ఇల్లు కావాలి..
ABN , Publish Date - Jan 25 , 2025 | 01:17 AM
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు ఉమ్మడి జిల్లా ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. సంక్షే మ పథకాలకు అర్హులను ఎంపిక చేసేందుకు నాలుగు రోజులుగా నిర్వహించిన గ్రామ, వార్డు సభలు శుక్రవారం తో ముగిశాయి.

ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా 1.08లక్షల దరఖాస్తులు
రేషన్ కార్డుల కోసం 1.05లక్షలు
మొత్తం 2.69లక్షల దరఖాస్తులు
ముగిసిన గ్రామ సభలు
పలుచోట్ల ఆందోళనలు, నిరసనలు
(ఆంధ్రజ్యోతి,సూర్యాపేట కలెక్టరేట్): రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు ఉమ్మడి జిల్లా ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. సంక్షే మ పథకాలకు అర్హులను ఎంపిక చేసేందుకు నాలుగు రోజులుగా నిర్వహించిన గ్రామ, వార్డు సభలు శుక్రవారం తో ముగిశాయి. కాగా, ఈ సభల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా 2.69లక్షల దరఖాస్తులు రాగా, అందులో అత్యధికం గా ఇందిరమ్మ ఇళ్ల కోసం 1.08లక్షలు, రేషన్ కార్డుల కోసం 1.05లక్షల దరఖాస్తులు వచ్చాయి.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిర్వహించిన ప్రజాపాలనలో సంక్షేమ పథకాల కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదే విధంగా ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కూడా అర్హుల జాబితా ను రూపొందించారు.అయితే గ్రామ సభల్లో ప్రకటించిన అర్హుల జాబితాలో పేర్లు లేవని పలు గ్రామాలు, వార్డుల్లో ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. జాబితాలో పేర్లు లేని వారు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు స్పష్టంచేయగా,ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2.69లక్షల దరఖాస్తులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,745 పంచాయతీలు, 19 మునిసిపాలిటీల్లో 427 వార్డులు ఉన్నాయి. నాలుగు రోజుల పాటు నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో ప్రజల నుంచి మొత్తం 2,69,295 దరఖాస్తులు వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్ల కోసం 1,08,012 దరఖాస్తులు, రేషన్ కార్డుల కోసం 1,05,691, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం 49,222, రైతు భరోసా కోసం 6,370 దరఖాస్తులు వచ్చాయి. సూర్యాపేట జిల్లాలో 475 గ్రామ పంచాయతీలు, ఐదు మునిసిపాలిటీ ల పరిధిలోని 141 వార్డులు ఉన్నాయి. గ్రామ సభల్లో కొత్తగా 77,037 దరఖాస్తులు వచ్చాయి. రైతు భరోసా కోసం 2,828 మంది, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం 22,186 మంది, రేషన్‌కార్డుల కోసం 23,798మంది, ఇందిరమ్మ ఇళ్ల కోసం 28,225 మంది దరఖా స్తు చేశారు. గతంలో ప్రజాపాలన కార్యక్రమంలో కూడా పలువురు దరఖాస్తు చేసుకోగా, అందులో కొంతమందిని మాత్రమే అధికారులు అర్హులుగా గుర్తించారు.
పలు గ్రామాలు, వార్డుల్లో ఆందోళనలు
ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాల కోసం నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో పలు చోట్ల ప్రజలు ఆందోళనకు దిగారు. సభల్లో అధికారులు ప్రకటించిన జాబితాలో పేర్లు లేవని నిరసన తెలిపారు. అర్హులు కానీ వారి పేర్లు జాబితాలో ఉన్నాయని నిలదీశారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు రాకుండా చేస్తున్నారని వాపోయారు. దీంతో పలు చోట్ల గ్రామ, వార్డు సభలు వాడివేడిగా సాగాయి.
గతంలో ప్రజాపాలనలో దరఖాస్తులు
సూర్యాపేట: నిరుపేదలు ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజాపాలన సభల సమయంలో భారీగా దరఖాస్తు లు ఇచ్చారు. ఒక్క సూర్యాపేట జిల్లాలో 5,135 దరఖాస్తులు రాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20వేల లోపు దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. గతంలో సూర్యాపేట జిల్లాకు 5,424 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరు కాగా, 3,086 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇవి చాలాకాలంగా వాడకంలో లేక కిటికీలు, అద్దాలు, విద్యుత్ వైరింగ్ ధ్వంసమైంది. గతంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో సైతం ఇందిరమ్మ కాలనీలు 1, 2, 3 ఏర్పాటు చేసి 80 గజాల చొప్పున స్థలాలు పంపిణీ చేశారు. లబ్ధిదారులు వారికున్న స్థోమ త ఆధారంగా ఇళ్లను నిర్మించుకున్నారు. కొంత మంది నేటికీ ఇళ్లను నిర్మించుకోలేకపోయారు. అయితే వారికి ప్రస్తుతం స్థలం ఉన్నందున ఆర్థిక సహాయం అందించాలని ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించింది. అందులో మునిసిపాలిటీలకు పెద్ద మొత్తంలో కేటాయించనున్నారు. తొలి విడతలో స్థలం ఉన్న వారికి రూ.5లక్షల నిధులు కేటాయిస్తారు. స్థలం లేనివారికి ప్రభుత్వం రెండో విడతలో స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు అందజేయనుంది. అయితే పైరవీలకు ఆస్కారం ఇస్తే లబ్ధిదారులు ఇబ్బందులు తప్పవు. గతంలో డబుల్‌బెడ్‌రూంలను ఇళ్లు ఉన్నవారికి సైతం మంజూరు చేశారు. ప్రస్తుతం నాలుగు రోజులపాటు నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో సైతం అనర్హుల పేర్లు జాబితాల్లో ఉన్నాయి. ఇది కేవలం జాబితా అని, తుది జాబితా కాదని, అనర్హులుంటే తీసివేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో కావాలనే ఇందిరమ్మ కమిటీల పేరుతో అధికార పార్టీకి చెందిన నాయకులకు, కార్యకర్తల పేర్లు చేర్చుతున్నారని పలువురు నిరసనలు తెలిపారు. సుమారు మండలానికి 200 ఇళ్లు కేటాయించే అవకాశం ఉంది. ప్రతీ గ్రామానికి 20 నుంచి 30 ఇళ్లు వచ్చే అవకాశం ఉంది.
తేలిన సాగుకు అనువైన భూముల లెక్క
రైతు భరోసా అమలు కోసం వ్యవసాయ, రెవెన్యూశాఖ అధికారులు ఇటీవల క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో 6.19లక్షల ఎకరాలకు రైతుబంధు పథకం అమలులో ఉంది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం సాగు యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ప్రకటించడంతో జిల్లాలో సాగుకు యోగ్యం కానీ భూములు 7,545 ఎకరాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ భూములకు ఇక నుంచి రైతు భరోసా రాదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగు యోగ్యంకాని భూముల లెక్కలను అధికారులు తేల్చారు.
నాలుగు గుట్టలు.. 244 ఎకరాలకు రైతు బంధు
(ఆంధ్రజ్యోతి, చౌటుప్పల్ టౌన్): యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలో నాలుగు గుట్టలకు చెందిన 244 ఎకరాలు సాగుకు యోగ్యం కాని భూములుగా అధికారులు గుర్తించారు. గత 11 విడతలుగా వీటి పట్టాదారులకు రైతు బంధు నిధులు జమయ్యాయి. కైరతాపురం గ్రామంలోని సర్వే నంబర్లు, 2, 3లో 38 ఎకరాలు, ధర్మాజీగూడెంలో సర్వే నంబరు 21లో 13 ఎకరాలు, తంగడపల్లిలోని సర్వే నంబరు 633లో 130 ఎకరాలు, సర్వే నంబరు 639లో 73ఎకరాలుగా గుట్టలు ఉనాయిఇ. మండలం మొత్తంగా 1,752 మంది రైతులకు చెందిన 1,589 ఎకరాలను సాగుకు యోగ్యంగా లేని భూములుగా అధికారులు సర్వేలో గుర్తించారు. అందులో అత్యధికంగా దండు మల్కాపురంలో 411 ఎకరాలు ఉన్నాయి. మండలంలో 18,929 మంది రైతులకు చెందిన 41,515 ఎకరాలకు రైతు బంధు గతంలో మంజూరైంది. అందులో సాగుకు యోగ్యం కాని భూములు 1,589 ఎకరాలు ఉండగా, ఇకపై 39,916 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా వర్తించనుంది.
అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు: తేజ్‌సనందలాల్ పవార్, సూర్యాపేట జిల్లా కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతీ ఒక్కరికి అందిస్తాం. ప్రజాపాలనలో దరఖాస్తులు చేసిన వారితో పాటు ప్రస్తుతం నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో చేసిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు పథకాలు వర్తింపజేస్తాం. సంక్షేమ పథకాల అమలులో ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావొద్దు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎక్కడా, ఎలాంటి పొరపాట్లకు తావులేదు.
జిల్లా రేషన్ ఇందిరమ్మ ఆత్మీయ రైతు మొత్తం
కార్డులు ఇళ్లు భరోసా భరోసా
నల్లగొండ 53,844 47,471 15,485 844 1,17,644
సూర్యాపేట 23,798 28,225 22,186 2,828 77,037
యాదాద్రి 28,049 32,316 11,551 2,698 74,614
మొత్తం 1,05,691 1,08,012 49,222 6,370 2,69,295