సంరక్షకుడే భక్షకుడు?
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:25 AM
కంచె చేను మేసిందన్న సామెతలా అడవిని రక్షించాల్సి వ్యక్తే డబ్బుల కోసం అటవీ భూములకు నకిలీ పట్టాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

నకిలీ పాస్‌పుస్తకాల దందాలో విలేజ్ ఫారెస్ట్ కమిటీ వ్యక్తి
అటవీ భూమి పేరిట రూ.లక్షల్లో వసూళ్లు
పోలీసుల విచారణ ముమ్మరం
పుస్తకాలు ముద్రణ, డిజిటల్ సంతకాల ఫోర్జరీలపై ఆరా
కంచె చేను మేసిందన్న సామెతలా అడవిని రక్షించాల్సి వ్యక్తే డబ్బుల కోసం అటవీ భూములకు నకిలీ పట్టాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సీఎం రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఏర్పాటుచేసిన విలేజ్ ఫారెస్ట్ కమిటీలు(వనసంరక్షణ సమితి)లో ఈయన కీలకంగా పనిచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి భూముల సర్వే నెంబర్లు తెలిసినవాడు కావడంతో ఆ భూములన్నీ తమవేనని నమ్మించి నాలుగేళ్లుగా అనేకమంది వద్ద లక్షల్లో డబ్బులు దండుకున్నట్లు అనుమానిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి-మిర్యాలగూడ)
నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలంలోని ఓ మారుమూల తండాకు చెందిన ఓ వ్యక్తి అక్కడే ఉంటూ చిన్నచిన్న పైరవీలు చేస్తూ అనేకమంది వద్ద ఆర్థిక అక్రమాలకు పాల్పడి మిర్యాలగూడ పరిసర ప్రాంతాలకు మకాం మార్చినట్లు సమాచారం. అతడు మిర్యాలగూడలో ఓ మెడికల్ దుకాణ నిర్వాహకుడికి 20 ఎకరాలకు పట్టా చేయిస్తానని 2022 నుంచి నగదు రూపేణా, ఫోన పే ద్వారా రూ.4 లక్షల వరకు తీసుకున్నాడు. 2022 మే నుంచి చెల్లింపులు జరిగినట్లు ఆధారాలు పోలీసుకు చిక్కాయి. తిరుమలగిరి(సాగర్) మండలం నేతాపూర్ గ్రామానికి సంబంధించిన 62/ఇ4 సర్వేనెం.లో 16.2ఎకరాల భూమికి పాస్‌బుక్ 25.04.2018న, 62/అ/3 సర్వే నెంబరులో 5.32 ఎకరాలకు 21.05.2018న పాస్‌బుక్‌ను మంజూరు చేసినట్లు, అనువంశికంగా ఆ భూమిని పొందినట్లు చూపించిన పట్టా పాస్‌బక్‌లు కూడా నకిలీవని తేలాయి. బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.