ఆస్తి పన్ను వసూలు అంతంతే!
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:44 AM
పట్టణ వాసులు చెల్లించే పన్నులే మునిసిపాలిటీకి ప్రధాన వనరు. ఆస్తిపన్ను, భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులు, నల్లా చార్జీలు, ట్రేడ్ లైసెన్స, మునిసిపల్ ఆస్తుల అద్దెలు తదితర రూపాల్లో మునిసిపాలిటీకి ఆదాయం సమకూరుతుంది.

సూర్యాపేటటౌన్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): పట్టణ వాసులు చెల్లించే పన్నులే మునిసిపాలిటీకి ప్రధాన వనరు. ఆస్తిపన్ను, భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులు, నల్లా చార్జీలు, ట్రేడ్ లైసెన్స, మునిసిపల్ ఆస్తుల అద్దెలు తదితర రూపాల్లో మునిసిపాలిటీకి ఆదాయం సమకూరుతుంది. వీటి లో ఆస్తి పన్నుదే ప్రధాన వాటా. నిర్మాణ అనుమతుల పేరుతో ఏడాది పొడవునా ఆదాయం లభిస్తుండగా, ఆస్తి పన్నును మాత్రం ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి వందశాతం వసూలు లక్ష్యంగా మునిసిపల్ యంత్రాంగాలు కృషి చేస్తుంటాయి. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరం మరో 40 రోజుల్లో ముగియనుండగా, జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మునిసిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూలు అంతం త మాత్రంగానే ఉన్నాయి.. జిల్లాలో పన్ను డిమాండ్ రూ.28.77కోట్లు ఉండగా, ఇప్పటి వరకు కేవలం రూ.15.54కోట్లు (54.01 శాతం) మాత్రమే వసూలయ్యాయి. ఆస్తి పన్ను వసూళ్లకు పాత బకాయిలు ప్రధాన అవరోధంగా మారుతున్నట్లు మునిసిపల్ సిబ్బంది పేర్కొంటున్నారు.
గత ఏడాది సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో నూరుశాతాన్ని దాటి రికార్డు స్థాయిలో పన్నులు వసూలు చేశారు. అయితే మిగతా మున్సిపాలిటీల్లో మాత్రం అంత ఆశాజనకంగా వసూళ్లు కాలేదు. ఈసారి అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులు ముందుకువెళ్తున్నారు. మున్సిపల్ పరిధిలోని ప్రజలు గడువు సమీపిస్తున్న సమయంలో ప్రభుత్వం వడ్డీ మాఫీ ప్రకటిస్తుందని, ఆ సమయంలో పన్నులు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే అధికారులు మాత్రం ముందు నుంచే పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. ఇప్పటికే పన్నులు చెల్లించని దుకాణాలను సీజ్ చేశారు. సూర్యాపేట మునిసిపాలిటీలో ఇప్పటి వరకు 54.30శాతం మేర పన్ను వసూలు పూర్తయింది. కోదాడలో 55.70, తిరుమలగిరిలో 51.20 శాతం పన్ను లు వసూలయ్యాయి. జిల్లాలో నేరేడుచర్ల 75.73శాతం పన్ను వసూలులో ముందుండగా, హుజూర్‌నగర్‌లో కేవలం 39.03శాతంతో చివరి స్థానంలో నిలిచింది.
పన్నుల వసూళ్ల కోసం ప్రచారం
సూర్యాపేట మునిసిపాలిటీ అధికారులు ఇంటి పన్నుల వసూళ్లను ముమ్మరం చేశారు. ఇంటి పన్నులతో పాటు వాణిజ్య సముదాయాలు, సెమీ వాణిజ్య సముదాయాలకు పన్నులు చెల్లించాలని విస్తృత ప్రచారం చేపట్టారు. ముఖ్యంగా ఆస్తి, నాలా పన్ను, ట్రేడ్ లైసెన్స, ఇతర పన్నులు వసూలు చేయాల్సి ఉంటుంది. సూర్యాపేటలో ప్రత్యేకంగా వాహనాన్ని వినియోగిస్తూ అధికారులు ప్రచారం చేస్తున్నారు. జిల్లాలోని ఐదు మునిసిపాలిటీలకు కలిపి 30 బృందాలు ఈ ప్రచారం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అన్ని మునిసిపాలిటీల్లో మునిసిపల్ అధికారులు వాహనాల్లో తిరుగుతూ పన్నులు చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం పలు సర్వేలు, పథకాలకు అర్హులను గుర్తించేలా మునిసిపల్ సిబ్బందిని నియమించింది. జ్వర సర్వేతో పాటు ఇతర పనుల సర్వేలను చేపట్టడంతో వసూళ్లలో వేగం పుంజుకోలేదు. గతంలో ఆర్థిక సంవత్సరం చివరి నెలలో మాత్రమే వసూళ్లు చేస్తూ లక్ష్యం మాత్రం పూర్తి చేయలేకపోయేవారు. గతానికి భిన్నంగా ఈ ఏడాది డిసెంబరు, జనవరి నెల నుంచే వసూళ్లు ప్రారంభించారు. 30మందితో కూడిన బృందంలో బిల్ కలెక్టర్లు, ఒక ఆర్‌ఐ, ముగ్గురు జూనియర్ అసిస్టెంట్‌లు, వీరితో పాటు మున్సిపల్ సిబ్బంది, జవాన్లు పన్ను వసూళ్లు చేస్తున్నారు. ఆదివారం, ఇతర పండుగల సెలవు దినాల్లో కూడా పన్నులు చెల్లించేలా ప్రజల సౌకర్థాం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌లు కూడా ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ భవనాలు
మునిసిపాలిటీల్లో ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు ఏటా పెరుగుతున్నాయి. ఒక్క సూర్యాపేట మునిసిపాలిటీలో రూ.3.98కోట్లు ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ప్రభుత్వ కార్యాలయాల బకాయి రూ.5.37కోట్లుగా ఉంది.
పన్నుల చెల్లింపునకు ప్రజలు సహకరించాలి
పన్నుల చెల్లింపునకు ప్రజలు సహకరించాలి. సకాలంలో పన్నులు చెల్లించడం వల్ల అపరాధ రుసుం ఉండదు. పన్నులు చెల్లించకుంటే అపరాధ రుసుం అదనంగా చెల్లించాల్సి వస్తుందని ప్రజలు గమనించాలి. సెలవు దినాల్లో కూడా పన్నులు చెల్లించేలా మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశాం.
బి.శ్రీనివాస్, సూర్యాపేట మునిసిపల్ కమిషనర్