భార్యను చంపి.. భర్త ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:35 AM
భార్యను హతమార్చి భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం పెద్దగుమ్మడం గ్రామంలో జరిగింది.

పెద్దఅడిశర్లపల్లి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : భార్యను హతమార్చి భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం పెద్దగుమ్మడం గ్రామంలో జరిగింది. సీఐ నవీనకుమార్, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దగుమ్మడం గ్రామానికి చెందిన కోట్ర పెద్దయ్య, లక్ష్మమ్మ(40) భార్యాభర్తలు కాగా వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్థలతో గొడవ పడుతున్నారు. సోమవారం రాత్రి భోజనం ముగించుకున్న తర్వాత కూడా గొడవపడ్డారు. తెల్లవారుజామున మూడు గంటలకు పెద్దయ్య ఇంటి ముందర వాంతులు చేసుకుంటూ ఉండడంతో కుమారుడు పవన వచ్చి ఏమైందని అని అడిగాడు. పురుగుల మందు తాగానని చెప్పడంతో ఇంట్లో నిద్రిస్తున్న అమ్మకు చెబుతానని పవన ఇంట్లోకి వెళ్లగా ఆమె మెడపై పదునైనా ఆయుధంతో బలంగా నరికిన గాట్లతో రక్తపు మడుగులో మృతి చెంది ఉంది. తల్లిని చూసి తండ్రిని నిలదీయగా ‘నేను చూసుకుంటాను మీ అమ్మ గురించి వదిలేయ్’ అంటూ స్పృహ కోల్పోయాడు. అది గమనించిన పవన చుట్టుపక్కన వాళ్లను పిలిపించి పెద్దయ్యను చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని దేవరకొండ మార్చురీకి తరలించారు. చిన్న కుమారుడు పవన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నవీనకుమార్ తెలిపారు. పెద్దయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెద్దయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.