Share News

ప్రయాణ కష్టాలు ఉండవిక

ABN , Publish Date - Jan 14 , 2025 | 01:13 AM

హైదరాబాద్‌ మార్గంలో భువనగిరి ప్రయాణికుల ప్రయాణకష్టాలు ఎట్టకేలకు తీరాయి. ఈ మార్గంలో బస్సుల్లో వెళ్లాలంటే ఇటీవలి వరకు ప్రయాణికులకు ఓ పరీక్షగా ఉండేది. బస్సు కోసం రాత్రీపగలు తేడా లేకుండా గంటల తరబడి భువనగిరి, హైదరాబాద్‌ ఉప్పల్‌లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి.

ప్రయాణ కష్టాలు ఉండవిక

భువనగిరి-ఉప్పల్‌ మధ్య ఆరు షటిల్‌ సర్వీసులు

రోజుకు 36 ట్రిప్పులు 8 17 నుంచి పూర్తిస్థాయి సేవలు

అన్ని డీలక్స్‌లే, మహాలక్ష్మి ప్రయాణికులు కూడా టికెట్‌ తీసుకోవాల్సిందే

భువనగిరి టౌన్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌ మార్గంలో భువనగిరి ప్రయాణికుల ప్రయాణకష్టాలు ఎట్టకేలకు తీరాయి. ఈ మార్గంలో బస్సుల్లో వెళ్లాలంటే ఇటీవలి వరకు ప్రయాణికులకు ఓ పరీక్షగా ఉండేది. బస్సు కోసం రాత్రీపగలు తేడా లేకుండా గంటల తరబడి భువనగిరి, హైదరాబాద్‌ ఉప్పల్‌లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. యాదగిరిగుట్టకు, స్వర్ణగిరికి భక్తుల తాకిడి పెరగడంతో పాటు మహాలక్ష్మి ఉచిత ప్రయాణంతో ఊహించని స్థాయిలో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ప్రత్యేకించి శని, ఆదివారాలలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు అంతేస్థాయిలో వారి కష్టాలు కూడా పెరిగాయి. దీంతో ఈ మార్గంలో బస్సుల సంఖ్య పెంచాలంటూ ఆందోళనలు నిత్యకృత్యమయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి భువనగిరి బస్టాండ్‌ను సందర్శించి త్వరలోనే బస్సుల సంఖ్యను పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 10న భువనగిరి -ఉప్పల్‌ మార్గంలో ఆరు షటిల్‌ బస్సు సర్వీసులను ప్రారంభించారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణ కష్టాలు తీరాయి. కానీ సంక్రాంతి పండుగ రద్దీ కారణంగా ఉప్పల్‌ డిపో బస్సులను ఆంధ్రప్రదేశ్‌ మార్గంలో నడిపేందుకు నాలుగు రోజుల పాటు భువనగిరి మార్గంలో షటిల్‌ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. తిరిగి ఈ నెల 17 నుంచి పూర్తిస్థాయిలో సర్వీసులు నడుపుతామని ఉప్పల్‌ డిపో అధికారులు తెలిపారు.

ఆరు బస్సులు, 36 ట్రిప్పులు

ఉప్పల్‌ డిపోకు చెందిన ఆరు బస్సులు భువనగిరి- ఉప్పల్‌ మధ్య ప్రతి రోజూ 36 ట్రిప్పులు నడువనున్నాయి. 40 సీట్ల సామర్య్థం గల బస్సులన్నీ డీలక్స్‌ బస్సులే కావడంతో వీటిలో మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం వర్తించదు. దీంతో ఈ బస్సుల్లో గమ్యస్థానం చేరాలంటే మహిళలు కూడా తప్పనిసరిగా టికెట్‌ తీసుకోవాల్సిందే. ఉప్పల్‌ నుంచి ఉదయం 5.40 గంటలకు, భువనగిరి నుంచి ఉదయం 6.40 గంటలకు మొదటి బస్సులు ప్రారంభమవుతాయి. సుమారు ప్రతి 15 నిమిషాలకు ఇరువైపులా ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఇరువైపులా ప్రస్తుతానికి చివరి బస్సు రాత్రి 8 గంటలకు ఉండగా పరిస్థితులకు అనుగుణంగా బస్సుల సమయాలను మారుస్తామని ఉప్పల్‌ డిపో అధికారులు తెలిపారు. అలాగే ఈ మార్గంలో ఇప్పటికే యాదగిరిగుట్ట డిపో ప్రతీ రోజు సుమారు 200 ట్రిప్పులు, ఉమ్మడి వరంగల్‌ డిపోలకు చెందిన మరిన్ని బస్సులు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ షటిల్‌ సర్వీసులు మాత్రం భువనగిరి-ఉప్పల్‌ మధ్యే నడువనుండడంతో ఆ రెండు బస్టాండ్లలో బస్సులను ఎక్కే స్థానిక ప్రయాణికులకు సీట్లు లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఉప్పల్‌ డిపోకు చెందిన ఆరు షటిల్‌ బస్సులు భువనగిరి - ఉప్పల్‌ మార్గంలో నడువనుండడంతో యాదగిరిగుట్ట డిపోకు ఆదాయం తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రయాణికుల ఇబ్బందులు తీర్చడమే ఆర్టీసీ లక్ష్యమని సంబంధిత అధికారులు అంటున్నారు.

చార్జీలు ఇలా..

షటిల్‌ సర్వీసులు భువనగిరి, ఉప్పల్‌ మధ్య కేవలం బీబీనగర్‌, ఘట్‌కేసర్‌ మధ్యలోనే ఆగనున్నాయి. మధ్యలో దిగాలనుకునే ప్రయాణికులు ముందు స్టేజీ టికెట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. చార్జీలు భువనగిరి - ఉప్పల్‌ మధ్య రూ.80, భువనగిరి-ఘట్‌కేసర్‌, భువనగిరి - బీబీనగర్‌, ఉప్పల్‌- బీబీనగర్‌కు రూ.60చొప్పున, ఘట్‌కేసర్‌ - బీబీనగర్‌కు రూ.40గా ఉంటాయి.

ఇతర మార్గాలలో కూడా...

హైదరాబాద్‌- ఉప్పల్‌ మధ్యే కాకుండా నియోజకవర్గంలోని పలు గ్రామాలను కలుపుతూ హైదరాబాద్‌కు ఇటీవలే బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. దిల్‌సుఖ్‌నగర్‌ టూ వలిగొండ వయా హయత్‌నగర్‌, బీబీనగర్‌ టూ చౌటుప్పల్‌ వయా పోచంపల్లి, ఉప్పల్‌ టూ చందుపట్ల, బీబీనగర్‌ టూ నాగిరెడ్డిపల్లి వయా భట్టుగూడం బస్సు సర్వీసులు ఇటీవల ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయాల్లో ఉదయం, సాయంత్రం ఆయా మార్గాల్లో యాదగిరిగుట్ట డిపో బస్సు సర్వీసులను నడుపుతున్నారు. దీంతో విద్యార్థులు సకాలంలో పాఠశాలలకు తిరిగి గమ్యస్థానాలకు సరైన సమయంలో ప్రయాణించే సధుపాయం ఏర్పడింది. ప్రయాణికులకు కూడా ఆ మార్గాలలో రవాణా కష్టాలు తీరాయి.

మాట నిలుపుకున్న ఎమ్మెల్యే : పోతంశెట్టి వెంకటేశ్వర్లు, చైర్మన్‌ భువనగిరి మునిసిపాలిటీ.

భువనగిరి- హైదరాబాద్‌ మార్గంలో ప్రయాణ కష్టాలు తీరుస్తామని ఇచ్చిన హామీని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి నిలుపుకున్నారు. ఎమ్మెల్యే కృషితోనే భువనగిరి - ఉప్పల్‌ మార్గంలో షటిల్‌ సర్వీసులు నడువనున్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణికులు సులువుగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. భువనగిరి బస్టాండ్‌లో ప్రయాణికులకు పూర్తిస్థాయి వసతులను కల్పిస్తాం. మోడల్‌ బస్టాండ్‌గా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు.

త్వరలోనే మరిన్ని బస్సు సర్వీసులు: కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి.

భువనగిరి - ఉప్పల్‌ మార్గంలో ప్రాంభమైన నూతన షటిల్‌ సర్వీసులతో ఆ మార్గంలో ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. ప్రయాణికుల డిమాండ్‌ మేరకు అవసరమైతే మరిన్ని బస్సులను నడుపుతాం. బస్టాండ్‌లలో నిరీక్షించకుండానే ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరడమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలోని ప్రతీ గ్రామానికి బస్సులను నడిపేలా ఆర్టీసి అధికారులతో చర్చిస్తున్నాం. యాదగిరిగుట్ట, స్వర్ణగిరి పుణ్యక్షేత్రాలతో పాటు ఉద్యోగం, ఉపాధి, విద్య కోసం భువనగిరికి వస్తున్న ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో ఆ స్థాయిలో బస్టాండ్‌లో వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

Updated Date - Jan 14 , 2025 | 01:13 AM