Share News

కిడ్నాప్‌ కథ సుఖాంతం,,

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:28 AM

నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రి ఆవరణలో మూడు రోజుల క్రితం కిడ్నాప్‌ గురైన మూడేళ్ల బాలుడి కథ సుఖాంతమైంది.

కిడ్నాప్‌ కథ సుఖాంతం,,

నల్లగొండ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రి ఆవరణలో మూడు రోజుల క్రితం కిడ్నాప్‌ గురైన మూడేళ్ల బాలుడి కథ సుఖాంతమైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ పట్టణంలోని లయనవాడకు మహ్మద్‌ హైమద్‌, షమీమ్‌ మున్నీసా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు కొన్నాళ్లుగా ఆస్పత్రి ప్రాంగణంలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఐదేళ్ల బాలికతో పాటు మూడేళ్ల అబ్దుల్‌ రెహమాన ఉన్నారు. ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమీపంలో బాలుడు ఆస్పత్రి ఆవరణలో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్లాడు. విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన తల్లి ఆస్పత్రి ప్రాంగణం అంతా వెతికింది. అయినా ఆచూకీ లభించకపోవడంతో టూటౌన పోలీసులకు అదే రోజు రాత్రి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆసుపత్రి ప్రాంగణం, బస్టాండ్‌ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించడంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్లిన దృశ్యాలను గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి టూటౌన ఎస్‌ఐ నాగరాజు దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ శరతచంద్ర పవార్‌ ఆదేశాల మేరకు ఆరు బృందాలు గాలించి బాలుడిని ఎట్టకేలకు గుర్తించినట్లు సమాచారం. టెక్నికల్‌ టీంతో పాటు స్థానికుల సమాచారం మేరకు కేసు ఛేదించి కిడ్నాపర్‌ను పట్టుకున్నారు. బాలుడిని తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ సాగిస్తున్నారు. నకిరేకల్‌ చెందిన వ్యక్తికి బాలుడిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా నల్లగొండ పట్టణంలోని గొల్లగూడ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Updated Date - Mar 07 , 2025 | 07:09 AM