Share News

రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థుల దుర్మరణం

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:33 AM

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) : రోడ్డుపక్కన నిలిపి ఉన్న డీసీఎంను ఢీకొని ఇద్దరు వైద్య విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగింది.

 రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థుల దుర్మరణం

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) : రోడ్డుపక్కన నిలిపి ఉన్న డీసీఎంను ఢీకొని ఇద్దరు వైద్య విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం .. నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన ఎన్‌ శశాంక్‌(19), నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన జ్ఞానేశ్వర్‌(19)కు మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో బీఎస్సీ ఏహెచ్‌ఎస్‌(అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌)లో సీట్లు రావడంతో జిల్లా కేంద్రంలోని షాషాబ్‌గుట్టలో అద్దెగది తీసుకున్నారు. మొదటి సంవత్సరం కావడంతో గురువారం అవగాహన తరగతులు జరగాల్సి ఉంది. శుక్రవారం నుంచి రెగ్యులర్‌గా తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. బుధవారం అర్ధరాత్రి తరువాత మందుల కోసం జ్ఞానేశ్వర్‌, శశాంక్‌ బైక్‌పై గది నుంచి బయటకు వచ్చారు. వాహనంపై వచ్చిన వారు ప్రధాన రహదారిపైకి వచ్చి బస్టాండ్‌వైపు వేగంగా మళ్లగానే ఎదురుగా మలబార్‌ గోల్డ్‌ షాపు ముందు ఆగి ఉన్న డీసీఎంను వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరి తలలు పగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది. చెవులు, ముక్కుల నుంచి రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. టుటౌన్‌ పెట్రోలింగ్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను జనరల్‌ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుల తండ్రులు గోపాల్‌రావు, కృష్ణయ్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ విజయభాస్కర్‌ కేసుదర్యాప్తు చేస్తున్నారు. పాలమూరులోని మర్లుకు చెందిన డ్రైవర్‌ వెంకటేశ్‌ డీసీఎంను నిర్లక్ష్యంగా అర్ధరాత్రి రోడ్డుపై పార్క్‌చేసి నిద్రపోయాడు. దీంతో డీసీఎం డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

Updated Date - Feb 07 , 2025 | 12:33 AM