగైన సేవలను అందజేయడంకోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త సొసైటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. సొసై టీ ఏర్పాటు అదనంగా చేయడంవల్ల ఆ సొసైటీల సేవలు రైతులకు మరింత చేరువ కానున్నాయి. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్ని సొసైటీలు కొత్తగా ఏర్పాటు చేయాలనే దానిపై సమీక్షలు నిర్వహిస్తు న్నాం. సొసైటీలను రీఆర్గనైజేషన్‌ చేసిన తర్వాత ఆయా ప్రాంతాల్లో కార్యాలయాల ఏర్పాటు, సిబ్బంది కొరత లేకుండా చూడాల్సి ఉంటుం ది. రైతులకు మరింత ప్రయోజనం చేకూరడంకోసం రాష్ట్ర ప్రభు త్వం ఈ ఏర్పాట్లను చేస్తుంది. సొసైటీల విస్తరణ చేయడంవల్ల సేవలు మరింత సులభమవుతాయి. ఈ సొసైటీలను ఆ మోదంకోసం ఆర్‌సీఎస్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

- కుంభం శ్రీనివాస్‌ రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌, నల్లగొండ

నిడమనూరు మండలంలో పెరగనున్న సొసైటీలు

నిడమనూరు: నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలో ప్రస్తుతం నిడమనూరు, వెనిగండ్ల సహకార సంఘాలు ఉండగా కొత్తగా రెండు సహకార సంఘాలు ఏర్పాటు కానున్నాయి. తుమ్మడం, ఊట్కూరు గ్రామాల్లో పీఏసీఎ్‌సలుగా ఏర్పాటుచేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. నాన్‌ఆయకట్టు ప్రాంతంలోని కొన్నిగ్రామాలను కలిపి ఊట్కూరు సొసైటీగా, ఆయకట్టు ప్రాంతంలోని గ్రామాలను కలిపి తుమ్మడం సొసైటీగా ఏర్పాటుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.వచ్చే నెలలో సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలం ముగుస్తుంది. దీంతో కొత్త సహకార సంఘాలు ఏర్పాటుచేసిన తర్వాతే సొసైటీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త సహకారసంఘాలు ఏర్పాటుపై ఆయా గ్రామాల రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సహకార సేవలు రైతుల ముంగిట్లోకి వస్తాయని ఆశిస్తున్నారు. గతంలో మండలంలో నిడమనూరు, ఊట్కూరు, తుమ్మడం, వేంపాడ్‌, రేగులగడ్డ, వెనిగండ్ల ఆరు పీఏసీఎ్‌సలు ఉండేవి ఇందులో వెనిగండ్ల మినహా మిగతా ఐదు సంఘాలకు సొంత భవనాలు ఉన్నాయి. వేంపాడ్‌ పీఏసీఎస్‌ భవనాన్ని 1998లో నక్సల్స్‌ పేల్చివేశారు. ఇందులో నిడమనూరు మినహా తుమ్మడం, ఊట్కూరు, రేగులగడ్డ భవనాలు వినియోగంలో లేకపోవడంతో పాటు పాతవి కావడంతో శిథిలావస్థలో ఉన్నాయి. రేగులగడ్డలోని భవనం అన్యాక్రాంతమవుతుండటంతో ఇటీవల రూ.80వేలు వెచ్చించి ప్రహరీ ఏర్పాటు చేశారు. కాగా ఆర్థిక పరిపుష్టిలేని సంఘాలను ఇతర సొసైటీల్లో విలీనం చేయాలని 2005లో అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఊట్కూరు, తుమ్మడం, వేంపాడ్‌, రేగులగడ్డ నాలుగు సొసైటీలను నిడమనూరు సొసైటీలో విలీనం చేశారు. ఆర్థిక పరిపుష్టి కలిగి లాభాలతో నడుస్తుందన్న కారణంతో వెనిగండ్ల సొసైటీని అలాగే ఉంచారు. దీంతో ప్రస్తుతం మండలంలో నిడమనూరు, వెనిగండ్ల రెండు సొసైటీలు మాత్రమే ఉన్నాయి. ఇందులో 5,936 మంది సభ్యులతో నిడమనూరు పెద్ద సొసైటీగా ఉండి మంచి లాభాలతో నడుస్తుంది. అదేవిధంగా 851 మంది సభ్యులతో వెనిగండ్ల సొసైటీ పనిచేస్తుంది. మండలంలో కొత్తగా మరోరెండు సహకార సంఘాలు ఏర్పాటైతే సొసైటీల సంఖ్య నాలుగుకు చేరనుంది. కొత్త సహకార సంఘాల ఏర్పాటుకోసం ఆయా గ్రామాల్లోని రైతులు ఎదురుచూస్తున్నారు.

రెండు సొసైటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం

ఉన్నతాధికారుల సూచనతో మండలంలో కొత్తగా రెండు పీఏసీఎ్‌సలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాం. కొత్త సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నిడమనూరు సొసైటీ పరిధిలోని తుమ్మడం, ఊట్కూరులో కొత్త సంఘాలు ఏర్పడే అవకాశం ఉంది. తుమ్మడం, ఊట్కూరు గ్రామాల్లో సొసైటీలకు సొంత భవనాలు కూడా ఉన్నాయి.

బుచ్చాల జానయ్య, సీఈవో, నిడమనూరు సొసైటీ.

Updated Date - Jan 07 , 2025 | 12:31 AM