Share News

10 రోజుల్లో వివాహం... కానిస్టేబుల్‌ బలవన్మరణం

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:34 AM

ఇటీవలే వివాహ నిశ్చితార్థమై.. 10 రోజుల్లో ముహూర్తం కాగా ఓ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకుంది.

10 రోజుల్లో వివాహం... కానిస్టేబుల్‌ బలవన్మరణం

ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారంటూ సహచరుల వద్ద ఆవేదన

భువనగిరి టౌన, ఫిబ్రవరి25 (ఆంధ్ర జ్యోతి): ఇటీవలే వివాహ నిశ్చితార్థమై.. 10 రోజుల్లో ముహూర్తం కాగా ఓ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో ఈ సంఘటన జరిగింది. పట్టణ ఎస్‌ఐ లక్ష్మీనారాయణ, కుటుంబసభ్యులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం వర్గల్‌ గ్రామానికి చెందిన 2020 బ్యాచ ఏఆర్‌కానిస్టేబుల్‌ మామిడి అనూష(30) భువనగిరిలోని జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో నాలుగేళ్లుగా విధులు నిర్వహిస్తోంది. స్థానిక విద్యానగర్‌లో మరో ఇద్దరు ఏఆర్‌కానిస్టేబుల్స్‌తో కలిసి అద్దె ఇంట్లో ఉం టోంది. ఆమె కుటుంబ సభ్యులు ఈ నెల 14వ తేదీన వివాహ నిశ్ఛితార్థం చేసి, మార్చి 6వ తేదీన పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. ఈ నెల 26 నుంచి ఆమె వివాహ సెలవులపై వెళ్లాల్సి ఉంది. మంగళవారం యథావిధిగా విధులకు వెళ్లిన ఆమె కొద్దిసేపటికే రోడ్డు ప్రమాదంలో తండ్రి గాయపడ్డాడని పేర్కొంటూ అనుమతి తీసుకుని తాను అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లింది. ఆ కొద్దిసేపటికే ఆమె తల్లిదండ్రులు అనూషకు ఫోన చేశారు. ఆమె నుంచి జవాబు రాకపోవడంతో డ్యూటీలో ఉండవచ్చునని భావించారు. పలుమార్లు ఫోన చేసినప్పటికీ సమాధానమివ్వకపోవడంతో అద్దె ఇంట్లో కలిసి ఉంటున్న మిగతా ఇద్దరికి ఫోన్లు చేయడంతో ప్రమాదంలో నాన్న గాయపడ్డాడని చెప్పి గదికి వెళ్లిందని సమాచారమిచ్చారు. తనకు ప్రమాదమేమీ జరగలేదని, ఉదయం నుంచే ఫోన సమాధానమివ్వడంలేదని కుటుంబసభ్యులు పేర్కొనడంతో సహచర సిబ్బ ంది ఆమె గదికి వచ్చి కిటికీ నుంచి చూడగా ఫ్యానకు విగత జీవిగా వేలాడుతూ కనిపించింది. దీంతో తలుపులను బలవంతంగా తెరిచి జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారంటూ అనూష సహచర ఉద్యోగుల వద్ద ఆవేదన వ్యక్తంచేసేదని తెలిసింది. అనూష తల్లి మామిడి పద్మ ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ లక్ష్మీనారాయణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 26 , 2025 | 12:34 AM