అయినా.. తీరు మారలే
ABN , Publish Date - Jan 18 , 2025 | 01:00 AM
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల్లో అవినీతి పర్వం మరోసారి చర్చనీయాంశమైంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల్లో అవినీతి పర్వం మరోసారి చర్చనీయాంశమైంది. అన్నిస్థాయిల్లోని సిబ్బంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటు న్నారు. డబ్బులు ఇవ్వందే ఏ పనీ చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లేకుంటే కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిప్పించుకుంటున్నారు. దీంతో విసిగి వేసారిన ప్రజలు ఎంతో కొంత ఇచ్చుకుని పనులు చేయించుకుంటున్నారు. బాధితులు అవినీతి అధికారులను అడపాదడపా ఏసీబీ అధికారులకు పట్టిస్తున్నా మిగతా వారిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు.
పెద్దఅడిశర్లపల్లి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా పీఏపల్లి తహసీల్దార్ కార్యాయలంలో మామూళ్లు ఇవ్వందే ఏపనీ జరగదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి, వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. అవినీతిపై ఆధారాలు చూపించినా చర్యలు తీసుకోవడం లేదని, దీంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. డిప్యూటీ తహసీల్దార్ లేకపోవడంతో తహసీల్ధార్, ఆర్‌ఐలు అన్ని తామే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. స్థానిక అధికారులపై ఉన్నతాధికారులకు ఎన్నో ఫిర్యాదులు వెళ్లినా చర్యలు లేకపోవడంతో వారిలో మార్పురావడంలేదని ప్రజలు అంటున్నారు.గతంలో ఓ అధికారిని ఏసీబీ పట్టి ంచినా మిగతావారిలో మార్పులేదంటున్నారు.
ఎర్రకుంటతండాకు చెందిన కొర్ర లక్‌పతికి చెందిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన చేశారు. దీనిపై బాధితులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అయినా అధికారులపై చర్యలు తీసుకోలేదు.
2021లో పీఏపల్లి ఆర్‌ఐగా పనిచేసిన శ్యాంనాయక్ భీమనపల్లి రైతు భూమి సరిచేసేందుకు అతని వద్ద రూ.10 వేలు డిమాండ్ చేశాడు. దీంతో ఆ రైతు ఏసీబీ అధికారులను సంప్రదించగా రైతు వద్ద నుంచి రూ.10 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు కార్యాలయంలోనే రెడ్‌హ్యండెండ్‌గా పట్టుకున్నారు. సిబ్బంది పనితీరుపై వివరణ కోరేందుకు తహసీల్దార్ శ్రీనివాస్‌కు ఫోన చేయగా సమాధానం ఇవ్వలేదు.
సంస్థాననారాయణపురం : యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాననారాయణపురం రెవెన్యూ అధికారులు, సిబ్బంది చిన్నపనికి కూడా ప్రజలను రోజుల తరబడి తిప్పించుకుంటున్నారు. ప్రతీపనికి అధికారుల నుంచి సిబ్బంది వరకూ చేయి తడపాల్సిన పరిస్థితి నెలకొందని ఆరోపణలు ఉన్నాయి. అన్నిరికార్డులు సక్రమంగా ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో సిబ్బందికి ఎంతోకొంత డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్లు ప్రక్రియను చేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.ఓ గ్రామంలో అన్నదమ్ములకు సమా నంగా రావాల్సిన భూమి నమోదులో ఎక్కువ తక్కువగా నమోదయ్యాయి. దీనిని సరిచేయడానికి కార్యాలయం చుట్టూ రోజుల తరబడి రప్పించుకున్నారు. సామాన్యులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అన్ని పనులకు ఎదురుచూపులే....
నార్కట్‌పల్లి:నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలకు సేవలందడంలో రోజులు గడుస్తున్నాయి.ఏపనికోసమైనా అర్జీదారులు ఎదురుచూడాల్సి వస్తుందన్న విమర్శలు వినవస్తున్నాయి. ప్రధానంగా భూముల సర్వేకు బాధితులు తీవ్రఇబ్బందిపడుతున్నారు. పెద్దసంఖ్యలో మీ సేవ ద్వారా భూసర్వే కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే మండల సర్వేయర్‌కు నల్లగొండ డిప్యూటీ ఇనస్పెక్టర్‌గా అదనపు బాధ్యతలు ఉండటం, ఇతర ప్రాజెక్టు భూసేకరణకు సమయం ఇవ్వాల్సి వస్తోంది. దీంతో రెండు నెలలుగా మండలంలో భూముల సర్వే నిలిచింది. సర్వే ఆలస్యంతో కొన్నిసార్లు ఘర్షణలు తలెత్తిన ఘటనలు ఉన్నాయి.
చనిపోయిన వ్యక్తి పేరిట భూమి లేదు
అవురవాణిలోని 228సర్వేనెంబర్ పహణి ప్రకారం చనిపోయిన మాదగోని నర్సింహ పేరిట భూమి రికార్డుల్లో లేదు. దరఖాస్తు పరిశీలించి న్యాయం చేస్తాం.
తరుణ్, ఆర్‌ఐ, నార్కట్‌పల్లి
కొండమల్లేపల్లి:మండలాల పునర్విభజనలో భాగంగా 2016లో కొండమల్లేపల్లిని నూతన మండలంగా ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి నేటి వరకూ అధికారులు సమయపాలన పాటించకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి రాత్రి ఎనిమిది గంటల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.మూడేళ్లుగా ప్రింటర్ పనిచేయడంలేదు.పాస్‌పుస్తకంలో నమోదుకు సమీప మండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఏ పనికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
పాత రికార్డులతో ఆదాయం జోరు
బొమ్మలరామారం: యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులకు డిమాండ్ నెలకొంది. ఔటర్ రింగురోడ్డుకు రానున్న రోజుల్లో నూతనంగా ఏర్పాటయ్యే ఆర్‌ఆర్‌ఆర్ రోడ్డుకు మధ్యలో బొమ్మలరామారం ఉండడంతో ఈ ప్రాంతంలో భూములకు డిమాండ్ ఉంది. జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉండడంతో తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులతో పని ఏర్పడుతుంది. దీంతో కిందిస్థాయి నుంచి మండల స్థాయి అధికారులకు వరకు ప్రతీ రోజూ రికార్డుల పేరిట డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమకు కావాల్సిన భూరికార్డులను భారీమొత్తంలో డబ్బులు చెల్లించి తీసుకుంటున్నారు. ఇది కాస్త సామాన్య రైతులు, ప్రజలకు ఇబ్బందిగా మారింది. తహసీల్దార్ కార్యాలయంలో ఏ సేవ అయినా పొందాలంటూ డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆనలైనలో దొరకని భూరికార్డుల కోసం రూ.6వేల నుంచి రూ.20వేల వరకు ముడుపులు చెల్లించక తప్పడం లేదని సామాన్య ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
కాసులు కురిపిస్తున్న మిస్సింగ్ సర్వే నెంబర్లు
డిండి : పాస్‌పుస్తకంలో ఉన్న భూమి వివరాలు ధరణి ఆనలైనలో చేర్చకపోవడం రెవెన్యూ అధికారులకు కాసుల పంట కురిపిస్తోంది. నల్లగొండ జిల్లా డిండి మండలంలో సుమారు 1200సర్వే నెంబర్లకు పైగా ధరణిలోకి ఎక్కలేదు. మండలంలో 38 పంచాయతీల్లో ఉన్నాయి. చాలాచోట్ల ఈ సమస్య నెలకొంది. దీంతో పాస్‌పుస్తకంలోకి నమోదు కోసం రైతులు కార్యాలయం చుట్టు తిరుగుతున్నారు. తమ సమస్య పరిష్కారానికి అధికారుల చేతులు తడుపుతున్నారు. నిత్యం కార్యాలయం చుట్టు తిరుగలేక రైతులు గ్రామాలలో ఉండే మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. డబ్బులిస్తేనే సర్వేనెంబర్ ధరణిలో నమోదవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.