రేషన్ బియ్యం తరలింపు అడ్డగింత
ABN , Publish Date - Jan 08 , 2025 | 12:54 AM
చౌక ధరల దుకాణాలకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని హమాలీ కార్మికులు మంగళవారం అడ్డుకున్నారు. భువనగిరి మార్కె ట్ యార్డులోని ఎంఎల్‌ఎస్ గోదాం వద్ద మంగళవారం బీహార్‌కు చెందిన ప్రైవేటు హమాలీల ద్వారా రేషన్ షాపులకు తరలిస్తున్న లారీలను సమ్మె చేస్తున్న సివిల్ సప్లయి కార్మికులు అడ్డుకున్నారు.
పోలీసులు, సివిల్ సప్లయి కార్మికుల మధ్య వాగ్వాదం
భువనగిరి రూరల్, జనవరి7(ఆంధ్రజ్యోతి): చౌక ధరల దుకాణాలకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని హమాలీ కార్మికులు మంగళవారం అడ్డుకున్నారు. భువనగిరి మార్కె ట్ యార్డులోని ఎంఎల్‌ఎస్ గోదాం వద్ద మంగళవారం బీహార్‌కు చెందిన ప్రైవేటు హమాలీల ద్వారా రేషన్ షాపులకు తరలిస్తున్న లారీలను సమ్మె చేస్తున్న సివిల్ సప్లయి కార్మికులు అడ్డుకున్నారు. బియ్యాన్ని తరలించకుండా లారీలకు అడ్డంగా నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సివిల్ సప్లయి కార్మికులు అధికారుల మధ్య తీవ్ర ఉద్రిక్తం నెలకొన్నది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను బుజ్జగించినప్పటికీ ససేమిరా అన్నారు. గత ఏడు రోజులనుంచి ప్రజాస్వామ్యబద్దంగా నిరవధిక సమ్మె చేస్తున్నా పట్టించుకోకుండా, తమ సమ్మెను భగ్నం చేయడం సరికాదన్నారు. విషయం తెలుసుకున్న భువనగిరి పట్టణ ఎస్‌హెచ్‌వో సురేశ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. ఎట్టకేలకు సమస్య సద్దుమనిగింది. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి ఎండీ ఇమ్రాన్, గనబోయిన వెంకటేశ్, సామల శోభన్ బాబు, హమాలీ యూనియన్ నాయకులు శ్రీనివాస్, బస్వయ్య, జగన్ పాల్గొన్నారు.
సమ్మె విరమించిన హమాలీ కార్మికులు
పెంచిన కూలీరేట్ల జీవోను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లయి హమాలీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో రేషన్ షాపులకు బియ్యం తరలింపు ఆటంకంగా మారింది. మంగళవారం హైదరాబాద్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు, హమాలీ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఓమయ్య తదితరులతో కూడిన ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపారు. మంత్రి ఉత్తమ్ రెండు రోజుల్లో తమ సమస్యను పరిష్కరించే విధంగా చొరవ చూపుతానని హామీ ఇవ్వడంతో సివిల్ సప్లయి హమాలీ కార్మికులు తమ సమ్మెను విరమించినట్లు తెలిపారు.