సజావుగా.. సాఫీగా.. ఏపీ వైపు పయనం
ABN , Publish Date - Jan 12 , 2025 | 01:06 AM
ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో సంక్రాంతికి ఏపీ వైపు వెళ్లే వాహనదారులు క్షేమంగా తమ ప్రయాణం కొనసాగిస్తున్నారు.

ట్రాఫిక్ రద్దీ నివారణకు రాష్ట్ర సరిహద్దు వరకు పోలీస్ పహారా
గతంతో పోల్చితే 30శాతం పెరిగిన వాహనాల సంఖ్య
కోదాడ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో సంక్రాంతికి ఏపీ వైపు వెళ్లే వాహనదారులు క్షేమంగా తమ ప్రయాణం కొనసాగిస్తున్నారు.అందులో భాగంగా హైదరాబాద్ నుంచి తెలంగాణ సరిహద్దు రామాపురం క్రాస్ రోడ్డు వరకు పోలీసులు బందోబస్తుతో పాటు వాహనాలు సులభంగా వెళ్లేందుకు ముందస్తుగానే ఏర్పాట్లుచేశారు. జాతీయ రహదారిపై సర్కిల్ పరిధిలో నలుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలు,100మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తూ ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా కోదాడ రూరల్ సీఐ సరిహద్దు వద్ద ఒక్కో షిఫ్ట్‌కు 8మంది ఇప్పటికే పనిచేస్తుండగా, ఆ సంఖ్యను మరో ఆరుకు పెంచటంతో పాటు ఏపీ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవటంతో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలు వెళ్తున్నాయి. అంతేకాకుండా టోల్‌ప్లాజాల వద్ద కొంతమేర కౌంటర్లు తక్కువగా ఉండటంతో వాహనాలు టోల్‌ప్లాజా వద్దకు చేరుకోవటానికి 10 నిమిషాల సమయం పడుతోంది. దీంతో కొంతమేర వాహనాలు టోల్‌గేట్ల వద్ద నిలుస్తున్నాయి. నాలుగు సెకన్ల వ్యవధిలో ఫాస్టాగ్ స్కాన అయినప్పటికీ కౌంటర్లు తక్కువగా ఉండటంతో వాహనదారులు 10 నిమిషాల పాటు రహదారిపై నిలవాల్సి వస్తుంది. అయినప్పటికి అంతరాయం లేకుండా వాహనాలను ముందుకు పం పించేందుకు పోలీసులతో పాటు టోల్‌ప్లాజా సిబ్బంది పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రతి క్రాసింగ్ వద్ద కానిస్టేబుల్‌ను ఏర్పాటుచేయటంతో వాహనాల రాకపోకలు సులభంగా కొనసాగాయి.