ఎత్తిపోతల భూసేకరణకు రంగం
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:46 AM
ముక్త్యాల బ్రాంచ్ కాల్వ ఎత్తిపోతల పథకానికి భూసేకరణ అడ్డంకి తొలగిపోయింది.

హుజూర్‌నగర్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : ముక్త్యాల బ్రాంచ్ కాల్వ ఎత్తిపోతల పథకానికి భూసేకరణ అడ్డంకి తొలగిపోయింది. పలు పర్యాయాలు చర్చలు జరిపినా భూమి ఇవ్వడానికి రైతులు అంగీకరించలేదు. మరోమారు సోమవారం హుజూర్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో రైతులతో అధికారులు సమావేశమయ్యారు. చింతలపాలెం మం డలం వెల్లటూరు గ్రామానికి చెందిన సుమారు 50 మంది రైతులు, ఆర్డీవో శ్రీనివాసులుతో భేటీ అయ్యారు.మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సుమారు 3గంటల పాటు చర్చించారు. ఎకరం భూమికి రూ.20.25 లక్షలు ఇచ్చేందుకు అధికారులు ముందుకు రాగా రైతులు అంగీకరిస్తూ హర్షం వ్యక్తం చేశారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములు ప్రభుత్వ అవసరాలు, రైతుల సంక్షేమ కోసం ఎత్తిపోతల నిర్మాణానికి ఇచ్చేందుకు అంగీకరించి ఇరువర్గాల మధ్య ఒప్పందం చేసుకున్నారు. అధికారులు చెప్పిన విధంగా తమ భూములను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు వెల్లటూరు గ్రామరైతులు తెలిపారు. ఆరు నెలలుగా భూసేకరణకు అధికారులు ప్రయత్నించగా ఎట్టకేలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్ సహకారంతో భూసేకరణ ప్రక్రియలో ముందడుగు పడింది.
నాలుగేళ్ల తర్వాత మోక్షం
చింతలపాలెం మండలం వెల్లటూరు వద్ద కృష్ణానదిపై ముక్త్యాల బ్రాంచ కెనాల్(ఎంబీసీ) ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు నాలుగేళ్ల కిందట గత ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. దీనికి సంబంధించి వెల్లటూరు, మేళ్లచెర్వు, చింతలపాలెం, వేపలసింగారం గ్రామాల పరిధిలోని 150 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. కానీ పథకానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం భూసేకరణ చేయలేక చేతులెత్తేసింది. దీంతో నాలుగేళ్ల పాటు ఈ పథకం నిలిచిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ ఎత్తిపోతల పథకానికి మళ్ళీ మోక్షం కలిగింది. వెల్లటూరు వద్ద రూ.1500 కోట్లతో 53వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టి కేంద్రీకరించారు. గతంలోనే హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ పథకంపై కూడా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కావడంతో మళ్ళీ ఎత్తిపోతల పథకాలకు మోక్షం లభించింది. ఎంబీసీ కెనాల్ ఎత్తిపోతల పథకానికి ఊతం లభించింది. ఈ పథకం వెల్లటూరు నుంచి చింతలపాలెం, మేళ్లచెర్వు, హుజూర్‌నగర్ మండలాల్లోని 22 కిలోమీటర్ల దూరంలోని వేపలసింగారం వద్ద డెలివరీ సిస్టంను ఏర్పాటుచేయనున్నారు. ఆయకట్టు చివరి భూములను సస్యశ్యామలం చేసేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించగా మధ్యలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితం కాగా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో భూసేకరణ పూర్తి చేయగలిగారు. కాగా త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయి. భూసేకరణ పూర్తి కావడంతో ఒకవైపు రెవెన్యూ అధికారులు, మరోవైపు రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
మంత్రి ఉత్తమ్ చొరవతోనే..
వెల్లటూరు వద్ద ఎత్తిపోతల పథకానికి భూసేకరణ కొలిక్కిరావడానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంతో చొర వ చూపారు. గతంలో కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్ వెల్లటూరు గ్రామంలోని భూసేకరణ భూమిని పరిశీలించారు. దాంతో పాటు హుజూర్‌నగర్‌లోని మండల పరిషత్ కార్యాలయంలో రైతులు అనేకసార్లు భేటీఅయ్యారు. వాస్తవంగా మార్కెట్‌లో ఎకర రూ.10 లక్షలలోపే ఉండగా అంతే చెల్లిస్తామని తెలిపారు. కానీ ఆ భూమిని విక్రయించి మరోచోట భూములు కొనాలంటే ఎకరం రూ.40 లక్షలు ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశా రు. దీంతో విషయం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వద్దకు చేరింది. రైతులు తాము భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ నష్టపరిహారం విషయంలో ప్రభుత్వ ధర కాకుండా బయట మార్కెట్ ఽప్రకారం చెల్లించాలని మంత్రిని కోరారు. మంత్రి ఉత్తమ్ పర్యటన సందర్భంగా అనేకసార్లు రైతులు ఉత్తమ్‌కు సమస్యను వివరించారు. ఇటీవల రెండు రోజుల కిందట మరోసారి మంత్రి ఉత్తమ్‌ను హైదరాబాద్ వెళ్లి కలిశారు. గత 10 రోజుల కిందటే రెండుసార్లు ఆర్డీవో శ్రీనివాసులుతో భేటీ అయినా భూసేకరణ రేటుపై చర్చలు కొలిక్కి రాకపోవడంతో మంత్రి చొరవ తీసుకుని రైతులకు న్యాయం చేశారు. చింతలపాలెం మండలంలో ప్రభుత్వ రేటు కన్నా బయట రేట్లు అధికంగా ఉండడంతో రైతులు కూడా నష్టపోకుండా ధర నిర్ణయించాలని, అందుకు అధికారులు కూడా సహకరించాలని ఉత్తమ్ సూచించారు. చివరకు ఎకరా రూ.20.25 లక్షలకు రైతులు అంగీకారం తెలపడంతో సమస్య ముగిసినట్లయ్యింది. ఇదిలా ఉండగా హుజూర్‌నగర్ ప్రాంతంలో ఎత్తిపోతల పథకాలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మొదట శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలోనే దొండపాడు, చింతిర్యాల, నక్కగూడెం, మఠంపల్లి ప్రాంతాల్లో అనేక ఎత్తిపోతల పథకాలు నిర్మించడం గమనార్హం.