Share News

మదర్‌ డెయిరీపై రాజకీయ రగడ

ABN , Publish Date - Jan 18 , 2025 | 12:52 AM

మదర్‌ డెయిరీపై రాజకీయ రగడ జోరందుకుంది. స్వచ్ఛందంగా పాల ఉత్పత్తిదారులతో కొనసాగాల్సిన సంఘాలకు రాజకీయ రంగు పులుముకుంది. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు నగరానికి చేరువలో ఉండటంతో పాడి రైతులు నిత్యం హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాలకు ఇక్కడి నుంచి పాలను సరఫరా చేస్తున్నా రు.

మదర్‌ డెయిరీపై రాజకీయ రగడ

ఆర్థికాభివృద్ధిపై కాంగ్రెస్‌,బీఆర్‌ఎస్‌ నేతల సవాళ్లు

సంస్థ లాభ,నష్టాలపై ప్రచ్ఛన్న యుద్ధం

ఫిబ్రవరి 7న సర్వసభ్య సమావేశం

సంస్థ భూములవిక్రయమే ప్రధాన అజెండా

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): మదర్‌ డెయిరీపై రాజకీయ రగడ జోరందుకుంది. స్వచ్ఛందంగా పాల ఉత్పత్తిదారులతో కొనసాగాల్సిన సంఘాలకు రాజకీయ రంగు పులుముకుంది. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు నగరానికి చేరువలో ఉండటంతో పాడి రైతులు నిత్యం హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాలకు ఇక్కడి నుంచి పాలను సరఫరా చేస్తున్నా రు. ఒకప్పుడు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరపతి సహకార సంఘానికి(నార్మూల్‌) పాడి రైతులతో కూడిన పాలకవర్గం ఉండేది. నేడు అది రాజకీయాలకు వేదికగా మారింది.

మదర్‌ డెయిరీలోని ఆస్తులు, లాభాలు, నష్టాలపై అధికార కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య ప్రస్తుత ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. రైతుల డబ్బులతో కొనుగోలు చేసిన మదర్‌ డెయిరీ భూములను విక్రయించాలని ప్రస్తుత పాలకవర్గం చూస్తోందని గత పాలకవర్గ సభ్యులు ఆరోపిస్తున్నారు. రైతులకు బోనస్‌ చెల్లించడంతోపాటు సంస్థ ఆస్తులను కాపాడామని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే పదేళ్లుగా మదర్‌ డెయిరీలో జరిగిన అవకతవకల కారణంగా నష్టాలు వచ్చాయని, దీంతో సంస్థ భూములు విక్రయించి రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ప్రస్తుతం పాలకవర్గం ఎదురుదాడి చేస్తోంది. కొత్త పాలకవర్గం మూడునెలల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్‌ఎ్‌సకు చెందిన సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌ సభ్యులు గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి, నష్టాలు సహా పాల సంఘాలకు వివరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఫిబ్రవరి 7వ తేదీన పాల సంఘాలతో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి, భూముల విక్రయంపై తీర్మానం చేసేందుకు ప్రస్తుత పాలకవర్గం సన్నాహాలు చేస్తోంది. మదర్‌ డెయిరీకి చిట్యాలలో 32ఎకరాలు, మిర్యాలగూడలో 1.20ఎకరాలు, హాలియా, మాల్‌, తదితర ప్రాంతాల్లో సొంతంగా భూములు ఉన్నాయి. ఈ భూములపైనే ప్రస్తుత, గత పాలకవర్గ సభ్యుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 350 పాలకసంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాల చైర్మన్లను సర్వసభ్య సమావేశానికి ఆహ్మానించి, మదర్‌ డెయిరీ ఆర్థిక పరిస్థితి, లాభాలు, నష్టాలపై పూర్తిస్థాయి నివేదికను అందించేందుకు ప్రస్తుత పాలకవర్గం ప్రయత్నాలు చేస్తోంది. గత పాలకమండలి ఆధ్వర్యంలో పదేళ్లలో రూ.35కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని లెక్కలతో సహా చెబుతోంది.

పదేళ్లల్లో రూ.35 కోట్ల నష్టం : గుడిపాటి మధుసూదన్‌రెడ్డి, మదర్‌ డెయిరీ చైర్మన్‌

మదర్‌ డెయిరీ గత పదేళ్లలో రూ.35కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని, దీంతో పాడి రైతులకు చెల్లింపులు నిలిచి ఇబ్బందులు పడుతున్నారని మదర్‌ డెయిరీ చైర్మన్‌ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం భువనగిరిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పాలకమండలి తీసుకున్న నిర్ణయాల్లో పలు అవకతవలు, అక్రమాలు జరిగాయని, దీంతో సంస్థ అప్పుల్లో చిక్కుకుందన్నారు. సంస్థ పాలసేకరణ ఇప్పటివరకు 65వేల లీటర్లు దాటలేదని, అయితే గత పాలకసభ్యులు 1.20లక్షల లీటర్లు సేకరించామని చెప్పడం శోచనీయమన్నారు. ఎవరి హాయంలో ఎం త అప్పులయ్యాయి, ఎంత నష్టం జరిగిందో త్వరలోనే అన్ని వివరాలు సభ్యులకు తెలియజేస్తామన్నారు. డెయిరీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, రైతులకు నాలుగు నెలలుగా రూ.20కోట్ల మేరక పాల బిల్లలు చెల్లించాల్సి ఉందన్నారు. సంస్థ బజారున పడేలా గత పాలకు లు వ్యవహరించారని విమర్శించారు. సహకార చట్టం ప్రకారం సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు కొత్త గా ఉద్యోగాలుగానీ, పదోన్నతులు గానీ కల్పించకూడదని, అయితే నష్టాల్లో ఉన్న డెయిరీ రెండేళ్ల కాలంలో ఇష్టానురీతిలో ఉద్యోగులను నియమించారని, తద్వారా సంస్థపై మరింత ఆర్థిక భారం పడిందన్నారు. ఎలాంటి అర్హతలు లేకున్నా 250మందికి ఉద్యోగాలు కల్పించారని ఆరోపించారు. గత పాలకులు సంస్థకు చెందించిన భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తెచ్చిన రుణాలకు నెలకు రూ.5లక్షల మేరకు వడ్డీ చెల్లిస్తున్నామని, ఏడాదికి రూ.5కోట్లు వడ్డీకే పోతాయన్నారు. డెయిరీ వార్షిక నివేదికల్లో అప్పటి పాలకవర్గం ఒకటి లాభాలు ఉన్నట్టుగా, మరోటి నష్టాల్లో ఉన్నట్టు రెండు తప్పుడు నివేదికలురూపొందించిందని, వీటి ఆధారంగా బ్యాంకుల్లో రుణాలు పొందేవారని ఆరోపించారు. అందుకు సంబంధించి ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని, వీటిని పాలకవర్గ సభ్యులకు తెలియజేస్తామని తెలిపారు. ప్రస్తుతం డెయిరీ భూములు విక్రయిస్తే తప్ప రైతులకు డబ్బు చెల్లించే పరిస్థితి లేదన్నారు. డెయిరీ రూ. 35కోట్ల అప్పులతో పాటు రైతులకు సంబంధించి రూ.12 కోట్ల షేర్‌క్యాపిటల్‌ను గత పాలకవర్గం వినియోగించుకుందన్నారు. మాజీ చైర్మన్‌ శ్రీకర్‌రెడ్డి హయాంలో రెండేళ్లలో రూ.7.48కోట్ల మేరకు నష్టం వాటిల్లిందన్నారు. సంస్థ ఒక పక్క నష్టాల్లో ఉంటే, మరోపక్క లాభాల్లో ఉన్నట్టు రూ.45లక్షల ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లించారని ఆరోపించారు. సమావేశంలో మదర్‌ డెయిరీ డైరెక్టర్లు గొల్లపల్లి రాంరెడ్డి, మందడి ప్రభాకర్‌రెడ్డి, కల్లెపల్లి శ్రీశైలం, పుప్పాల నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.

మదర్‌ డెయిరీ పాలకమండలి రూపొందించిన నష్టాల నివేదిక ఇలా..

సంవత్సరం నష్టం

2015-16 రూ.8,12,58,578

2016-17 రూ.2,11,47,520

2017-18 రూ.2,24,83,176

2018-19 రూ.1,98,33,139

2019-20 రూ.3,08,79,584

2020-21 రూ.1.92,33,229

2021-22 రూ.3,67,02,301

2022-23 రూ.4,52,17,923

2023-24 రూ.7,48,33,021

మొత్తం రూ.35,15,88,471

Updated Date - Jan 18 , 2025 | 12:52 AM