Share News

ఎస్‌ఎల్‌బీసీ పనులపై నీలినీడలు

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:12 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు జీవనరేఖగా నిలవాల్సిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం పనులకు తరచూ ఆటంకాలు ఏర్పడుతున్నాయి. సాంకేతిక సమస్యలు, పునరావాస ఇబ్బందులు, అటవీశాఖ అనుమతులు రాని కారణంతో 2012కే పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు ఇప్పటికీ నత్తనడకన సాగుతోంది.

ఎస్‌ఎల్‌బీసీ పనులపై నీలినీడలు

2019 నుంచి ఇటీవలి వరకు నిలిచిన పనులు

తాజాగా, పనులు ప్రారంభించిన వారంలోనే దుర్ఘటన

ఈ ఘటనతో పనులు ముందుకు సాగడంపై సందిగ్ధం!

(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు జీవనరేఖగా నిలవాల్సిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం పనులకు తరచూ ఆటంకాలు ఏర్పడుతున్నాయి. సాంకేతిక సమస్యలు, పునరావాస ఇబ్బందులు, అటవీశాఖ అనుమతులు రాని కారణంతో 2012కే పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు ఇప్పటికీ నత్తనడకన సాగుతోంది. 2007లో మొదలైన ఈ సొరంగమార్గం పనుల కు తరచూ ఆటంకాలు కలుగుతుండడంతో ఇప్పటివరకు పథకం పూర్తికాలేదు. ఈ ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం రిజర్వాయర్‌ సమీపంలో నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని దోమలపెంట ప్రాంతం నుంచి న్లల్లగొండ జిల్లాలోని చందంపేట మండలంలోని నక్కలగండి ప్రాంతం వరకు 43.930కిలోమీటర్లు సొరంగం (టన్నెల్‌) తవ్వాల్సి ఉంది. అందుకోసం శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకునే ప్రాంతం నుంచి చేపట్టిన ఇన్‌లెట్‌ టన్నెల్‌ 19.500 కిలోమీటర్లకు ఇప్పటివరకు 13.935 కిలోమీటర్లు పూర్తవగా, ఇంకా 6.015 కిలోమీట ర్ల సొరంగం తవ్వాల్సి ఉంది.

ఇన్‌లెట్‌ వైపు (శ్రీశైలం రిజర్వాయర్‌ సమీపం నుంచి) తవ్వే సొరంగం పనులు ముందుకుసాగకుండా 2019 నుంచి ఊట నీరు వచ్చిచేరుతోంది. దీంతోపాటు, పనులు చేస్తున్నప్పుడు మట్టి, రాళ్లు కూలుతుండడంతో పనులు ముందుకు సాగలేదు. ఊట నీటిని తోడివేస్తూ, మట్టిని తొలగించడంతో పాటు, ఊట మళ్లీ రాకుండా, మట్టి, రాళ్లు పడకుండా ఉండేలా సిమెంట్‌, పాలియేరిథిన్‌ తో గ్రౌటింగ్‌ చేయించారు. తాజాగా, ఐదు రోజుల క్రితమే ఈ పనులను మళ్లీ పునరుద్ధరించగా, శనివా రం పనులు జరుగుతున్న టన్నెల్‌ వద్ద సుమారు వం దమీటర్లకు పైగా కూలిపోవడంతో పెనుప్రమాదం చోటుచేసుకుంది. ఈ టన్నెల్‌ పెండింగ్‌ పనులకు సం బంధించి 14వ కిలోమీటర్‌ నుంచి 19.500 కిలోమీటర్‌ వరకు ఉన్న ప్రాంతంలో ఊట నీటిని అదుపుచేయలేకపోవడంతో పాటు, శ్రీశైలం రిజర్వాయర్‌లో నీరు టన్నె ల్‌ కాంటూరు లెవల్స్‌ కంటే ఎగువన ఉండడంతో పాటు ఇక్కడ గ్రానైట్‌, రాతిశిలల కంటే మట్టి, సన్నరాళ్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో సొరంగం తవ్వగానే పెళుసుబారి కూలిపోతుందని ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు గ్రౌంటింగ్‌ చేస్తున్నప్పటికీ అది కప్పును బలంగా ఉంచలేకపోయిందని అందువల్లే శనివారం దుర్ఘటన జరిగి ఉంటుందని అంచనావేస్తున్నారు. 2019 నుంచి ఈ సమస్య తీవ్రతరం కావడంతో ఇన్‌లెట్‌ సొరంగం పనులు ముందుకుసాగని పరిస్థితి ఏర్పడింది.

మార్చి నుంచి ఔట్‌లెట్‌ వైపు పనులు చేపట్టే యోచన

మన్నేవారిపల్లి నుంచి (నీరు విడుదలయ్యే వైపునుం చి) చేపట్టిన అవుట్‌లెట్‌ టన్నెల్‌ 23.980 కిలోమీటర్లకు 20.435 కిలోమీటర్లు పూర్తవగా, ఇంకా 3.545 కిలోమీట ర్లు తవ్వాల్సి ఉంది. పూర్తి విదేశీసాంకేతిక పరిజ్ఞానంతో టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం) ద్వారా ఈ పనులు చేపట్టారు. టన్నెల్‌ తవ్వుతున్న టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం)లో మరమ్మతులు వస్తే పరికరాలు, బేరింగు ల కోసం సంవత్సరాల తరబడి వేచిచూస్తుండడంతో పనులకు తీవ్రస్థాయిలో ఆటంకం కలుగుతోంది. టీబీఎంలో కీలకమైన బేరింగ్‌ ఇప్పటికే మూడోసారి మరమ్మతు కారణంగా పనులు నిలిచాయి. ఏడుమీటర్ల వ్యాసంతో, 37 మెట్రిక్‌ టన్నుల బరువుండే ఈ బేరింగ్‌ ను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉండగా, ఆరునెలల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ బేరింగ్‌ తయారీ కంపెనీ రాబిన్‌సన్‌ కంపెనీతో చర్చిం చి, అగ్రిమెంట్‌ చేయించే నిమిత్తం స్వయంగా అమెరికా వెళ్లారు. ఆ కంపెనీకి వెళ్లి బేరింగ్‌కు, ఇతర పరికరాలకు ఆర్డర్‌ కోసం అగ్రిమెంట్‌ చేయించారు. ఈ బేరింగ్‌ ఇటీవలే చెన్నై పోర్టుకు చేరగా ఈ నెలాఖరులోగా మన్నెవారిపల్లి వద్దకు చేరుతుందని ఇరిగేషన్‌ ఇంజనీర్లు భావిస్తున్న తరుణంలో, తాజాగా ఇన్‌లెట్‌ వైపున భారీ ప్రమాదం చోటుచేసుకోవడంతో పనులు ముందుకుసాగడంపై ప్రభావం చూపనుంది.

ఆరేళ్లుగా నిలిచిన పనులు

ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం పనులు 2015వరకు ఉధృతంగా సాగాయి. ఆతర్వాత బేరింగులు మరమ్మతులకు రావడం, మరోవైపు ఇన్‌లెట్‌ వైపున ఊట నీరు వస్తుండడంతో పనులు మందగించాయి. 2019 నుంచి కాంట్రాక్ట్‌ సంస్థ సైతం నిర్వహణ భారం పెరగడం, ప్రాజెక్టు వ్యయం పెరిగిపోవడంతో పనులను నిలిపింది. తిరిగి 2024లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించిన సీఎం, మంత్రులు ప్రాజెక్టు వ్యయం పెంచడంతో పాటు, బిల్లులు పెండింగ్‌లో లేకుండా గ్రీన్‌ఛానల్‌లో నిధులిస్తామని హామీ ఇచ్చి కాంట్రాక్ట్‌ సంస్థను ఒప్పించారు. దీంతోపాటు బేరింగ్‌ తెప్పించడం, ఇన్‌లెట్‌వైపున పనులు సాగించేందుకు అవసరమైన కార్యాచరణను ప్రారంభించారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, భారీనీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సెప్టెంబరులో ప్రాజెక్టును సందర్శించి అక్కడే సమీక్ష సైతం నిర్వహించారు. ఈ ఏడాది బడ్జెట్‌లోనూ రూ.800కోట్ల నిధులు కేటాయించారు. ఈ పనులు ఊపందుకుంటాయని భావించిన తరుణంలో ఈ ప్రమాద ఘటనతో మళ్లీ పనులకు బ్రేక్‌ పడినట్లయింది.

అటవీ అనుమతులు, పునరావాస పనులూ పెండింగ్‌లోనే

ఈ ప్రాజెక్టుకు కీలకమైన అటవీ అనుమతులతో పాటు, నిర్వాసితుల పునరావాసకల్పన సైతం పెండింగ్‌లోనే ఉంది. తెల్దేవర్‌పల్లి వద్ద నిర్మిస్తున్న నక్కలగండి (డిండి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌) రిజర్వాయర్‌లో ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ఫారె్‌స్టకు చెందిన 281.93 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతోంది. ఈ భూములను ప్రాజెక్టుకు కేటాయించేందుకు కేంద్ర అటవీశాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. అందుకోసం ఇప్పటికే కేంద్ర అటవీశాఖకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక సంప్రదింపులు పూర్తయినా, ముందడుగు పడలేదు. ఈ భూమిని కేంద్రం కేటాయిస్తే, దీనికి బదులుగా రిజర్వ్‌ఫారెస్ట్‌ ఆవల ఇతర ప్రాంతాల్లో 790 హెక్టార్లలో అడవిని అభివృద్ధి చేసి ఇచ్చేందుకూ సంసిద్ధత వ్యక్తం చేసింది. కీలకమైన ఈ అనుమతులు వస్తేనే నక్కలగండి రిజర్వాయర్‌ అందుబాటులోకి వస్తుంది. ఇదే నక్కలగండి రిజర్వాయర్‌ నిర్మాణంతో నల్లగొండ జిల్లాలోని చందంపేట మండలంలోని నక్కలగండితండా, నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట మండలంలోని కేశ్యతండ, మర్లపాడుతండాలు ముంపునకు గురవుతున్నాయి. 2015-16లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం ఈ మూడుతండాల్లో 629 గిరిజన కుటుంబాలు నిర్వాసితులవుతుండడంతో వారికి పునరావాసం కల్పించాలని నిర్ణయించారు. నల్లగొండ జిల్లాలో ముంపు ప్రాంతమైన నక్కలగండి తండాకు సంబంధించి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్మించేందుకు చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద 10 ఎకరాల భూమిని పరిశీలించారు. అక్కడ ఆర్‌ఆండ్‌ఆర్‌ సెంటర్‌ నిర్మించాలని నిర్ణయించినా, ఇంకా ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. అటు నాగర్‌కర్నూల్‌జిల్లా పరిధిలోని కేశ్యతండా, మర్లపాడుతండాలకు సంబంధించి పునరావాస కేంద్రాలను తొలుత సిద్ధాపురం వద్ద ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయిస్తే అందుకు నిర్వాసితులు అంగీకరించలేదు. దీంతో ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు సమీపంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మొత్తంగా మూడు ముంపు తండాలకు పునరావాస కాలనీలు, ప్యాకేజీల పరిష్కారం పూర్తికాలేదు.

టన్నెల్‌ పనుల కొనసాగింపై సందిగ్ధం

ఇన్‌లెట్‌ దుర్ఘటనతో పనులు కొనసాగించడంపై ఇంజనీరింగ్‌ వర్గాల్లో భిన్న చర్చ కొనసాగుతోంది. ఇన్‌లెట్‌వైపున భారీగా ఊటనీరు వస్తోందని, దీంతో ఆ ప్రాంతంలో తవ్వకాలు నిర్వహిస్తున్న సందర్భంలో పైకప్పు కూలిపోతుందని, దాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్లే తాజా దుర్ఘటన జరిగిందని ఇంజనీరింగ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఇన్‌లెట్‌ సొరంగం సముద్రమట్టానికి 854 అడుగుల ఎత్తు వద్ద తవ్వుతుండగా, శ్రీశైలం రిజర్వాయర్‌ 885 అడుగుల ఎత్తు వద్ద నీటితో ఉంది. శ్రీశైలం రిజర్వాయర్‌ కంటే ఇది దిగువన ఉండడం కూడా ఊటనీరు అధికంగా రావడానికి కారణంగా చెబుతున్నారు. వీటన్నింటిపై మరోసారి ఇంజనీరింగ్‌, సాంకేతిక నిపుణులతో ప్రభుత్వం పూర్తిస్థాయిలో సమీక్షించిన తర్వాతనే పనులు ముందుకుసాగడంపై నిర్ణయం తీసుకుంటారని, అప్పటివరకు పనులు నిలిచినట్టేనని చెబుతున్నారు. ఈ ప్రమాదఘటన అంశం కొలిక్కివచ్చాకే పనుల భవిష్యత్‌పై నిర్ణయం ఉంటుంద నే చర్చ సాగుతోంది.

సంఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్‌, ఎస్పీ

(ఆంధ్రజ్యోతి, దేవరకొండ): శ్రీశైలం సొరంగమా ర్గం ఇన్‌లెట్‌ టన్నెల్‌ నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట వద్ద ప్రమాద ఘటన విషయం తెలియగానే నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్రపవార్‌, దేవరకొండ ఏఎస్పీ మౌనిక, ఆర్డీవో రమణారెడ్డితోపాటు నీటిపారుదలశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన ఘటన ను పరిశీలించి సహాయక చర్యల ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా, ఈ ఘటనపై దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై నీటిపారుదలశాఖ అధికారులను ఆరాతీశారు.

Updated Date - Feb 23 , 2025 | 12:12 AM