నేటి నుంచి కుష్ఠువ్యాధి అవగాహన పక్షోత్సవాలు
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:18 AM
మహాత్మాగాంధీ సేవలకు గుర్తింపుగా ప్రతీ ఏడాది నిర్వహించే కుష్ఠు వ్యాధి అవగాహన పక్షోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.

ఫిబ్రవరి 13 వరకు నిర్వహణ
యాదాద్రిభువనగిరి జిల్లాలో 45 లెప్రసీ కేసులు
నేడు ప్రపంచ కుష్ఠువ్యాధి నివారణ దినోత్సవం
(ఆంధ్రజ్యోతి-భువనగిరి టౌన)
మహాత్మాగాంధీ సేవలకు గుర్తింపుగా ప్రతీ ఏడాది నిర్వహించే కుష్ఠు వ్యాధి అవగాహన పక్షోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. జనవరి 30న గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 13 వరకు 15 రోజుల పాటు వైద్య, ఆరోగ్య శాఖ పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. నిర్ధేశిత రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఇతర సామూహిక కార్యక్రమాలన్నింటిలో వైద్యసిబ్బంది కుష్ఠు వ్యాధిపై అవగాహన కల్పిస్తారు. స్థానికంగా ర్యాలీలు నిర్వహించి వ్యాధి లక్షణాలు, చికిత్స తదితర అం శాలు వివరిస్తారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్ధారణ పరీక్ష నిర్వహించి అవసరమైన వారికి మందులు, చికిత్సలు అందిస్తారు.
చికిత్సలు ఇలా..
అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆపై స్థాయి ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో కుష్ఠి వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఔషధాలు, చికిత్సలు అందిస్తారు. బహుళ ఔషధ చికిత్స(ఎండీటీ) విధానంలో ఆరు నెలల నుంచి 12 నెలలలోపు వ్యాధి పూర్తిగా నయమవుతుంది. అయితే గుర్తింపు, చికిత్సల్లో నిర్లక్ష్యం చూపితే నరాలపై ప్రభావం చూపి శాశ్వత అంగవైకల్యం ఏర్పడే అవకాశం ఉంది. ఒకటి నుంచి ఐదు మచ్చలు ఉన్నవారికి ప్యాచి బ్యాచిలరీ(పీబీ) కేటగిరీలో ఆరు నెలలు, ఐదు మచ్చలు పైబడి ఉన్న వారికి మల్టీ బ్యాచిలరీ(ఎంబీ) కేటగిరీలో 12 నెలల పాటు చికిత్స అందిస్తారు. చికిత్సలు కొనసాగినంత కాలం అందరితో కలిసి జీవించవచ్చు. కానీ తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు దూరంగా ఉండటంతో పాటు తుంపర్లు గాలిలో వ్యాపించకుండా మాస్క్ లేదా శుభ్రమైన వస్త్రాన్ని మూతికి, ముక్కుకు అడ్డంగా పెట్టుకోవాలి.
యాదాద్రి జిల్లాలో 45 కేసులు
యాదాద్రిభువనగిరి జిల్లాలో 45 మంది కుష్ఠు వ్యాధిగ్రస్తులుఉన్నారు. వారికి పీబీ, ఎంబీ విధానంలో చికిత్సలు సాగుతున్నాయి. నిర్లక్ష్యంతో ఐదారుగురు దివ్యాంగులుగా మారారు. గత ఐదేళ్లుగా జిల్లాలో ప్రతి ఏడాది 45 నుంచి 50 మంది కుష్ఠు వ్యాధి బారిన పడుతూ చికిత్సలతో వ్యాధి నుంచి విముక్తులవుతున్నారు.
వంశపారంపర్యం, అంటువ్యాధి కాదు
కుష్ఠు వ్యాధి వంశపారంపర్యం, అంటువ్యాధి కాదు. సకాలంలో గుర్తించి చికిత్సలు పొందితే ఏడాదిలోపు పూర్తిగా కోలుకోవచ్చు. తదనంతరం కొద్దికాలం జాగ్రత్తలు పాటించాలి. నిర్లక్ష్యం చూపితే శరీరంపై తీవ్రప్రభావం చూపుతుంది. వ్యాధి లక్షణాలు ఉన్నవారు అనుమానాల నివృత్తికి స్థానికంగా ఉండే వైద్యసిబ్బందిని లేదా పీహెచసీని సంప్రదించాలి. పక్షోత్సవాలలో వైద్యసిబ్బంది కుష్ఠువ్యాధిపై ప్రజలను చైతన్యపరుస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తిచేశాం.
డాక్టర్ మనోహర్, యాదాద్రి జిల్లా వైద్య శాఖ అధికారి.