Share News

పెద్దగట్టుకు చేరిన దేవరపెట్టె

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:30 AM

ఓ లింగా.. ఓ లింగా అంటూ నామస్మరణలు, భేరీ చప్పుళ్లు, కఠారీ విన్యాసాల నడుమ సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని దురాజ్‌పల్లి శ్రీ లింగమంతులస్వామి(పెద్దగట్టు) జాతర ఆదివారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

 పెద్దగట్టుకు చేరిన దేవరపెట్టె
డోలు వాయిస్తున్న జగదీష్‌రెడ్డి, పూజల్లో పాల్గొన్న పటేల్‌ రమేష్‌రెడ్డి

ఓ లింగా.. ఓ లింగా అంటూ నామస్మరణలు, భేరీ చప్పుళ్లు, కఠారీ విన్యాసాల నడుమ సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని దురాజ్‌పల్లి శ్రీ లింగమంతులస్వామి(పెద్దగట్టు) జాతర ఆదివారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం రాత్రి సూర్యాపేట మండలంలోని కేసారం నుండి ఆచారం ప్రకారం దేవరపెట్టెను భక్తిశ్రద్దలతో పెద్దగట్టుకు పోలీస్‌ బందోబస్తు నడమ తరలించారు. భక్తులతో పెద్దగట్టు పరిసర ప్రాంతాలు కిక్కిరిసాయి.

(ఆంధ్రజ్యోతి- సూర్యాపేట(కలెక్టరేట్‌)

పెద్దగట్టుకు ఆదివారం ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. సూర్యాపేట జిల్లా కేంద్రం, పరిసర ప్రాంతాల భక్తులు లింగమంతులస్వామి, ఆకుమంచమ్మ, యలమంచమ్మ, సౌడమ్మ దేవతలను దర్శించుకున్నారు. గంపలు, బోనాలు తలపై పెట్టుకొని గజ్జెలు కట్టి నృత్యాలు చేస్తూ బోనాలు సమర్పించారు. గుడి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేశారు. కోనేరులో భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు. సారలమ్మకు, నాగదేవతకు, ఎల్లమ్మత ల్లికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది భక్తులు ఆదివారం మధ్యాహ్నానికే పెద్దగట్టుకు చేరుకున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన కొంతమంది భక్తులు ఆదివారం ఉదయం నుండే లింగమంతులస్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. భక్తుల సంఖ్య సాయంత్రానికి మరింతగా పెరిగింది.

పెద్దగట్టుకు చేరిన పసిడికుండ

పెద్దగట్టు శ్రీ లింగమంతులస్వామి జాతర ప్రారంభం రోజు సాంప్రదాయ బద్ధంగా ఆదివారం మధ్యాహ్నం సమీప గ్రామమైన ఖాసీంపేట నుంచి పసిడి కుండను సాంప్రదాయ చప్పుళ్ల మధ్య పెద్దగట్టుకు చేర్చారు. అనంతరం పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అర్ధరాత్రికి జనసంద్రం

జాతర ప్రాంతమంతా ఆదివారం అర్ధరాత్రి 12గంటలకు జనసంద్రమైంది. చీమల దండులా వాహనాలు ఒకదాని వెనుక ఒకటి జాతరకు బయలుదేరాయి. ఓ లింగా, ఓ లింగా నామస్మరణలతో జాతర ప్రాంతం మారుమ్రోగిపోయింది. ఆదివారం రాత్రి 11 గంటల నుంచి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి లారీలు, ట్రాక్టర్లలో తరలివచ్చారు. 65వ జాతీయ రహదారిపై సూర్యాపేట నుంచి మూడు కిలోమీటర్ల దాకా భక్తుల వాహనాలే కనిపించాయి. పోలీస్‌ సిబ్బంది అడుగడుగునా ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా సూచించిన ప్రకారం ప్రాంతాలను బట్టి వాహనాలను ఆయా పార్కింగ్‌ ప్రదేశాలకు తరలించారు.

గుడి చుట్టూ ప్రదక్షిణ

ఆదివారం అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత భక్తులు గంపలను నెత్తిపై పెట్టుకొని కాళ్లకు గజ్జెలు కట్టుకొని గొర్రెలకు అలంకరణ చేసి లింగమంతుల స్వామి గుడి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ లు చేశారు. కుటుంబ సభ్యులంతా ప్రదక్షణలో పాల్గొన్నారు. అనంతరం గుట్టపైన జంతు బలులు జరిగాయి. సోమవారం ఆరు లక్షలకు పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.

జాతరలో నేడు

నేడు తెల్లవారుజాము నుంచి గుట్ట వద్ద భక్తులు పసుసు, కుంకుమతో బోనాన్ని అలంకరించుకొని ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి దేవుళ్లకు బోనాలు సమర్పిస్తారు. బోనాల సమర్పణ సందర్భంగా ఆలయం కిటకిటలాడనుంది. పెద్దసంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా. ఇందుకు తగ్గట్టుగా అధికారులు, దేవాలయ సమన్వయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

నేడు పెద్దగట్టుకు మంత్రి ఉత్తమ్‌

లింగమంతులస్వామిని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం దర్శించుకోనున్నారు. ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గంలో బయలుదేరి 8 గంటలకు దురాజ్‌పల్లికి చేరుకుంటారు. అనంతరం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం మంత్రి తిరిగి హైదరాబాద్‌కు వెళతారు. ఇందుకు సంబం ధించి ఏర్పాట్లు చేశారు.

నేడు

ఉమ్మడి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

పెద్దగట్టు జాతర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు జాతర సందర్భంగా లోకల్‌ హాలిడేగా అమలుచేయాలని ఆదేశించారు.

అనుమతి ఉన్న వాహనాలకే అవకాశం

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి మార్గంలో వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. జాతర ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలో వచ్చే అన్ని ప్రాంతాలల్లో బారీకేడ్లతో పాటు భారీబందోబస్తు ఏర్పాటుచేసి అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే జాతర ప్రాంతానికి అనుమతిస్తున్నారు. జాతరకు వచ్చే వాహనాలను జాతర సమీప పరిసరాల వరకు అనుమతించి పార్కింగ్‌ ప్రదేశాలకు పంపిస్తున్నారు. దురాజ్‌పల్లి సమీపంలోని హెచపీ పెట్రోల్‌ బంక్‌ నుంచి ఖాసీంపేట క్రాస్‌రోడ్డు వరకు వనవే ఏర్పాటుచేసి ఎలాంటి వాహనాలను అనుమతించలేదు. కేవలం పాదాచారులు మాత్రమే జాతరకు వెళ్లేలా చర్యలు చేపట్టారు.

Updated Date - Feb 17 , 2025 | 12:30 AM