స్వస్తివాచనంతో అంకురార్పణ
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:38 AM
యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ స్వస్తివాచనంతో ప్రారంభమయ్యాయి.

మొదటిరోజు పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు
భువనగిరి అర్బన, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి) : యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ స్వస్తివాచనంతో ప్రారంభమయ్యాయి. పాతగుట్ట ఆలయ మండపంలో విష్వక్సేనుడికి పూజలు జరిపి ఉత్సవాలకు శాసో్త్రక్తంగా శ్రీకారం చుట్టారు. మంత్రించిన ఘటాల్లోని జలాలతో పుణ్యాహవచనం చేసి ఆలయ పరిసరాలలో మంత్రజలంతో సంప్రోక్షణ జరిపారు. అనంతరం ఉత్సవమూర్తులను పట్టువసా్త్రలు, ముత్యాలు, బంగారు ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై అధిష్టింపజేసి విశేషపూజల తర్వాత బ్రహ్మోత్సవాలకు తెర తీశారు. రక్షాసూత్రాలను వేదమంత్రాలతో పూజించి స్వామి, అమ్మవార్లకు, నిర్వాహకులకు, భక్తులకు కంకణధారణ చేశారు. మహోత్సవాలలో ముక్కోటి దేవతలను ఆహ్వానించే ప్రక్రియ స్వస్తివాచనమని, స్వామి, అమ్మవార్లను దీక్షాపరులను చేస్తూ రక్షాసూత్రధారణ జరిపినట్టు ఆచార్యులు వివరించారు.
అంకురారోపణ, మృత్స్యంగ్రహణం
నిత్యారాధనల అనంతరం సాయంత్రం అంకురారోపణ, మృత్స్యంగ్రహణం నిర్వహించేందుకు తిరువీఽధిలోని స్వామివారి కల్యాణమండపం వద్ద పుట్టమట్టికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆచార్యులు పుట్టమట్టి తెచ్చి పాలికలలో నవధాన్యాలను విత్తి అంకురారోపణ పర్వాలు చేపట్టారు. విత్తనాలు కలిగిన పుట్టమన్నును పాలు, శుద్ధజలంతో నిత్యం తడిపి ఉత్సవసమాప్తి వరకు విత్తనాలు అంకురించిన విధంగా ఉత్సవాలు వైభవంగా జరుగుతాయని, అందుకే శ్రీ వైష్ణవ దేవాలయాల్లో ఈ వేడుకలను నిర్వహిస్తారని పూజారులు వివరించారు. బ్రహ్మాండనాయకుడి మహోత్సవాల సందర్భంగా అర్చకులకు, రుత్వికులకు ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నర్సింహమూర్తి, అధికారులు దీక్షావసా్త్రలను అందజేశారు. పూజాపర్వాలను ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటాచార్యులు బృందం నిర్వహించగా వేడుకల్లో ఈవో భాస్కర్‌రావు, డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవో దూశెట్టి క్రిష్ణ, ఉప ప్రధానార్చకులు కొడకండ్ల మాధవచార్యులు, భట్టర్ సురేంద్రచార్యులు, పర్యవేక్షకుడు శంకర్‌నాయక్, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
పాతగుట్ట మెట్ల మార్గం సుందరీకరణ
పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మెట్లమార్గం సుందరీకరించారు. క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకునేందుకు కొండబండపైనే మెట్లను తీర్చిదిద్దారు. భక్తులు అక్కడే ఉన్న పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి పక్కనే ఉన్న క్షేత్రపాలకుడి దర్శించుకున్న తర్వాత స్వయంభువులను దర్శించుకోవడం ఆనవాయితీ. గతేడాది నుంచి గ్రానైట్‌తో మెట్లు, (ఎస్‌ఎస్ రేలింగ్) స్టీల్‌పైపు బిగించి అందుబాటులోకి తెచ్చారు.
వైభవంగా సువర్ణ పుష్పార్చన, ఊంజల్ సేవోత్సవాలు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో శుక్రవారం స్వామివారికి స్వర్ణపుష్పార్చన, అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం వైభవంగా జరిపారు. సుప్రభాత సేవతో స్వయంభువులను మేల్కొలిపి పంచామృతాలు, వేదమంత్ర పఠ నాలతో అభిషేకం, తులసీదళాలు, కుంకుమతో ఆర్చించారు. ప్రాకార మండపంలో హోమం, నిత్యకల్యాణం సంప్రదాయరీతిలో కొనసాగాయి. సాయంత్రం ప్రధానాలయంలో కొలువుదీరిన ఆండాళ్ అమ్మవారిని అలంకార సేవలో తీర్చిదిద్దారు. అనంతరం అద్దాల మండపం ఊంజల్ సేవోత్సవాలు నిర్వహించారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల నుంచి రూ. 15,62,948 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఏ భాస్కర్‌రావు తెలిపారు.