Share News

పెద్దగట్టు జాతరకు పటిష్ట బందోబస్తు

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:48 AM

దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతరకు పోలీ స్‌శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ అన్నారు. బుధవారం చివ్వెంల మండల పరిధిలోని దురాజ్‌పల్లి లింగమంతుల (పెద్దగట్టు) స్వామి ఆలయం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

పెద్దగట్టు జాతరకు పటిష్ట బందోబస్తు

ఎస్పీ సన్‌పీత్ర్‌సింగ్‌

సూర్యాపేట, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి(పెద్దగట్టు) జాతరకు పోలీ స్‌శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ అన్నారు. బుధవారం చివ్వెంల మండల పరిధిలోని దురాజ్‌పల్లి లింగమంతుల (పెద్దగట్టు) స్వామి ఆలయం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్దగట్టు జాతర ఈనెల 16 నుంచి ప్రారంభమవుతుందని, అందుకు 2వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 68 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా, మహిళల రక్షణకు షీటీమ్స్‌ సిబ్బందిని నియమించామన్నారు. దొంగతనాల నివారణకు పోలీస్‌ స్పెషల్‌ టీమ్స్‌, సెంట్రల్‌ క్రైం స్టేషన్‌ సిబ్బంది, టెక్నికల్‌ టీంలు, క్రైం కంట్రోల్‌టీంలు ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక టీంలు మఫ్టీలో తిరుగుతూ అనుమానితులను, కొత్తగా తిరిగే వ్యక్తులను గుర్తించి దొంగతనాల నివారణకు కృషి చేస్తాయన్నారు. జాతర ప్రాంగణంలో బెట్టింగులు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 16వ తేదీ తెల్లవారుజాము నుంచి జాతీయరహదారి 65పై వాహనాలను మళ్లిస్తామన్నారు. జాతరకు వచ్చే భక్తుల వాహనాలకు పార్కింగ్‌ ప్రదేశాలు కేటాయించామన్నారు. సిబ్బందికి వసతి, జాతరకు వచ్చి పోయే మార్గాలు, బార్‌కేడ్లు ఏర్పాట్లు చేశామన్నారు. హైదరాబాద్‌-విజయవాడకు వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి, నల్లగొండ మీదుగా మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ వైపు మళ్లిస్తున్నామన్నారు. విజయవాడ-హైదరాబాద్‌ వాహనాలను కోదాడ, హుజూర్‌నగర్‌ మీదుగా మిర్యాలగూడ, నల్లగొండ వైపునకు మళ్లిస్తామన్నారు. జాతర ప్రదేశాల్లో పోలీస్‌ కంట్రోల్‌రూం, హెల్ప్‌లైన్‌ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. జాతరలో మహిళలతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా తప్పిపోతే కంట్రోల్‌రూం ద్వారా సహాయం పొందవచ్చన్నారు. చెరువు నిండా నీరు ఉన్నందున అటుగా ఎవ్వరూ వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ నాగేశ్వర్‌రావు, డీఎస్పీ రవి, స్పేషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగభూషణం, సీఐలు రాజశేఖర్‌, శ్రీను, రఘువీర్‌, వీరరాఘవులు, ఎస్‌ఐలు మహేశ్వర్‌, సాయిరాం, శ్రీకాంత్‌, బాలునాయక్‌, వీరయ్య, తదితరులు ఉన్నారు.

క్రీడాల్లో ప్రతిభ చాటడం అభినందనీయం

(ఆంఽధ్రజ్యోతి, సూర్యాపేటక్రైం): రాష్ట్రస్థాయి పోలీస్‌ స్పోర్స్ట్‌ మీట్‌లో జిల్లా పోలీసులు ప్రతిభ చాటడం అభినందనీయమని ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ అన్నారు. ఇటీవల కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీస్‌ స్పోర్స్ట్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌లో జిల్లాకు చెందిన మహిళా పోలీసులు కబడ్డీ, వాలీబాల్‌లో ప్రతిభ చాటి ద్వితీయ బహుమతులు గెలుచుకున్నారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో వారిని ఎస్పీ అభినందించారు. కబడ్డీలో రాణించిన దీపిక, హనీఫా, శిరీష, లత, సీహెచ్‌.శిరీష, మౌనిక, శ్రీలత, వాలీబాల్‌లో రాణించిన లావణ్య, దీపిక, మౌనిక, ప్రియాంక, సల్మా, శిరీష, త్రివేణిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ నర్సింహాచారి, తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీని అభినందించిన డీజీపీ

కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీస్‌ స్పోర్స్ట్‌ మీట్‌లో టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ కాంస్య పతకం దక్కించుకోగా, ఆయన్ను డీజీపీ జితేందర్‌ బుధవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో అభినందించారు.

Updated Date - Feb 13 , 2025 | 12:48 AM