పెరిగిన చైనస్నాచింగ్ బాధితుల సంఖ్య
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:18 AM
బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగవారం నిర్వహించిన రైతు మహాధర్నాలో జరిగిన చైనస్నాచింగ్ బాధితుల సంఖ్య బుధవారానికి పెరిగింది.

మహారాష్ట్రకు చెందిన ముఠాగా గుర్తింపు
పట్టుకునేందుకు నాలుగు బృందాలు
నల్లగొండ క్రైం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగవారం నిర్వహించిన రైతు మహాధర్నాలో జరిగిన చైనస్నాచింగ్ బాధితుల సంఖ్య బుధవారానికి పెరిగింది. మంగళవారం సుమారు ఆరుగురు పోలీసులకు ఫిర్యాదుచేయగా, బుధవారానికి ఆ సంఖ్య 12కు చేరింది. అయితే బాధితుల్లో ఎక్కువగా తులంన్నర నుంచి రెండు తులాల బంగారు గొలుసులు చోరీకి గురయ్యాయి. మంగళవారం చోరీ జరిగిన వెంటనే ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించారు. అతడిచ్చిన సమాచారం మేరకు పోలీసులు చోరీలకు పాల్పడింది అంతర్రాష్ట్ర ముఠాగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. మహారాష్ట్రకు చెందిన అనుభవం ఉన్న చోరీ ముఠాను పట్టుకునే పనిలో పడ్డారు. అయితే ఈ చోరీ పక్కా ప్రణాళిక ప్రకారం మంగళవారం రోజు ఉదయం నుంచే మీటింగ్ జరిగే ప్రాంతం మొదలుకుని ర్యాలీ జరిగే ప్రతీ ప్రాంతంలో రెక్కీ నిర్వహించి ఎవరెవరూ ఎక్కడ ఉండి చోరీ చేయాలో పథకం రచించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ చోరీలో మొత్తం 14 మంది వరకూ పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. వీరిని పట్టుకునేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వేట ప్రారంభించినట్లు తెలిసింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు బృందాలు నేరస్తులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు.