ఆయిల్‌పామ్ సాగుకు వందశాతం రాయితీ
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:36 AM
ఆయిల్‌పామ్ సాగుకు వందశాతం రాయితీ వర్తిస్తుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం అయిల్‌పామ్ సాగు, రైతులకు అందుతున్న ప్రోత్సాహకాలపై ఆయన మాట్లాడారు. దేశంలో వంటనూనెల కొరతను అధిగమించేందుకు రైతులు అయిల్‌పామ్ సాగు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి ఆయిల్‌పామ్ పంట విస్తీర్ణం పెంచేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటుందన్నారు.

కలెక్టర్ హనుమంతరావు
భువనగిరి అర్బన్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్ సాగుకు వందశాతం రాయితీ వర్తిస్తుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం అయిల్‌పామ్ సాగు, రైతులకు అందుతున్న ప్రోత్సాహకాలపై ఆయన మాట్లాడారు. దేశంలో వంటనూనెల కొరతను అధిగమించేందుకు రైతులు అయిల్‌పామ్ సాగు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి ఆయిల్‌పామ్ పంట విస్తీర్ణం పెంచేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటుందన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు సబ్సిడీపై మొక్కలు, ఎరువులు, డ్రిప్‌ను ప్రభుత్వమే అందిస్తోందన్నారు. అయిల్‌పామ్ పంటలకు తెగుళ్లు, చీడ పురు గుల ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. కోతులు, అడవి పందుల బెడద ఉండదన్నారు. మొక్కలు నాటిన తర్వాత నాలుగో ఏడాది నుంచి కాపు మొదలై 30 ఏళ్లపాటు ఏటా ఆదాయం పొందవచ్చన్నారు. రవాణా, మార్కెటింగ్, ప్రాసెసింగ్ సౌకర్యాలు కంపెనీ ద్వారా కల్పిస్తారన్నారు. ఒక ఎకరానికి సుమారు 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుండగా, ఏడాదికి ఎకరాకు సుమారు రూ.1.20లక్షల నుంచి రూ.1.50లక్షల వరకు నికర ఆదాయం పొందవచ్చన్నారు. ఆయిల్‌పామ్ సాగు చేసే ఎస్సీ, ఎస్టీ రైతులకు బిందు సేద్యం పరికరాలను 100శాతం, చిన్న, సన్నకారు, బీసీలకు 90శాతం, ఇతర రైతులకు 80శాతం రాయితీపై ఐదు హెక్టార్ల వరకు డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కల్పిస్తోందన్నారు. జిల్లాలో అయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు యంత్రాంగం చర్యలు చేపడుతోందన్నారు. గడిచిన రెండేళ్లలో 3,500 ఎకరాల్లో అయిల్‌పామ్ సాగు చేయగా, ఈ సంవత్సరం సాగు లక్ష్యం 2,500ఎకరాలు కాగా ఇప్పటికే 754 ఎకరాల్లో మొక్కలు నాటడం పూర్తయిందన్నారు. పభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.