అంబుజా సిమెంట్‌పై నేడు ప్రజాభిప్రాయ సేకరణ
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:57 AM
మండలంలోని గణే్‌షపహాడ్ గ్రామ సమీపంలో అంబుజా సిమెంట్ పరిశ్రమ (పెన్నా సిమెంట్) మైనింగ్ విస్తరణపై అధికారులు శనివారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. 2002లో పెన్నా సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం నిర్మించగా, ఇటీవల ఈ పరిశ్రమను అదానీ గ్రూప్ కొనుగోలు చేసి అంబుజా సిమెంట్‌గా పేరు మార్చింది.

దామరచర్ల, జనవరి 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని గణే్‌షపహాడ్ గ్రామ సమీపంలో అంబుజా సిమెంట్ పరిశ్రమ (పెన్నా సిమెంట్) మైనింగ్ విస్తరణపై అధికారులు శనివారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. 2002లో పెన్నా సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం నిర్మించగా, ఇటీవల ఈ పరిశ్రమను అదానీ గ్రూప్ కొనుగోలు చేసి అంబుజా సిమెంట్‌గా పేరు మార్చింది. మండలంతోపాటు సూర్యాపేట జిల్లా శూన్యపహాడ్ గ్రామ పరిధిలో మొత్తం 354 హెక్టార్లలో మైనింగ్ గనులు విస్తరించి ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 1.8మిలియన్ టన్నులకు పెంచేందుకు పరిశ్రమ యాజమాన్యం గనులశాఖ, కాలుష్య నియంత్రణ మండలికి దరఖాస్తు చేసుకుంది. అదేవిధంగా పరిశ్రమ అనుమతులు రెండేళ్ల క్రితమే ముగిసినా యాజమాన్యం అక్రమంగా తవ్వకాలు చేస్తోందని పలువురు పర్యావరణ వేత్తలు, స్థానికులు ఇటీవల పీసీబీ, జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అటవీ భూములను సైతం ఆక్రమించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గనుల విస్తరణపై చేపట్టనున్న ప్రజాభిప్రాయ సేకరణలో అభిప్రాయాలు తెలిపేందుకు స్థానికులు సన్నద్ధమయ్యారు. ఇటీవల కాలంలో రెండు పర్యాయాలు ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు నిర్ణయించినా, పలు కారణాలతో అవి వాయిదా పడ్డాయి. తాజాగా, మూడోసారి ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.