లక్షలు పోయాయ్.. అప్పులు మిగిలాయ్
ABN , Publish Date - Feb 27 , 2025 | 12:33 AM
స్థానిక ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికవ్వాలనుకునే పలువురు ఆశావహులు అప్పుల పాలయ్యారు.
రిజర్వేషన్లు తేలకముందే గ్రామాల్లో ఆశావహుల ప్రయత్నాలు
ఓటర్లను ఆకర్షించేందుకు విచ్చలవిడిగా ఖర్చు
అప్పులు చేసి ఖర్చు చేసిన వైనం?
స్థానిక ఎన్నికల ఆలస్యంతో మనోవేదన
స్థానిక ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికవ్వాలనుకునే పలువురు ఆశావహులు అప్పుల పాలయ్యారు. ఎన్నో ఆశలతో ఉన్న వారికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కొంత సమయం పడుతుందని తెలియడంతో తమ ఆవేదనను సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల కిందట పండుగలు, పబ్బాలు, అశుభ కార్యాలకు అప్పులు చేసి సహాయాలు చేశారు. తీరా ఎన్నికలకు సమయం పడుతుందని తెలియడంతో అప్పులే మిగిలాయన్న నిరాశలో ఉన్నారు.
(ఆంధ్రజ్యోతి-యాదగిరిగుట్ట రూరల్)
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 428 సర్పంచ్‌లు, 178 ఎంపీటీలు 17 జడ్పీటీసీ సభ్యుల స్థానాలు ఉన్నాయి. రెండు నెలల నుంచి ఆశావహులు ఎన్నికల సన్నాహల్లో భాగంగా ఆయా గ్రామాల్లో ప్రజలను మచ్చిక చేసుకొని ఓట్లను రాబట్టుకోవడానికి కసరత్తు చేశారు. ప్రధానంగా కొంతమంది ఆయా కులసంఘాలకు చెందిన గ్రామదేవతల ఆలయాల నిర్మాణాలకు, వివాహాలు, దినకర్మలు, విహారయాత్రలు, యువతకు జిమ్, క్రికెట్ కిట్లు, పండుగలకు, పబ్బాలకు విచ్చలవిడిగా మద్యం, విందులు, వినోదాలకు లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఇలా ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ఇప్పటికే ఆశావహులు లక్షల రూపాయలు అప్పులు చేసి తమ పంతం నెగ్గించుకోవాలనే సంకల్పంతో వ్యూహరచనలో మునిగిపోయారు. ఎలాగైనా లక్షలు ఖర్చు చేసి అయినా ప్రజాప్రతినిధులుగా ఎన్నికవ్వా లనే లక్ష్యంతో కొన్నినెలలుగా ఖర్చు చేశారు. అయితే ప్రభుత్వం ఎన్నికలపై స్పష్టత లేకపోవడంతో తీవ్రఆందోళన చెందుతున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందన్న ప్రచారంతో ఓటర్లు చెదిరిపోకుండా వారిని ప్రసన్నం చేసుకోవాలనే ఆలోచనలో ముందుగానే ఖర్చు చేశారు.
ఆందోళన కలిగిస్తున్న రిజర్వేషన్ల అంశం
మరోవైపు ఆయా గ్రామాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న ఆశావహులకు రిజర్వేషన్ల సమస్య పెద్ద తలనొప్పిగా మారే పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ రిజర్వేషన్లు మారితే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయోనని అప్పటి వరకు ఓటర్లకు ఏం చెప్పాలో, డబ్బులు లక్షల కొద్దీ ఖర్చు చేయాల్సి వస్తే తమ పరిస్థితి ఏంటని అయోమయానికి గురవుతున్నారు. చివరకి రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయా? లేదా అనే సంశయంలో పడ్డారు. దీంతో గ్రామాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొందని పలువురు తెలిపారు. మరికొంతమంది అఽధికార పార్టీని నమ్ముకొన్న ఆశావహులు ప్రభుత్వం పథకాలపై భరోసా ఉన్నారు. చివరికి ఆశావహుల కోరికలు నెరవేరుతాయా? లేదా? అనే ఉత్కంఠ పరిస్థితి నెలకొంది.