చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ABN , Publish Date - Feb 04 , 2025 | 11:27 PM
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి.
గణపతి పూజతో ప్రారంభమైన ఉత్సవాలు
నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇందిర దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై గణపతి పూజలో కూర్చుని అఖండ దీపాన్ని వెలిగించి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. యాజ్ఞీకుడు అల్లవరపు సుబ్రహ్మణ్యదీక్షితులు, శిష్యబృందం వేడుకల ప్రారంభోత్సవ వేదమంత్రోఛ్చారణలు చేస్తుండగా స్వామి వారి బ్రహ్మోత్సవ ప్రాశస్త్యాన్ని ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ భక్తులకు వివరించారు. ఉత్సవాలను నిర్విఘ్నంగా పూర్తిచేసేందకు ఉత్సవ నిర్వాహ కులను యాజ్ఞీకులు కంకణధారులను చేశారు. సూర్య జయంతి రోజున ప్రారంభమయ్యే స్వామి వారి ఉత్సవాలు అత్యంత ప్రత్యేకత, ప్రాశస్త్యం ఉన్నవిగా శాస్ర్తాలు చెబుతున్నాయని వివరించారు. మహామంటపంలో ఏర్పాటుచేసిన పూజా వేదికలో గణపతి పూజ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పుణ్యహవచనం, పంచగవ్య ప్రాసన, ప్రోక్షణ, దీక్షాధారణ, అఖండ దీపస్థాపనతో ఉత్సవ పూజలను ప్రారంభించారు. సాయం త్రం కలశారాధన, మత్స్యంగ్రహణంతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. స్వామి వారి ఉత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ అర్చక స్వాములు ధ్వజారోహణం చేశారు. కార్యక్రమంలో ఎండోమెంట్ ఉత్సవ అధికారి కృష్ణ, ఈవో సిరికొండ నవీనకుమార్, ఏసీ భాస్కర్, ఆర్‌ఐ తరుణ్, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌నేతలు పాల్గొన్నారు.