Share News

ఉపాధ్యాయుల తీర్పుపై ఉత్కంఠ

ABN , Publish Date - Mar 01 , 2025 | 12:41 AM

పోటాపోటీగా సాగిన టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. భారీగా పోలింగ్‌ నమోదవడం, ప్రధాన అభ్యర్థుల నడుమ హోరాహోరీగా పోరు సాగడంతో ఉపాధ్యాయులు ఎవరికి పట్టంకట్టారనే అంశం ఆసక్తికరంగా మారింది.

ఉపాధ్యాయుల తీర్పుపై ఉత్కంఠ

ద్వితీయ ప్రాధాన్య ఓట్లే కీలకం

పంపిణీ డబ్బుపై ఆరా తీయిస్తోన్న అభ్యర్థులు

అభ్యర్ధుల్లో సడలని విశ్వాసం

ఈనెల 3న కౌంటింగ్‌కు సన్నాహాలు

(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): పోటాపోటీగా సాగిన టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. భారీగా పోలింగ్‌ నమోదవడం, ప్రధాన అభ్యర్థుల నడుమ హోరాహోరీగా పోరు సాగడంతో ఉపాధ్యాయులు ఎవరికి పట్టంకట్టారనే అంశం ఆసక్తికరంగా మారింది. బహుముఖ పోటీ సాగిందనే ప్రచారంతో మొదటి ప్రాధాన్య ఓట్లలో కోటా ఓటు ఎవరికీ దక్కకపోవచ్చని, ద్వితీయ ప్రాధాన్య ఓట్లే విజేతను నిర్ణయిస్తాయని ఉపాధ్యాయవర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఉపాధ్యాయవర్గాల అంచనాలతో పాటు, ఎ గ్జిట్‌పోల్స్‌ పేరుతో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న అంచనాలతో అభ్యర్థులు,వారి కోసం పనిచేసిన సంఘాల నాయకులు ఓట్లలెక్కల్లో మునిగారు.మరోవైపున ఈనెల3వ తేదీన కౌం టింగ్‌ కోసం నల్లగొండలోని స్టేట్‌వేర్‌హౌస్‌ గో దాములవద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ద్వితీయ ప్రాధాన్య ఓట్లే కీలకం

హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలో ద్వితీ య ప్రాధాన్య ఓట్లే విజేతని నిర్ణయిస్తాయని ఉపాధ్యాయవర్గాల అంచనా. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ, యూటీఎ్‌ఫటీఎస్‌ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్‌టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్‌రెడ్డి, బీసీ, బహుజనవాదంతో పోటీచేసిన మాజీ ఎమ్మెల్సీ పూలరవీందర్‌, టీపీఆర్‌టీయూ మద్దతుతో పోటీలో ఉన్న పీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తంరెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సుందర్‌రాజ్‌యాదవ్‌కు మొదటి ప్రాధాన్య ఓట్లు ఎక్కువగా పోలయ్యాయని అంచనా. అయితే బహుముఖ పోటీ నెలకొనడంతో మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ కోటా రావడం కష్టమేనని తెలుస్తోంది. దీంతో ద్వితీయ ప్రాధాన్య ఓట్లే కీలకంగా మారనున్నాయని భావిస్తున్నారు. ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలయ్యాక స్వతంత్ర అభ్యర్థులు బరి నుంచి తప్పుకున్నాక, ఎక్కువగా మొదటి ప్రాధాన్య ఓట్లు పోలై ఎలిమినేట్‌ అయ్యే అభ్యర్థుల్లో దక్కిన ద్వితీయ ప్రాధాన్య ఓట్లు ఎవరు అధికంగా రాబడితే వారిని విజయం వరిస్తుందని ఉపాధ్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో కీలక ఫ్యాక్టర్‌గా భావిస్తున్న గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ, ఆశ్రమ పాఠశాలలు, వ్యాయామ, భాషాపండితులు, ప్రైవేట్‌ ఉపాధ్యాయుల ఓట్లలో మెజార్టీ ఓట్లు ఎవరికి వచ్చాయనే అంశం కూడా విజేతను నిర్ణయించనుందని విశ్లేషిస్తున్నారు. మొత్తంగా ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తప్పనిసరిగా ఉంటుంద ని అంచనావేస్తున్నారు.

ఇచ్చిన డబ్బుపై ఆరా తీస్తున్న అభ్యర్థులు

ఈ ఎన్నికల్లో గతానికిభిన్నంగా పోటీని సవాల్‌గా తీసుకున్న కొందరు కీలక అభ్యర్థులు ఉపాధ్యాయులను ఆకర్షించేందుకు నగదు పంపిణీ చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే పంపిణీ చేసేందుకు వినియోగించిన ప్రతినిధులు కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు, సంఘాల అంచనాల మేరకు చెల్లింపులు చేయలేదని అభ్యర్థులకు, సంఘాల ముఖ్యనేతలకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వారు ఈ అంశంపై ఆరా తీస్తున్నారని చర్చ సాగుతోంది. ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులకు సంబంధించి క్షేత్రస్థాయిలో కొన్ని ప్రాంతాల్లో నిర్ణయించుకున్న ప్రకారం పంపిణీ జరగలేదని, దీనిపై ఇప్పటికే సదరు అభ్యర్థులకు పూర్తి సమాచారం వచ్చిందని, కౌంటింగ్‌ పూర్తయ్యాక దీనిపై ఏం చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుందామని ఫిర్యాదు చేసిన వారికి తెలిపినట్టు ప్రచారం సాగుతోంది.

3న కౌంటింగ్‌కు సన్నాహాలు

ప్రతిష్ఠాత్మకంగా సాగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్‌ నల్లగొండలోని ఆర్జాలబావి ప్రాంతంలోని స్టేట్‌వేర్‌హౌసింగ్‌ గోదాముల వద్ద చేపట్టేందుకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే గట్టి బందోబస్తు నడుమ స్ట్రాంగ్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ బాక్సులన్నీ స్ట్రాంగ్‌రూముల్లో భద్రపరిచాక అభ్యర్థుల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ దగ్గరుండి తాళాలువేసి సీల్‌ వేయించారు. తిరిగి కౌంటింగ్‌ జరిగే 3వ తేదీన వీటిని తెరిచి లెక్కింపు ప్రక్రియ చేపడతారు.

Updated Date - Mar 01 , 2025 | 12:41 AM