Share News

రైతులతో చర్చలు విఫలం

ABN , Publish Date - Jan 04 , 2025 | 12:17 AM

ఎత్తిపోతల పథకానికి సంబంధించి చింతలపాలెం మండలం వెల్లటూరు రైతులతో అధికారుల చర్చలు విఫలమయ్యాయి.

రైతులతో చర్చలు విఫలం

హుజూర్‌నగర్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : ఎత్తిపోతల పథకానికి సంబంధించి చింతలపాలెం మండలం వెల్లటూరు రైతులతో అధికారుల చర్చలు విఫలమయ్యాయి. కృష్ణానదిపై వందల కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకానికి సంబంధించి పంప్‌హౌస్‌ నిర్మాణం కోసం వెల్లటూరు గ్రామానికి చెందిన 35 మంది రైతులతో సుమారు 68.50 ఎకరాలకు సంబంధించిన భూసేకరణ చేయాల్సి ఉంది. ఆరు నెలలుగా సర్వేచేసిన అధికారులు భూసేకరణకు సహకరించాలని కోరగా రైతులు అందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. కాగా మార్కెట్‌ రేటు ప్రకారం భూమి ధర ఇవ్వాలని రైతులు కోరారు. గతంలో రెండు విడతలుగా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌పవార్‌తో రైతులు భేటీ అయ్యారు. కాగా రెవెన్యూ అధికారులు, రైతుల మధ్య ధర విషయంలో అనేకసార్లు చర్చలు జరిగాయి. శుక్రవారం ఉదయం ఆర్డీవో కార్యాలయంలో అధికారుల విజ్ఞప్తి మేరకు 50 మంది రైతులు సమావేశానికి హాజరయ్యారు. ఎకరానికి రూ.25లక్షలు ఇవ్వాలని రైతులు కోరగా అధికారులు రూ.18లక్షలు వరకు ఇస్తామన్నారు. దీంతో అంగీకరించని రైతులు సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. ప్రభుత్వం సముచితంగా పరిహారం ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా సమావేశాన్ని మరోసారి నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. సమీక్షా సమావేశంలో ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్‌ సురేందర్‌రెడ్డి, ఆర్‌ఐ ఆత్రేయ, చల్లా శ్రీనివాస్‌, కృష్ణారెడ్డి, జగనమోహనరెడ్డి, సుబ్బమ్మ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 12:17 AM