మినీభారత్‌గా మల్కాపురం
ABN , Publish Date - Jan 28 , 2025 | 12:00 AM
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో శివారులోని ఒకప్పటి పారిశ్రామిక ప్రాంతాలైన జీడిమెట్ల, బాలానగర్, చర్లపల్లి, నాచారం, ఉప్పల్‌లకు నగరం విస్తరించింది. ప్రజాజీవనం పెరిగి పరిశ్రమలు అక్కడ మనుగడ సాగించడం, కొత్తవి ఏర్పాటుచేయడం ఇబ్బందికరంగా మారింది.
పరిశ్రమల పల్లెగా నెలవు
దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్
ఒకే పల్లెలో వందలాది పరిశ్రమలు, పెద్దసంఖ్యలో ఉపాధి
100 ఎకరాల్లో టౌన్‌షి్‌ప ఏర్పాటుకు సన్నాహాలు
(ఆంధ్రజ్యోతి-చౌటుప్పల్) : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో శివారులోని ఒకప్పటి పారిశ్రామిక ప్రాంతాలైన జీడిమెట్ల, బాలానగర్, చర్లపల్లి, నాచారం, ఉప్పల్‌లకు నగరం విస్తరించింది. ప్రజాజీవనం పెరిగి పరిశ్రమలు అక్కడ మనుగడ సాగించడం, కొత్తవి ఏర్పాటుచేయడం ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు గత ప్రభుత్వం చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలో దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటుచేసింది. 550 ఎకరాల్లో 300 పరిశ్రమలు ఏర్పాటు లక్ష్యంగా నెలకొల్పిన ఈ పార్క్ దేశంలోనే అతిపెద్ద ఎంఎ్‌సఎంఇ హరిత పారిశ్రామిక పార్క్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇక్కడి పరిశ్రమల్లో పనిచేసేందుకు వచ్చిన వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులతో దండుమల్కాపురం ప్రాంతం మినీభారత్‌ను తలపిస్తుంటుంది.
చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం గ్రామం పరిశ్రమలకు నెలవుగా మారింది. ఒకనాడు కొండలు, గుట్టలు, రాళ్లురప్పలతో నిరుపయోగంగా ఉన్న ఇక్కడి భూముల్లో నేడు వివి ధ రకాల పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. రాష్ట్రంలో లక్షలాది చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉండగా అందులో సగానికి తక్కువ శాతం పరిశ్రమలకు సొం త స్థలాలు ఉన్నాయి. అద్దె స్థలాల్లో పరిశ్రమలు కొనసాగలేక చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ అంశంలో తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య ప్రత్యేక చొరవ చూపింది. అప్పటి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి దండుమల్కాపురంలో ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయించింది.
పరిశ్రమల ఏర్పాటు..
దండు మల్కాపురం గ్రామంలో మొత్తం 11,527 ఎకరాల భూమి ఉంది. దానికి తోడు ప్రభుత్వ, అసైన్డ్ భూములు కూడా ఎక్కువగా ఈ ప్రాంతంలోనే ఉన్నా యి. దీంతో ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంది. దేశంలోనే తొలిసారి గా నిర్మించిన ఈ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఇండస్ట్రియల్ పార్క్‌ను 2019 నవంబరు 1న నాటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అయి తే పూర్తిస్థాయిలో కాలుష్య రహిత పరిశ్రమలకే ఈ పార్క్‌లో కేటాయింపులు చేస్తున్నారు. 550 ఎకరాలు కేటాయించిన ఈ పారిశ్రామిక పార్క్‌లో దశలవారీగా 300 పరిశ్రమలు నెలకొల్పనున్నారు. ఇప్పటికే 175 పైగా పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించా యి. 100కు పైగా పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నా యి. రెండు శాతం పరిశ్రమలు ఇంకా నిర్మాణాలను మొదలుపెట్టలేదు. పనులు మొదలుపెట్టని పరిశ్రమ యజమానులకు నోటీసులు కూడా పంపించారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటుచేయడానికి చాలామంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు పెద్దఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు మరింత స్థలం కావాలని పారిశ్రామికవేత్తల సమాఖ్య ప్రభుత్వానికి విన్నవించింది. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే మరికొంతమంది పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల ఏర్పాటుకు స్థలం మంజూరు చేసే అవకాశం ఉంది. పరిశ్రమలు ప్రారంభించిన, నిర్మాణంలో ఉన్న వాటిలో ఇప్పటికే పెద్దసంఖ్యలో కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఈపారిశ్రామిక పార్క్‌లో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు లభించడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నారు.
వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటు
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో అన్నిరకాల పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్, ప్యాకింగ్ ప్రింటింగ్, టైల్స్, ఫార్ములేషన్, ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్, రైస్ హబ్, బొమ్మల పార్క్‌లువంటి కాలు ష్య రహిత పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా జాతీయరహదారికి ఆనుకుని రూ.2,800 కోట్ల వ్యయంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ టెర్మినల్ నిర్మిస్తోంది. అంతేకాకుండా రూ.1500 కోట్ల వ్యయంతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మాణ పనులను ప్రారంభించింది. ఈ ప్రాంతం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో ఉండడంతో మరిన్ని పరిశ్రమలు కూడా ఇక్కడ ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి.
కార్మికులకు నిలయం
దండు మల్కాపురం గ్రామంలో గతంలోనే వివిధ రకాల రసాయన ఇతర పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. తాజాగా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో వందలాది పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఈ పరిశ్రమల్లో పనిచేసేందుకు దేశంలోని ఒడిషా, చత్తీ్‌సఘడ్, ఝార్ఘండ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్రపదేశ్, బిహార్ తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు వస్తున్నారు. ఒక్కో పరిశ్రమలో పదుల నుంచి వందల సంఖ్యలో కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం పరిశ్రమలకు వెళ్లే సమయం, సాయంత్రం పరిశ్రమల నుంచి తిరిగి వచ్చే వేళలో ఈ ప్రాంతమంతా కార్మికులతో సందడిగా మారుతుంటుంది. రూ.20 వేల నుంచి రూ.40వేల వేతనంతో పనిచేసే కార్మికులు అదే ప్రాంతంలో నివసిస్తుండగా, ఆ పైన వేతనంతో పనిచేసే కార్మికులు హైదరాబాద్‌ని శివారు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఇక్కడ నివాస ఉండడంతో ఈ ప్రాంతమంతా మినీ ఇండియాగా కనిపిస్తుంటుంది.
అందరి చూపు మల్కాపురం వైపు
దండు మల్కాపురం గ్రామం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఉండడంతో అందరి చూపు ఇటువైపే పడింది. ఈ ప్రాంతంలో అన్నివర్గాల ప్రజలు విస్తరించి ఉండడంతో నివాస ప్రాంతాలకు కూడా భారీగా డిమాండ్ ఉంది. ఇక్కడ అద్దె ఇల్లు కూడా దొరకడం కష్టం. ఇక్కడి ప్రజల అవసరాలకు తగ్గట్టు కిరాణం దుకాణాలు, హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. అంతేకాకుండా వాణిజ్యపరమైన దుకాణ సముదాయాలు సైతం ఏర్పాటవుతున్నాయి. దీంతో వ్యాపారస్తులు సైతం ఈ ప్రాంతాల్లో తమ దుకాణ సముదాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తోడు ఈ ప్రాంతం పరిశ్రమలకు కేరాఫ్ అడ్ర్‌సగా మారడం హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో పెట్టుబడిదారులు సైతం ముందు చూపుగా ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెడుతూ ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు.
కార్మికులకు నివాస సముదాయాలు
ఇండస్ట్రియల్ పార్క్‌లో పనిచేస్తున్న వివిధ రకాల కార్మికులు నివాసం ఉండేందుకు 100 ఎకరాల్లో టౌన్ షిప్‌ను నిర్మించడానికి తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య ప్రత్యేక చొరవ చూపుతోంది. పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు పరిశ్రమల పక్కనే నివాస సముదాయం కల్పిస్తే ఉపయోగంగా ఉంటుందని భావిస్తోంది. ఇందుకోసం సమాఖ్య ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. భూమి కేటాయింపునకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రా లేదు. పరిశ్రమలకు పనికిరాని భూములు కేటాయించిన దానిని అభివృద్ధి చేసి టౌన్‌షి్‌పగా మారుస్తామని నిర్వాహకులు పేర్కొంటున్నారు. సమా ఖ్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి టౌన్‌షి్‌ప ఏర్పాటు ప్రతిపాదనను సీఎంకు విన్నవించేందుకు వారు సన్నద్ధమవుతున్నారు.
100 ఎకరాల్లో టౌన్‌షి్‌ప ఏర్పాటుకు ప్రతిపాదనలు : ఎం. గోపాల్‌రావు, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య ప్రధాన కార్యదర్శి
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లో పనిచేస్తున్న కార్మికుల కోసం టౌన్ షిప్ ఏర్పాటుకు 100 ఎకరాల భూమిని కేటాయించాలని నివేదిక అందజేశాం. పార్క్‌లో 300 పరిశ్రమలు ఏర్పాటులక్ష్యంగా నిర్ణయించాం. ఇప్పటికే 175 పరిశ్రమలు ఉత్పత్తులను ప్రారంభించాయి. 100కు పైగా పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పటికీ పనులు మొదలుపెట్టని ఒకటీ రెండు శాతం పరిశ్రమలకు నోటీసులు అందజేశాం. సులువుగా వాహనాలు రాకపోకలు సాగించేందుకు పరిశ్రమల ప్రధాన రహదారి వద్ద జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి విన్నవించాం. వచ్చే ఏడాది నాటికి ఇండస్ట్రియల్ పార్క్‌లో పూర్తిస్థాయిలో పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించే విధంగా పనిచేస్తున్నాం.
పరిశ్రమల ఏర్పాటుకు మంచి ప్రదేశం : మేరెడ్డి ప్రదీ్‌పరెడ్డి, పరిశ్రమ యజమాని.
పరిశ్రమల ఏర్పాటుకు దండుమల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ మంచి ప్రదేశం. ఇక్కడ అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పించారు. పరిశ్రమ ఏర్పాటు చేయదలిస్తే అనుమతులు కూడా త్వరగా వస్తున్నాయి. మేము కోర్ క్రస్టిక్ పరిశ్రమను ఏర్పాటుచేశాం. సుమారు రెండేళ్ల నుం చి ఉత్పత్తులు కూడా ప్రారంభించాం. వ్యాపారం జరుగుతోంది. ఎలాంటి కాలుష్యం లేని పరిశ్రమలు ఇందులో ఏర్పాటవుతున్నాయి. ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు చాలామంది ముందుకు వస్తున్నారు.