వైభవంగా అగ్నిగుండాలు
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:39 AM
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిగుండాల మహోత్సవం వైభ వంగా జరిగింది.
చెర్వుగట్టు క్షేత్రానికి పోటెత్తిన శివసత్తులు
నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిగుండాల మహోత్సవం వైభ వంగా జరిగింది. అగ్నిగుండంపై నడిచేందుకు భక్తజనం పెద్దసంఖ్యలో తరలివచ్చింది. పెద్దసంఖ్యలో శివసత్తులు తరలివచ్చి భక్తి విశ్వాసాలను చాటారు. ఆ నిప్పు కణికలపై నడిచేందుకు శివసత్తులు పోటీపడ్డారు. శంఖనాథాలు, ఢమరుక చప్పుళ్లు మోగుతుండగా అగ్నిగుండాల మహోత్సవం ఆద్యంతం భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. తొలుత కల్యాణ మంటప సమీపంలో ఏర్పాటుచేసిన అగ్నిగుండం వేదిక వద్దకు ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, భక్తుల శివనామస్మరణల మధ్య పర్వత వాహన సేవతో తీసుకునివచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం సూర్యోదయానికి ముందే అర్చకులు ద్రవ్యాలను పోగేసి అగ్నిమదనం చేశారు. అనాదిగా వస్తున్న ఆచారం మేరకు తొలుత వీరముష్ఠి వంశస్తులు ప్రభతో పాటుగా ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, సహార్చకులు శ్రీకాంతశర్మ, సతీశశర్మ, సురేశశర్మ తదితరఅర్చకులు అగ్నిగుండంపై నడిచారు. ఉదయం ఐదు గంటలకు మొదలైన కార్యక్రమం తొమ్మిది గంటల వరకు కొనసాగింది. కార్యక్రమంలో ఆర్డీవో యానాల అశోక్‌రెడ్డి, దేవాదాయ శాఖ ఉత్సవ అధికారి బీ కృష్ణ, ఈవో సిరికొండ నవీనకుమార్, ఆర్‌ఐ తరుణ్, కాంగ్రెస్ నాయకులు రేగట్టె నర్సిరెడ్డి, గడుసు శశిధర్‌రెడ్డి, వారాల రమేశ, నవీనరెడ్డి, మల్గ శంకర్, శ్రీకాంత, ఆలయ సిబ్బంది శ్రీనివా్‌సరెడ్డి, వెంకటయ్య, నర్సిరెడ్డి పాల్గొన్నారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, ఎస్‌ఐ క్రాంతికుమార్‌ల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లుచేశారు.
ఛాంబర్ల వారీగా
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ పర్యాయం పోలీసులు బారికేడ్ల వ్యవస్థను పటిష్టం చేశారు. కల్యాణ మండప విస్తరణలో నూతనంగా నిర్మించిన హాల్‌ను 15 ఛాంబర్లుగా బారికేడ్లతో ఏర్పాటుచేశారు. ఒక్కో ఛాంబర్‌లో భక్తులు ఖాళీ అయిన తర్వాత ఇంకో ఛాంబర్‌ను వదులుతూ తోపులాటకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో భక్తులు సులభంగా అగ్నిగుండ ప్రవేశం చేసేందుకు వీలైంది.
అగ్నిగుండాల కట్నాలు రూ.1,03,350లు
అగ్నిగుండాల సందర్భంగా భక్తుల నుంచి కానుకలుగా రూ.1,03,350 సమకూరినట్లు ఈవో నవీనకుమార్ తెలిపారు. గతేడాది రూ.60,580 లు మాత్రమే రాగా ఈ ఏడాది రూ.40,000లు ఎక్కువగా లభించాయి.