తాగునీటి కోసం తండ్లాట
ABN , Publish Date - Mar 05 , 2025 | 01:22 AM
తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. చెరువులు, కుంటలు ఎండిపోతుండడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటి బోర్లు, బావులు ఒట్టిపోతున్నాయి. దీంతో పల్లెల్లోనూ దాహం.. దాహం.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రోజురోజుకూ విస్తరిస్తున్న పట్టణ జనాభాకు సరిపడా నీరు లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తీవ్రమవుతోన్న తాగునీటి సమస్య
ఎండిన చెరువులు.. కుంటలు
పడిపోతున్న భూగర్భజలాలు
ఒట్టిపోతున్న బోరు బావులు
తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. చెరువులు, కుంటలు ఎండిపోతుండడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటి బోర్లు, బావులు ఒట్టిపోతున్నాయి. దీంతో పల్లెల్లోనూ దాహం.. దాహం.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రోజురోజుకూ విస్తరిస్తున్న పట్టణ జనాభాకు సరిపడా నీరు లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా రెండు మూడు రోజులకోసారి నీటి సరఫరా అవుతుండడంతో తాగునీటితోపాటు వినియోగానికి కూడా నీరు సరిపడా లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేస్తున్నా అని చెబుతున్నప్పటికీ, అవి అరకొర మాత్రమే సరఫరా అవుతుండడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చుతోంది. పలు ప్రాంతాల్లో 15 రోజులకోసారి మాత్రమే నీటి సరఫరా చేస్తుండడంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునిసిపాలిటీల్లో తాగునీటి సమస్యపై ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలన
భువనగిరి టౌన్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): పేరుకు పెద్ద మునిసిపాలిటీ. పైగా జిల్లా కేంద్రం, కానీ భువనగిరి పట్ట ణ ప్రజలకు అందుతున్నది మాత్రం సగం కృష్ణా జలాలైతే మిగతా సగం బోర్ నీళ్లే. అలాగే శివారు కాలనీలలో నేటికీ పైప్‌లైన్ నిర్మాణం లేకపోవడం మునిసిపల్ యంత్రాంగం చిత్తశుద్ధికి నిదర్శమని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. ఎలాగోలా ప్రస్తుతానికైతే ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రతీరోజు ఒక్కొక్కరికి 135 లీటర్ల తాగునీటిని నల్లాల ద్వారా సరఫరా చేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నప్పటికీ సమీపిస్తు న్న వేసవిలో ముప్పు మాత్రం పొంచి ఉంది.
సగం బోరు జలాలే
భువనగిరి పట్టణ జనాభా సుమారు 78వేలు. ప్రభుత్వ నీటి లెక్కల ప్రకారం పట్టణానికి రోజుకు 10 ఎల్‌ఎల్‌డీ జలాలు అవసరం. కానీ పట్టణానికి ప్రధాన నీటి వనరు అయిన హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ నుంచి రోజుకు కేవలం సుమారు 4.76ఎంఎల్‌డీ కృష్ణాజలాలు మాత్రమే సరఫరా అవుతున్నాయి. శ్రీగ్ధ వెంచర్ ప్రాంతంతో పాటు, మరికొన్ని కాలనీలకు రోజువారీగా 0.33 ఎంఎల్‌డీ మిషన్ భగీరథ జలాలు సరఫరా అవుతుండగా, పట్టణవ్యాప్తంగా ఉన్న 120 పవర్ బోర్ల ద్వారా ప్రతీరోజు సుమారు ఐదు ఎంఎల్‌డీ జలాలను సరఫరా చేస్తున్నామని అధికారులు అంటున్నారు. అలాగే ఇందిరమ్మకాలనీ తదితర బస్తీలకు ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. పట్టణంలోని 35 వార్డులలో సుమారు 12వేల ఇళ్లకు సుమారు 9,500 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. అయితే కృష్ణా జలాలు బస్తీల వారీగా మూడు రోజులకోసారి, బోరు నీళ్లు రోజు విడిచి రోజు సరఫరా అవుతున్నాయి. ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ సికింద్రాబాద్ సైనిక్ పురి రిజర్వాయర్‌నుంచి భువనగిరి వర కు కృష్ణాజలాల ను సరఫ రా చేసే పైల్‌లైనుకు మరమ్మతులు చేసినప్పుడల్లా కలుషిత నీటి సరఫరా అవుతోంది.
పైప్‌లైనులేని శివార్లు..
పట్టణ శివారులోని కొన్ని ప్రాంతాల్లో నేటికీ పైప్‌లైప్ లేదు. మరికొన్ని ప్రాంతాల్లో నిర్మించినప్పటికీ ప్రధాన పైప్‌లైనుకు, బస్తీలైన్‌కు లింక్ కలపకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. ఇందిరమ్మ కాలనీ ఏర్పడి సుమారు దశాబ్దం గడుస్తున్న నేటికీ ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. నందగుట్ట సరస్వతినగర్ వాసులు మినీ ట్యాంకు నుంచి ఎవరికి వారుగా పైప్‌లైన్ ఏర్పాటు చేసుకున్నారు.
తాగునీటి ఎద్దడి రానివ్వం : రామలింగం, కమిషనర్, భువనగిరి మునిసిపాలిటీ.
పట్టణంలో తాగునీటి ఎద్దడి రాకుండా పూర్తి అప్రమత్తంగా ఉన్నాము. వేసవి దృష్ట్యా ఇప్పటికే పలు చర్యలు చేపట్టాము. కృష్ణా జలాల పైప్‌లైన్, పవర్ బోర్ల మరమ్మత్తులు తదితర తాగునీటి అవసరాల కోసం రూ. 10 లక్షలు కేటాయించాము. శివారుకాలనీలో తాగునీటి సరఫరాకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నాము. రూ. 20 కోట్లతో ప్రతిపాదించిన అమృత్ పనులు పూర్తయితే పట్టణంలో శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం కానుంది.
హుజూర్‌నగర్‌లో దాహం.. దాహం
(ఆంధ్రజ్యోతి, హుజూర్‌నగర్): హుజూర్‌నగర్ మునిసిపాలిటీలో నీటి ఎద్దడి వేధిస్తోంది. ముఖ్యంగా పట్టణంలోని అంబేడ్కర్‌కాలనీ, గోవిందాపురం, శ్రీనగర్‌కాలనీ, సా యిప్రభాత్‌నగర్ కాలనీ, ఎన్నెస్పీ క్యాంప్, టీచర్స్ కాలనీ, మల్లన్ననగర్, పాత గో దాంబజార్, పబ్లిక్‌క్లబ్ ఏరియా, ఎన్జీవో కాల నీ, చైతన్యనగర్ తదితర ప్రాంతాల్లో నీటిఎద్దడి నెలకొంది. పట్టణంలోని 28 వార్డులుండగా, సగం వార్డులకు సక్రమంగా నీటి సరఫరా కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునిసిపాలిటీ పరిధిలో 50వేల జనా భా, 38వేల ఓటర్లు, 28 వార్డులు ఉన్నాయి. కాగా పట్టణంలోని ప్రజలకు ప్రతీరోజు 5.5మిలియన్ లీట ర్ల నీరు సరఫరా అవసరం ఉండగా, మిషన్ భగీరథ నీరు 2.5 మిలియన్ లీటర్లు మాత్రమే సరఫరా అవుతుంది. అంటే సగం కూడా సరఫరా కావడంలేదు. మిషన్ భగీరథ నీరునిలిచిన సమయంలో బేతవోలు నుంచి సాధారణ నీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణంలో 3 బావులు, 32 పవర్‌బోర్లు, రెండు ట్యాంకర్లు ఉండగా 206 హ్యాండ్ పంపులు ఉన్నాయి. కాగా చేతిపంపులలో సగం కూడా పనిచేయడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. బేతవోలు నీరు మాత్రం సక్రమంగా అందడంలేదు. పట్టణంలో 10వాటర్ ట్యాంకులు ఉన్నా దాంట్లో నాలుగు వాటర్ ట్యాంకులకు సక్రమంగా నీరందడంలేదు.
రూ.50లక్షలతో నీటి సరఫరా పనులు
గత ఏడాది డీఎంటీ నిధులు రూ.50లక్షలతో నీటి సరఫరా పను లు చేశారు. గత వేసవిలో ఆరు ట్యాంకర్లతో నీటి సరఫరా చేశారు. ప్రస్తుతం ఈ ఏడాది మునిసిపాల్టీకి రెండు ట్యాంకర్లు మాత్రమే ఉన్నాయి. కాగా ఈ వేసవికి సంబంఽధించి నీటి ఎద్దడి నివారణకు 30 లక్షలతో లాస్ట్ కౌన్సిల్ ఆమోదించింది. ఇటీవల పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో మునిసిపాల్టీకి సంబంధించి నీటి ఎద్దడిపై కలెక్టర్ తేజ్‌సనందాలాల్‌పవార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు మంజూరు కాలేదని అధికారులు పేర్కొంటున్నా రు. ఇదిలా ఉండగా పట్టణంలోని సుమారు 14 వార్డుల లో నీటి ఎద్దడి ఉంది. ముఖ్యంగా పీర్లచావిడి సెంటర్, లింగగిరి రోడ్డు, రామిశెట్టి బ్రహ్మం వీధి, తిలక్‌నగర్, హరిజనవాడ, దళితవాడ, ప్రాంతాల్లోనూ నీటి ఎద్దడి ఉండగా ఈ ఏడాది నీటి ఎద్దడి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక పైప్‌లైన్ వేయాలని స్థానికులు కోరుతున్నారు. పట్టణంలో సుమారు 10వేల కుటుంబాలు ఉండగా ముఖ్యంగా మిషన్ భగీరథ నీరు మాత్రం 4వేల కుటుంబాలకు కూడా సరఫరా కావడంలేదు. గోవిందాపురంలోని మిషన్ భగీరథ ట్యాంక్ అలంకార ప్రాయంగానే మిగిలింది. ట్యాంక్ నిర్మాణం చేసి నాలుగేళ్లు గడస్తున్నా ఒక్కసారి కూడా ట్యాంక్ నిండిన దాఖలాల్లేవు. రూ.కోటితో నిర్మించిన ఈ ట్యాంక్ ప్రారంభం కాకముందే లీకేజీ అయింది. దీంతో పవర్ బోర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
15 రోజులకోసారి నీటి సరఫరా
తిరుమలగిరి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): తిరుమలగిరి మునిసిపాలిటీ పరిధిలో ప్రజలు నీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మునిసిపల్ కేంద్రంలోని 3, 4, 6, 14, 15 వార్డుల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. 15రోజులకు ఒకసారి నీళ్లు రావడంతో ఆయా వార్డుల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటికొరతతో చుట్టుపక్కల ఇళ్లలో, బోర్లు ఉన్న వారి ఇళ్లలో నీటిని తెచ్చుకుంటున్నారు. మరికొందరు వ్యవసాయ బావుల వద్దకు వెళ్తున్నారు. సుమారు రెండు నెలలుగా తీవ్రనీటి సమస్యతో బాధపడుతున్నా, ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, ప్రజలు వాపోతున్నారు.
తగ్గిన మిషన్ భగీరథ నీళ్లు
తిరుమలగిరి మునిసిపాలటీ పరిధికి రావాల్సిన నీళ్లు కొన్ని రోజులుగా రావాల్సిన నీళ్లకంటే తక్కువ వస్తున్నట్లు మునిసిపనల్ అధికారులు చెబుతున్నారు. తిరుమలగిరికి 3.29 ఎంఎల్‌డీ నీళ్ల డిమాండ్ ఉన్నా, సుమారు 2 నుంచి 2.5 ఎంఎల్‌డీ నీళ్లు సరఫరా అవుతున్నట్లు మునిసిపల్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఇళ్లకు సరఫరా చేయడానికి నీళ్లు సరిపోవడం లేదని పేర్కొంటున్నారు. బోర్లు 23 ఉన్నాయని, మూడు మాత్రమే పనిచేయడం లేదని, కొన్ని బోర్లలో నీళ్లు తగ్గాయని, చేతిబోపంపులు 18 ఉండగా, 13 పనిచేస్తున్నాయని మునిసిపల్ అధికారులు తెలిపారు. వారానికోసారి ట్యాంకర్ పంపిస్తున్నారని, ఒక్కో ఇంటికి ఐదారు బిందెల నీరే పోస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.
మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా : కమిషనర్ శ్రీనివా్‌సరెడ్డి
పట్టణంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. మిషన్ భగీరథ నీటిని ప్రతీరోజు సరఫ రా చేస్తున్నాం. పవర్‌బోర్ల ద్వారా కూడా నీటిని అందిస్తున్నాం. ఈ ఏడాది నీటి సమస్యను అధిగమించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి పైప్‌లైన్లు వేస్తున్నాం.
తాగునీటి కటకట తప్పేలా లేదు
సూర్యాపేటటౌన్: ప్రస్తుతం వేసవి కాలంలో సూర్యాపేట మునిసిపాలిటీ పరిధిలో తాగునీటికి ఇబ్బందులు తప్పేలా లేవు. తరుచూ మిషన్‌భగీరథ పైపులు ధ్వంసంకావడంతో సూర్యాపేటలో నీటి ఎద్దడి నెలకొంది. వేసవి కాలం కావడంతో భూగర్భజలాలు అడుగంటి నీటికొరత ఏర్పడుతుంది. దీంతో తాగునీటి కోసం అనేక మంది అల్లాడిపోతున్నారు. పట్టణంలో ట్యాంకర్లు కూడా సరిపాడా లేవు. మున్సిపాలిటీ కింద ఏడు ట్యాంకర్లు మాత్రమే ఉన్నాయి. సూర్యాపేట నియోజకవర్గంలో ఎక్కువ భాగం మిర్యాలగూడ మండలం అవంతిపురం నుండి నీటిని సరఫరా చేస్తారు. అడవిదేవులపల్లి రిజర్వాయర్ నుంచి అవంతిపురంనకు మంచినీరు చేరుకుంటుంది. అవంతిపురం నుంచి సూర్యాపేట మండలం ఇమాంపేట ఫిల్టర్ బెడ్‌కు చేరుకొని అక్కడ నీటిని శుభ్రం చేసి సూర్యాపేట పట్ణణానికి సరఫరా చేస్తారు. నెలకోసారి పైపులు లీకేజీ కావడంతో సూర్యాపేట నియోజకవర్గంలో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది.
తాగు నీటి కోసం మహిళలు ఆందోళన...
గత నెలలో తాగునీటికోసం మునిసిపాలిటీ పరిధిలోని ఐదో వార్డు దురాజ్‌పల్లి సమీప కాలనీల ప్రజలు మునిసిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సూర్యాపేట మునిసిపాలిటీలో 48 వార్డులు ఉన్నాయి. మొత్తం 35వేల గృహాలు ఉండగా, 1.50లక్షల మంది జనాభా ఉంది. పట్టణంలోని ఇందిరమ్మకాలనీ, చంద్రన్నకుంట, అంబేడ్కర్‌నగర్, మామిళ్లగడ్డ, అన్నాదురైనగర్, హ్యూబర్ట్‌నగర్ ప్రాంతాల్లో అధిక శాతం ఇళ్లకు బోర్లు లేవు. దీంతో మునిసిపల్ నీటిపైనే ఆధారపడతారు. అయితే ప్రతీ పది రోజులకోసారి నీటి సరఫరా బంద్‌కావడంతో ప్రతీ రోజు నిత్యాసరాలు తీర్చుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. సూర్యాపేట మునిసిపాలిటీకి ప్రతీరోజు 28 ఎంఎల్‌డీ నీరు అవసరం కాగా, ప్రతీ రోజు 24ఎంఎల్‌డీ నీరు సరఫరా అవుతుంది.
నీటి ఎద్దడి నివారణకు చర్యలు
కోదాడ: నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపడుతున్నామని, ఆందోళన అవసరం ఉండదని మునిసిపల్ కమిషనర్ రమాదేవి తెలిపారు. కోదాడ పట్టణంలో 35 వార్డులున్నాయి. కాగా పట్టణ ప్రజల నీటి అవసరాలకోసం 12.50 ఎంఎల్‌డీ నీరు అవసరం ఉంటుంది. కాగా మిషన్ భగీరథ, మున్సిపల్ బావులతో వాటర్ ట్యాంకుల ద్వారా నిత్యం 7.5 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేస్తున్నామని, మిగతా నీటిని అందించేందుకు ట్యాంకర్లను సిద్ధం చేసినట్లు పేర్కొంటున్నారు.
తీవ్రమవుతున్న తాగునీటి సమస్య
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ పట్టణంలో జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో శివారు కాలనీతోపాటు పట్టణంలోని పలు ప్రాంతాలను తాగునీటి సమస్య వేధిస్తూనే ఉంది. పట్టణ సమీపంలోని అవంతీపురం మిషన్ భగీరఽథ ప్రాజెక్టు ద్వారా 10 మిలియన్ లీటర్ల నీరు సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్తుతం ఆరు మిలియన్ లీటర్లు మాత్రమే సరఫరా అవుతోండగా, పట్టణంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉంది. త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి కృష్ణా రిజర్వాయర్ నుంచి మంచినీటి పథకం-1 ద్వారా ప్రస్తుతం నీటి సరఫరా జరుగుతోండగా మరో పథకానికి పనులు ప్రారంభించారు అధికారులు. రూ.93.40 కోట్లతో మరో తాగునీటి పథకం రూపొందింది. అమృత్ పథకం నిధులతో చేపట్టిన తాగునీటి పథకం-2 పనులను అధికారులు ఇటీవల ప్రారంభించారు. కృష్ణా మంచినీటి పథకం-1 పది మిలియన్ లీటర్ల సామరఽ్ధ్యంతో ఉండగా, తాజాగా ప్రారంభించిన రెండో పథకం 20 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో రూపొందించినట్లు అధికారులు తెలిపారు. మిర్యాలగూడలోని ప్రకా్‌షనగర్, తాళ్లగడ్డ, రవీంద్రనగర్ తదితర ప్రాంతాలకు తాగు నీరు సరఫరా కావడం లేదని ఆయా కాలనీల ప్రజలు తరచూ మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.
శివారు కాలనీలకు తాగునీటి ఎద్దడి
దేవరకొండ: దేవరకొండ మున్సిపాలిటీలో ఎండలు మండుతుండడంతో ఇప్పుడిప్పుడే తాగునీటి సమస్య మొదలైంది. మున్సిపాలిటీలోని 20వార్డులకు రెండు రోజులకు ఒకసారి విడతలవారిగా మిషన్‌భగీరథ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణంలోని శివారు కాలనీలకు పూర్తిస్థాయిలో సరిపడా తాగునీరు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేవరకొండ మున్సిపాలిటీలో 20 వార్డులకుగాను 36,480 మంది జనాభా ఉంది. పట్టణానికి ప్రతీరోజు 5.2 ఎంఎల్‌డీ నీరు సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్తుతం నాలుగు ఎంఎల్‌డీ నీరు సరఫరా చేస్తున్నారు. 40 లక్షల లీటర్ల నీరు సరఫరా చేస్తున్నారు. పట్టణానికి 50లక్షల లీటర్ల నీరు రోజు విడిచి రోజువారీగా సరఫరా చేయాల్సి ఉంది.
తరుచూ సాంకేతిక సమస్యలు
దేవరకొండ పట్టణానికి నసర్లపల్లి వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నుంచి మిషన్‌భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. విద్యుత్ సమస్య పైపులు తరుచూ ధ్వంసమవుతుండడంతో మూడు నాలుగు రోజులు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండడంతో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలోని చంద్రన్నకాలనీ, జంగాలకాలనీ, తాటికోలు రోడ్డు, సంజయ్‌కాలనీ, గాంధీనగర్, ముత్యాలమ్మవీధి శివారు కాలనీలకు అరకొరగా కృష్ణానీరు సరఫరా అవుతున్నాయని కాలనీవాసులు తెలుపుతున్నారు. పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయాలని అధికారులను కోరుతున్నారు. కృష్ణాజలాలు సరఫరా అవుతున్నప్పటికీ సరిపడడంలేదని, దీంతో బోరునీరు తాగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అవసరాలకు అనుగుణంగా తాగునీరు
నేరేడుచర్ల, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): నేరేడుచర్ల మునిసిపాలిటీలో తాగునీటి సమస్యలేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. దీంతో ఎక్కడా నీటి సమస్య లేదు. పట్టణంలో తొమ్మిది ఓవర్ హెడ్ ట్యాంకులు, 23 మోటార్ల ద్వారా, చేతి పంపులు(బోర్లు) 106 ఉన్నాయి. వీటి ద్వారా నీటిని అందిస్తున్నారు. పట్టణంలోని 15 వార్డులలో మొత్తం 14853 మంది ప్రజలు నివసిస్తున్నారు. వీటిలో రాజీవ్‌నగర్, శివాజీ నగర్, శాంతినగర్, నర్సయ్యగూడెంలోని ఎస్సీకాలనీ, చింతబండ, ఎన్టీఆర్‌నగర్ ప్రాంతాల్లో అత్యధికంగా పేద వారు ఉండడంతో వారికి నీటి సమస్య లేకుండా ఆయా ప్రాంతాల్లో బోర్లు వేసి మోటార్ల ద్వారా కూడా నీటిని అందిస్తున్నారు.
మానిటరింగ్ అధికారుల నియామకం
ప్రతీ రోజు గంటపాటు నల్లాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అంతేకాక బోర్లు ఉండడంతో నీరు సమృద్ధిగానే సరిపోతుంది. నీటి సరఫరా సమృద్ధిగా అందుతుందా లేదా అని 15 వార్డులకు 15 మంది పర్యవేక్షణాధికారులను నియమించారు.
నందికొండలో 3 లక్షల లీటర్ల నీరు అవసరం
నాగార్జనసాగర్: నాగార్జునసాగర్ పరిధిలో ఉన్న నందికొండ మునిసిపాలిటీలో కాలనీలకు తాగు నీటి సరఫరాను ఎన్నెస్పీలో ఉన్న నీటి సరఫరా విభాగం నుంచి అందజేస్తారు. సాగర్‌లో హిల్‌కాలనీ, ఫైలాన్ కాలనీల్లో మొత్తం 16వేల జనాభా ఉంది. రెండు కాలనీల్లో మొత్తం 12వార్డులు ఉన్నాయి. కృష్ణానది నుంచి ఫైలాన్ కాలనీలో ఏర్పాటు చేసిన ఫిల్టర్‌హౌ్‌సకు మోటార్ల ద్వారా నీటిని తరలించి అక్కడ శుద్ధిచేస్తారు. శుద్ధిచేసిన జలాలను ఓవర్ హెడ్ ట్యాంకులకు పంపిస్తారు. ఓవర్ హెడ్ ట్యాంకుల నుంచి పైపులేన్ల ద్వారా ఇంటింటికీ తాగు నీటిని పరఫరా చేస్తారు. రోజుకు 3 లక్షల లీటర్ల తాగు నీరు అవసరమవుతున్నట్లు అధికారులు తెలిపారు. రెండు కాలనీల్లో రోజుకు 3లక్షల లీటర్ల తాగునీటిని అందజేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.