గాంధేయ మార్గంలో...
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:17 AM
వ్యక్తికే పరిమితమైన అహింస సిద్ధాంతాన్ని సాంఘిక, రాజకీయ రంగాల్లో సమష్ఠి ప్రయోజనం కోసం ప్రప్రథమంగా ప్రయోగించిన వ్యక్తి గాంధీ. ఆయన తత్వాన్ని, సిద్ధాంతాలను ప్రస్తుత కాలానికి అన్వయింపచేసి, శాంతి స్థాపనకు కృషి చేస్తున్నాయి గాంధీజీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన సంస్థలు.

సేవా కార్యక్రమాల్లో గాంధీజీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన సంస్థలు
(ఆంధ్రజ్యోతి-నల్లగొండ)
వ్యక్తికే పరిమితమైన అహింస సిద్ధాంతాన్ని సాంఘిక, రాజకీయ రంగాల్లో సమష్ఠి ప్రయోజనం కోసం ప్రప్రథమంగా ప్రయోగించిన వ్యక్తి గాంధీ. ఆయన తత్వాన్ని, సిద్ధాంతాలను ప్రస్తుత కాలానికి అన్వయింపచేసి, శాంతి స్థాపనకు కృషి చేస్తున్నాయి గాంధీజీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన సంస్థలు. 1975 ఆగస్టు 23న గాంధీజీ జ్ఞానప్రతిష్టాన, అదేవిధంగా 2001 గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థలను స్థాపించారు. ఈ రెండు సంస్థలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్దఎత్తున కార్యక్రమాలను చేపడుతున్నాయి. గాంధీ ఆలోచనలను, మార్గాన్ని మరింత సుస్థిరం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. నేడు గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయా సంస్థల ప్రయత్నాలను తెలుసుకుందాం.
గాంధీ సిద్ధాంతాల ప్రచారంలో భాగంగా వివిధ రకాల కార్యక్రమాలకు గాంధీజీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన సంస్థలులు శ్రీకారం చుట్టాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున కళాశాల మైదానంలో 2018 అక్టోబరు 2న 5,500 మంది విద్యార్థులతో బాలగాంధీల వేషధారణతో ప్రదర్శన నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించారు. కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధుడు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ఎనసీసీ స్కౌట్‌లకు సంబంధించి 30వేల మంది వరకు పాల్గొన్నారు. బాలికల జూనియర్ కళాశాలకు సంబంధించిన 1000 మందికి పైగా విద్యార్థులు యోగా విన్యాసాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు గిన్నిస్ బుక్ రికార్డ్ ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని వరల్డ్ రికార్డులో నమోదుచేశారు.
నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో గాంధీ నడక, నడవడిక కార్యక్రమాలను చేపట్టారు. వందలాది మంది విద్యార్థులను గాంధీ వేషధారణలతో ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేలా కార్యక్రమాలను తీసుకున్నారు.
సృజనాత్మకతను వెలికితీస్తూ
సాంస్కృతిక వారసతాన్ని కాపాడేందుకు గాంధీ సంస్థలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. పాటలు, నృతాలు, కోలాటం, సాంస్కృతిక రంగాలతో పాటు చిత్రలేఖనం పోటీలు నిర్వహించి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులను ప్రదానం చేస్తున్నాయి. గాంధీజీ విశ్వకవి సమ్మేళనం, జల కవితోత్సవంతో పాటు కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నతస్థాయి విద్యార్థులందరికీ పరీక్షలపై భయం పోగొట్టేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి.
కరోనా సమయంలో సేవా కార్యక్రమాలు
కరోనా మహమ్మారి సమయంలో గాంధీ సంస్థలు నిత్యావసరాలతో పాటు ఔషధాలను, మంచినీటి సౌకర్యాన్ని కల్పించడంతో పాటు సంస్థ ప్రతినిధులు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కరోనాపై అవగాహన కల్పిస్తూనే బాధితులకు భరోసానిచ్చి మద్దతుగా నిలిచాయి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే యోగాను సాధన చేయడం కోసం గాంధీజీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రతినిధులు వారికి వివరిస్తూ కరోనా సమయంలో ముందుడుగు వేశారు.
ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సాహం...
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గాంధీ సంస్థలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు చేపట్టాయి. సేంద్రీయ సాగును ప్రోత్సహించడానికి పుడమి పుత్ర, కిసాన సేవారత్నా అవార్డులను అందిస్తున్నాయి. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల కోసం గాంధీజీ సంస్థలు కార్యక్రమాలను చేపట్టాయి. నల్లగొండలో రైతులకు, విద్యార్థులకు సోలార్‌పై అవగాహన కల్పించడంతో పాటు ప్రకృతి వైద్యంపై శిబిరం నిర్వహించారు. 2017లో చండూరులోని పలు విద్యాసంస్థల్లో గాంధీ సిద్ధాంతాలపై అవగాహన కల్పించారు.
గాంధీ సంస్థల లక్ష్యాలు
ప్రజలు శాంతియుత జీవనం సాగించేలా గాంధీజీ బోధనలు ప్రచారం.
ప్రజల్లో అహింస సిద్ధాంతం, విధానాలపై ఆదరణ పెరగడానికి కృషి.
గాంధీజీ రచనలను, ఆయనపై ప్రముఖ రచయితలు రాసిన వ్యాసాలను, రచనల ను సేకరించి భద్రపర్చడం, ప్రచురిస్తారు.
గాంధేయ జీవనంపై సాధారణ ప్రజల్లో మక్కువను కలిగించేందుకు గ్రంథాలయాలు, పట్టణాలయాలు, అధ్యయన కేంద్రాలను నెలకొల్పారు.
అధ్యయన కోర్సులు, సభలు, సమావేశాలు, సదస్సులను నిర్వహించడం, ఫెలోషి్‌పలు, స్కాలర్‌షి్‌పలు, బహుమతులను అందిజేస్తున్నారు.
సాంఘిక దురాచారాలపై విద్యార్థుల్లో చైతన్య స్థాయిలు పెంచడం, అహింసా, సత్యం, కరుణలను ప్రోత్సహించడం.
న్యాయమైన విద్యావ్యవస్థను అందుబాటులోకి తేవడం, వైద్య, సౌకర్యాలు కల్పించడం.
ప్రకృతి వైద్యం, వైజ్ఞానిక మార్గం, చేనేత బాట, సాహిత్య, మద్యపాన నిషేధంపై అవగాహన కార్యక్రమం, చర్క మహోత్సవం, సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, గోశాల నిర్వహణతో పాటు మహిళా సాధికారిత, ఓటు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సుస్థిరాభివృద్ధి అందించడమే లక్ష్యం
సుస్థిరాభివృద్ధిని సాధించడం, లక్ష్యాలను అధిగమించడం కోసం తమ సంస్థలు పెద్దఎత్తున కార్యక్రమాలను చేపడుతున్నాయి. స్వాతంత్య్రం తరువాత దేశం ఏవిధంగా ఉండాలో గాంధీజీ సూచించిన అంశాలనే ఐక్యరాజ్యసమితి 17 సుస్థిరాభిృద్ధి లక్ష్యాలుగా ఎంపికచేసింది. 2030 నాటికి ఆ లక్ష్యాలు అందేలా తమ సంస్థలు అనేక కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. ప్రజలను చైతన్యం చేయడానికి గాంధీ సంస్థల ప్రతినిధులు కృషి చేస్తున్నారు.
- యానాల ప్రభాకర్‌రెడ్డి, గాంధీజీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన ఉమ్మడి తెలుగు రాషా్ట్రల ప్రధాన కార్యదర్శి