‘ఉపాధి’ ప్రణాళిక సిద్ధం
ABN , Publish Date - Feb 12 , 2025 | 01:05 AM
ఉపాధిహామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు కూలీలకు ఉపాధి కల్పించేందుకు అధికారులు ప్రణాళి క సిద్ధం చేశారు.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో 32.33లక్షల పనిదినాలు
రూ.96.99కోట్ల బడ్జెట్
421 పంచాయతీల్లో పనులు
మౌలిక సదుపాయాల కల్పన, కూలీలకు ఉపాధి
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): ఉపాధిహామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు కూలీలకు ఉపాధి కల్పించేందుకు అధికారులు ప్రణాళి క సిద్ధం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో వ్యవసాయ కూలీలకు 32.33 లక్షల పనిదినాలు కల్పించాల ని నిర్ణయించగా, ఈ మేరకు గ్రామాల్లో చేపట్టే పనులను అధికారులు గుర్తించి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో వేసవిలో వ్యవసాయ పనులు ఉండవు. ఈ నేపథ్యంలో కూలీలు పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. అయితే ఈ వలసలను నివారించి గ్రామీణ ప్రాంతాల్లోనే కూలీలకు పనులు కల్పించేందుకు ఉపాధి హామీ పనుల నిర్వహణకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే పనిదినాలను నిర్ధారించగా, ఏ గ్రామంలో ఏ పనులు చేపట్టాలన్న దానిపై డీఆర్డీడీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వివిధ శాఖల సమన్వయం తో పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద ఏటా కూలీలకు తగ్గట్టుగా నైపుణ్యం లేని పనులు, గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పన పనులు గుర్తించి బడ్జెట్ రూపొందిస్తారు. అన్ని గ్రామీణ ప్రాంతాల్లో భాగస్వామ్య పద్ధతిలో ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. దీంతో జిల్లాలో గ్రామసభలు నిర్వహించి పనులు గుర్తించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, ఇరిగేషన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సమన్వయంతో పనుల గుర్తింపు చేపడుతున్నారు. ఇందులో సాంకేతిక నిపుణుల భాగస్వామ్యంతో సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
స్థానిక అవసరాల ప్రకారం
గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అవసరాలు, ప్రాధాన్యం మేరకు సుస్థిర ఆస్తుల కల్పనకు అవసరమైన పనులు గుర్తింపు గ్రామ సభ ద్వారా గుర్తించనున్నారు. గ్రామంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా నిధులు కనీసం 60శాతానికి తగ్గకుండా మండల స్థాయిలో వ్యవసాయ సంబంధిత పనులు గుర్తించాలి. ప్రాధాన్య క్రమంలో భాగంగా గ్రామాల్లో చెట్ల పెంపకం, ఉద్యానవనాల పెంపకం, గెట్లపై మొక్కల పెంపకం, లింకు రోడ్లు, కాల్వలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. గుర్తించిన పనుల జాబితాను గ్రామసభ తీర్మానాల ద్వారా నిర్ధారించి, పంచాయతీ కార్యాలయంలో ప్రదర్శిస్తారు. అందులో గుర్తించిన పనికి ఆశించిన ప్రయోజనం, ఫలితాలను కూడా పొందుపరుస్తారు.
32.33లక్షల పనిదినాలు
జిల్లాలో మొత్తం 17 మండలాలు మొత్తం 421 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2025-26లో ఈ పథకం కింద పనులు చేపట్టేందుకు జిల్లా వ్యాప్తంగా జాబ్‌కార్డులు జారీ చేశారు. మొత్తం 32,33,056 పనిదినాలు కూలీలకు కల్పించనున్నారు. అందుకు సుమారు రూ.96,99,16,800 బడ్జెట్‌తో ప్రణాళిక రూపొందించారు. ఈ పనులకు అవసరయ్యే సామగ్రికి సంబంధించిన నిధులు అదనం. గుర్తించిన పనులు చేపట్టేందుకు అవసరమయ్యే నిధులపై అధికారులు గ్రామాల వారీగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉపాధితో పాటు మౌలిక వసతుల కల్పన, సీసీ, మెటల్ రోడ్లు వేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. నీటి పరిరక్షణ, నీటి నిల్వ, అడవుల పెంపకం, మొక్కలు నాటడటంతో పాటు కరువు నివారణ పనులు, సూక్ష్మ, చిన్నతరహా సాగు నీటి పనులు, కాల్వల నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నారు. అందుకు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభల్లో పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, డీఆర్డీవో అధికారులు పాల్గొంటున్నారు. రైతులు, కూలీలతో చర్చించి, మండలాల వారీగా గ్రామసభలు పూర్తిచేసి, గ్రామాల్లో చేపట్టాల్సిన పనులపై పూర్తిస్తాయి నివేదిక రూపొందిస్తారు. సహజ వనరుల కింద నీటి నిల్వ కందకాలు, మట్టి కట్టలు, విడి రాళ్ల కట్టలు, బంజరు భూముల్లో, రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటడం వంటి పనులు చేపట్టనున్నారు.
కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక: నాగిరెడ్డి, డీఆర్డీవో
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గ్రామాల వారీగా చేపట్టనున్న పనులపై గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో గుర్తిస్తున్నాం. జిల్లాలో మొత్తం 32,33,056 పనిదినాలు కల్పించేందుకు రూ.96.99కోట్లతో బడ్జెట్‌కు రూపకల్పన చేశాం. అన్ని గ్రామాల్లో పనులు గుర్తిస్తాం. కూలీలకు ఉపాధితోపాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టనున్న పనులకు సంబంధించిన కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం.
2025-26 ఆర్థిక సంవత్సరంలో కూలీలకు కల్పించే పనిదినాలు ఇలా..
మండలం పంచాయతీలు పనిదినాలు
అడ్డగూడూరు 17 1,45,900
ఆలేరు 14 1,01,600
ఆత్మకూరు 23 1,92,970
భువనగిరి 34 2,83,050
బీబీనగర్ 34 1,63,305
బొమ్మలరామారం 34 1,85,248
చౌటుప్పల్ 26 2,35,791
గుండాల 20 2,32,510
తుర్కపల్లి 31 2,16,538
మోటకొండూరు 18 1,19,696
మోత్కూరు 10 1,15,021
నారాయణపురం 31 2,62,100
పోచంపల్లి 22 1,42,550
రాజపేట 23 2,29,572
రామన్నపేట 24 2,06,000
వలిగొండ 37 2,07,125
యాదగిరిగుట్ట 23 1,94,080
మొత్తం 421 32,33,056