Share News

ఊరూ వాడా సంక్రాంతి

ABN , Publish Date - Jan 14 , 2025 | 01:16 AM

ఆకాశంలో ఉన్న రంగులు వాకిటవాలి సింగడైన వేళ, ఆడపడుచుల సందడికి ప్రకృతి పులకించిన సమయాన చిన్నా, పెద్ద అంతా సంబురమే. కొత్త అల్లుళ్లరాక, కోడి పందేల సందడి. బసవన్నల సంచారం, హరిదాస లు కీర్తనలతో సరదాల సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. మూడు రోజుల ముచ్చటైన పండగలో సోమవారం భోగి వేడుకలను అంతా ఘనంగా జరుపుకున్నారు.

ఊరూ వాడా సంక్రాంతి

సందడిగా భోగి వేడుకలు

ఇంటి ముందు వెల్లివిరిసిన రంగవల్లులు

హరిదాసు కీర్తనలు

పతంగుల ఎగురవేతలో యువత, పిల్లలు

(ఆంధ్రజ్యోతి- భువనగిరి టౌన్‌): ఆకాశంలో ఉన్న రంగులు వాకిటవాలి సింగడైన వేళ, ఆడపడుచుల సందడికి ప్రకృతి పులకించిన సమయాన చిన్నా, పెద్ద అంతా సంబురమే. కొత్త అల్లుళ్లరాక, కోడి పందేల సందడి. బసవన్నల సంచారం, హరిదాస లు కీర్తనలతో సరదాల సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. మూడు రోజుల ముచ్చటైన పండగలో సోమవారం భోగి వేడుకలను అంతా ఘనంగా జరుపుకున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభానికి ముందు రోజు కష్టాలు తొలగిపోయి, అన్నీ శుభాలు సంప్రాప్తించాలని కోరుతూ భోగి మంటలు వేశారు. ఈ మంటల్లో చెడును వదిలించుకోవడానికి పాత సామాగ్రిని దహనం చేయడం సంప్రదా యం. ఉమ్మడి జిల్లాలోని పట్టణాలు. పల్లెల్లో సోమవారం తెల్లవారు జామునుంచే వేడుకలు మొదలయ్యాయి. ఊరు, వాడల్లో భోగిమంటలు వేసి సంబురాలు జరుపుకున్నారు. అదేవిధంగా నేడు జరిగే సంబురాల సంక్రాంతికి అంతా సిద్ధమయ్యారు. రేపు కనుమకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఇళ్ల ముంగిట రంగురంగుల ముగ్గులువేసి, ఆవుపేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించారు. ఇంటికి చేరిన ఆడపడుచులు, బంధువులు, ముగ్గులతో ఇంటి ప్రాంగణాలను తీర్చిదిద్దడంతో ప్రతీ ఇల్లూ కళకళలాడుతోంది.

ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు : నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి

హుజూర్‌నగర్‌ : రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలి. పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రైతులకు పెద్దపీట వేశాం. రాష్ట్రంలో రైతులు పెద్ద మొత్తంలో పంట దిగుబడి సాధించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుకు అండగా ఉంటుంది. రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రె్‌సకే దక్కింది. రైతుభరోసా పూర్తిస్థాయిలో అమలు చేస్తాం. హుజూర్‌నగర్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా. రాష్ట్రంలోని జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉంది. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు.

సౌభాగ్యాల సంక్రాంతి కావాలి: - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రి

నల్లగొండ టౌన్‌ : తెలుగువారందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, కుటుంబ సమేతంగా జరుపుకోవాలి. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమం, సుపరిపాలన ప్రగతిపథంలో ముందుకు సాగుతున్న తరుణంలో ప్రజలంతా స్వేచ్ఛా, సౌభాగ్యాలతో సంబురంగా సంక్రాంతిని జరుపుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ప్రజాప్రభుత్వానికి దేవుడి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నా.

సకల జనులకు పండుగే

ఈ నెల 26న నాలుగు పథకాల అమలుకు శ్రీకారం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 42వేల మందికి ఇందిరమ్మ ఇళు

భూమిలేని కూలీలకు ఆత్మీయ భరోసా

కొత్త రేషన్‌ కార్డుల మంజూరు

సాగులో ఉన్న భూమికి రైతు భరోసా

(ఆంధ్రజ్యోతి-నల్లగొండ): రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అదేవిధంగా 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు కొత్త పథకాలను అందించేందుకు అన్నిఏర్పాట్లను పూర్తిచేసింది. గడిచిన ఏడాది కాలంలో 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ అందజేస్తూ వచ్చింది. తాజాగా ఏకంగా నాలుగు ప్రజాప్రయోజనంగా ఉన్న పథకాలను అమలు చేయనుండటంతో ఉమ్మడి జిల్లా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

సేద్యానికి యోగ్యమైన ప్రతి ఎకరాకూ రూ.12వేలు అందజేయనుండగా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల మంజూరుకు ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం కసరత్తులు చేస్తోంది. ఈ నెల 12న రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో పాటు అధికారులు అందరితో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26న పథకాలు అన్ని అమలులోకి రానున్నాయి.

మూడు జిల్లాలో 42వేల ఇందిరమ్మ ఇళ్లు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో మొదటి విడతలో 42వేల ఇల్లను మంజూరు చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 12 నియోజకవర్గాలకు 42వేల ఇళ్లు మంజూరు చేయనున్నారు. దీంతో నిరుపేదలకు సొంతింటి కల నెరవేరనుంది. లబ్ధిదారులు 400చదరపు అడుగుల స్థలంలో ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం సహాయం అందించనుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల కమిటీలను వేసి దరఖాస్తులను పరిశీలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,740 గ్రామపంచాయతీలకు నల్లగొండ జిల్లాలో 844, సూర్యాపేట జిల్లాలో 475 గ్రామాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 421 చొప్పున ఉన్నాయి. 19 మునిసిపాలిటీలు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి ఆన్‌లైన్‌లో కూడా పొందుపర్చారు. మొదటి దశలో వీరందరికి ఇళ్లు మంజూరు కానుండటంతో నిర్మాణాలు కూడా మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంతాంగ్రం అన్నిఏర్పాట్లను పూర్తిచేస్తుంది. మరో 50 వేలకు పైగా కొత్త రేషన్‌కార్డులు

కొత్త రేషన్‌కార్డులకు మోక్షం రానుంది. గత ప్రభుత్వం హయాంలో కొత్త రేషన్‌ కార్డులను ఇవ్వకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు వారికి అందని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.10.07 లక్షలకు ఆహారభద్రత కార్డులు ఉండగా యూనిట్ల విషయానికి వస్తే 29,82,694 ఉన్నాయి. ఇందుకుగాను మూడు జిల్లాలో ప్రతినెలా 19వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. మరో 50వేలకు కార్డులు కొత్తగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తులన్నింటినీ పరిశీలన పూర్తి చేశారు. ప్రతి సంక్షేమ పథకానికి రేషన్‌కార్డు ప్రామాణికం కావడంతో ప్రతి ఒక్క నిరుపేద రేషన్‌కార్డు కోసం ఎదురుచూపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం సైతం జనవరి 26న అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు ఇవ్వడం కోసం కార్యాచరణను సిద్ధం చేసింది.

భూమి లేని కూలీలకు ఆత్మీయ భరోసా

భూమి లేని కూలీలందరికీ ప్రతి ఏటా రూ.12వేలు వారి ఖాతాలో జమ చేయడం కోసం ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ఉపాధి హామీ జాబ్‌ కార్డులను పరిగణనలోకి తీసుకొని భూమిలేని వారిని గుర్తించి వారికి ఆత్మీయ భరోసా అందజేస్తారు. అయితే కౌలు రైతులకు కూడా, భూమిలేని కూలీలతో కలిపి ఆత్మీయ భరోసా ఇస్తారనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 16 నుంచి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి కార్యాచరణ చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో 3.5 లక్షలుగా పైగా కౌలు రైతులుండగా కూలీలు ఎంతమంది అనేది లెక్కతేలుస్తున్నారు. ఈ 12వేలను రెండు విడతలుగా వారి ఖాతాలో వేయనున్నారు. ఇందుకోసం అధికార యంతాంగ్రం అంతా లెక్కగట్టే పనిలో ఉంది. మొత్తానికి భూమిలేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సాయం అందనుండటంతో వారు అంతా ఆతృతతో ఉన్నారు.

రైతు భరోసా కింద రూ.12వేలు

సాగులో ఉన్న భూమికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా రూ.12వేలను పెట్టుబడి సాయం కింద అందజేయనుంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.7500ల చొప్పున మొత్తం రూ.15వేలను జమ చేస్తామని చెప్పారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రూ.15వేలు కాకుండా రూ.12వేలు వేయనున్నారు. నల్లగొండ, యాదాద్రిభువనగిరి, సూర్యాపేట జిల్లాలో 21.50లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. రాళ్లు, రప్పలు, గుట్టలు ఉన్న భూములకు రైతుభరోసాను నిలిపివేశారు. కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతుభరోసా చెల్లించనున్నారు. గత ప్రభుత్వం హయాంలో ఎకరాకు రూ.5వేలు ఉండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎకరాకు రూ.6వేలు అంటే రెండు సీజన్‌లో కలిపి రూ.12వేలను పెట్టుబడి సాయంగా ఇవ్వనున్నారు.

16 నుంచి క్షేత్రస్థాయిలో సాగు భూముల పరిశీలన:శ్రవణ్‌కుమార్‌, జేడీఏ, నల్లగొండ

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సాగుకు యోగ్యమైన భూములను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. గ్రామసభల ఆమోదం కోసం 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సమావేశాలు నిర్వహిస్తాం. 24వ తేదీన సాయంత్రం రైతుభరోసాకు సంబంధించి రైతులు సాగుచేసే వివరాలన్నింటినీ నమోదుచేయడం చేస్తాం. 26వ తేదీన రైతుభరోసా నిధులు అర్హులైన ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమవుతాయి.

Updated Date - Jan 14 , 2025 | 01:16 AM