కడుపు కోత
ABN , Publish Date - Feb 12 , 2025 | 01:03 AM
ధనార్జనే ధ్యేయంగా కొంత మంది వైద్యులు సాధారణ ప్రసవాలు చేయడంలేదు. ఆస్పత్రికి వచ్చిన వారి నుంచి డబ్బు వసూలు చేసి శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. సాధారణ ప్రసవం జరిగే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు.

సాధారణ ప్రసవాలను మరిచిన ప్రైవేట్ వైద్యులు
శస్త్రచికిత్సకే మొగ్గు
కొందరు సుముహుర్తాల పేరుతో ప్రసవాలు
సొమ్ముచేసుకుంటున్న వైద్యులు
(ఆంధ్రజ్యోతి,సూర్యాపేట (కలెక్టరేట్) : ధనార్జనే ధ్యేయంగా కొంత మంది వైద్యులు సాధారణ ప్రసవాలు చేయడంలేదు. ఆస్పత్రికి వచ్చిన వారి నుంచి డబ్బు వసూలు చేసి శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. సాధారణ ప్రసవం జరిగే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు. ఈ శస్త్ర చికిత్సల ద్వారా భవిష్యత్‌లో మహిళలకు అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. అయినా గర్భిణులు చేసేది లేక వైద్యుల మాటలు విని శస్త్ర చికిత్స చేయించుకుంటున్నారు. కొంత మంది గర్భిణులు ప్రసూతి నొప్పులు భ రించలేక శస్త్రచికిత్స చేయించుకుంటుండగా, మరికొందరు సుముహుర్తం పేరుతో శస్త్రచికిత్సకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సాధారణ ప్రసూతులకంటే శస్త్రచికిత్సలు రెట్టింపు సంఖ్యలో జరుగుతున్నాయి. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో కొంత మంది వైద్యులు డబ్బు ఆశతో గర్భిణులకు కడుపు కోత మిగులుస్తున్నారు. ఒక్కో శస్త్రచికిత్సకు రూ.20వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ ప్రసవం జరిగే అవకాశం ఉన్నా ఏదో ఒక సాకు చెబుతూ శస్త్రచికిత్స చేస్తున్నారు. సాధారణ ప్రసూతికి వైద్యులు యత్నించడం మానేశారు.
నాలుగు రెట్లు పెరిగిన శస్త్ర చికిత్సలు
సూర్యాపేట జిల్లా పరిధిలో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు వరకు 9,141 ప్రసవాలు జరిగా యి. అందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 4,123 ప్రసవాలు జరిగాయి. అందులో సాధారణ ప్రసవాలు 2,410 వర కు, శస్త్రచికిత్సలు 1,713 వరకు ఉన్నాయి. ఇక ప్రైవేట్ ఆస్పత్రుల్లో 5,018 ప్రసవాలు జరగ్గా, అందులో 921 సాధారణ ప్రసవాలు, 4,097 శస్త్ర చికిత్సలు ఉన్నాయి. జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో సుమారు నాలుగు రెట్లు శస్త్రచికిత్సలు జరిగాయి. నల్లగొండ జిల్లాలో గత ఏడా ది జనవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు మొత్తం 21,906 ప్రసవాలు జరిగాయి. అందులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 11,732 ప్రసవాలు జరగ్గా, వీటిలో సాధారణ ప్రసవాలు 5,630 ఉన్నాయి. శస్త్ర కి చిత్సలు 6,102 జరిగాయి. ప్రైవేట్ ఆస్పత్రు ల్లో మొత్తం 10,174 ప్రసవాలు జరగ్గా అందులో 1,892 సాధారణ ప్రసవా లు, 8,281 శస్త్రచికిత్సలు ఉన్నా యి. జిల్లాలో సుమారు నాలుగురెట్లు అధికంగా శస్త్రచికిత్సలు జరిగాయి.
ఆపరేషన్లకు మొగ్గు చూపుతున్న కొందరు
గర్భం దాల్చిన మహిళలు కొంత మంది ఆపరేషన్ల ద్వారా డెలివరీ అయ్యేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రసూతి సమయంలో సాధారణ డెలివరీ అవ్వాలంటే నొప్పులు భరించాల్సి వస్తుంది. అయితే ప్రస్తుత సమాజంలో కొంత మంది మహిళలు నొప్పులు భరించలేక ఆపరేషన్ ద్వారా డెలివరీ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా సాధారణ పద్ధతిలో ప్రసూతి చేసేందుకు వైద్యులు సైతం ప్రయత్నాలు చేయడం లేదు. సాధారణ ప్రసూతి సమయంలో కొన్ని సందర్భాల్లో కొంత మంది గర్భిణులు మృతి చెందుతున్నారు. అలాంటి సందర్భాల్లో మృతురాలి బంధువులు ఆసుపత్రుల వద్ద ఘర్షణలకు పాల్పడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని కూడా వైద్యులు ఆపరేషన్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఆపరేషన్ ద్వారా డెలివరీ చేయడం వైద్యులకు సులభతరం. అంతేగాక సాధారణ ప్రసూతి కంటే అధిక మొత్తం డబ్బు వస్తుండటం కూడా కారణం.
సుముహుర్తాల కోసం..
గర్భం దాల్చిన మహిళలు ప్రసూతి అయ్యే సమయాన్ని ముందుగానే స్కానింగ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుంటున్నారు. దీంతో పాటుప్రసూతి అయ్యే సమయంలో ఏ రోజులో సుముహూర్తాలు ఉంటున్నాయో పురోహితుల ద్వారా తెలుసుకుంటున్నారు. సుముహుర్తాలు చూసుకొని మరీ ఆపరేషన్ ద్వారా డెలివరీ చేయించుకుంటున్నారు. మంచి ముహుర్తంలో డెలివరీ కావాలని ఆకాంక్షిస్తున్నారు. అందుకోసం ముందుగానే వైద్యులకు సమాచారం ఇచ్చి ఆ సమయంలోనే ఆపరేషన్ ద్వారా ప్రసవం చేయాలని కోరుతున్నారు.
అనారోగ్యానికి గురవుతున్న మహిళలు
గర్భిణులు ఆపరేషన్ల ద్వారా ప్రసవిస్తుండటంతో భవిష్యత్‌లో అనారోగ్యానికి గురవుతున్నారు. సాధారణ ప్రసూతి చేయించుకున్న మహిళలు వీరికంటే ఆరోగ్యవంతులుగా ఉంటున్న సందర్భాలు అధికం. మొదటి కాన్పు ఆపరేషన్ చేయించుకున్న మహిళ రెండో కాన్పులో తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాలి. దీంతో భవిష్యత్‌లో కొంత మంది మహిళలు పలు రకాల వ్యాధులకు గురవుతున్నారు.
అవ సరం లేకున్నా ఆపరేషన్లు చేస్తే చర్యలు : డాక్టర్ కోటా చలం, డీఎంహెచ్‌వో
ప్రసూతి కోసం వచ్చే గర్భిణులకు అవసరం లేకున్నా ఆపరేషన్లు చేసే వైద్యులపై చర్యలు తీసుకుంటాం. సాధారణ ప్రసవం చేసేందుకు వైద్యులు ప్రయత్నించాలి. అధికంగా ఆపరేషన్ల ద్వారా కాన్పులు చేసే ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నాం. మహిళల ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో మాత్రమే ఆపరేషన్లు చేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధికశాతం సాధారణ ప్రసూతికే ప్రాధాన్యం ఇస్తున్నాం. మహిళలు కూడా సాధారణ ప్రసూతికి చొరవ చూపాలి.