Share News

అమ్మకొడుతుందని ఇంటిపైకెక్కాడు

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:27 AM

ఇన్ని గంటలు ఆడుకోవడానికి వెళ్లావ్‌, ఇంటికి రా అమ్మ కొడుతుందన్న సోదరి హెచ్చరికతో అదృశ్యమైన బాలుడి కథ సుఖాంతమైంది.

అమ్మకొడుతుందని ఇంటిపైకెక్కాడు

మునుగోడు, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) : ఇన్ని గంటలు ఆడుకోవడానికి వెళ్లావ్‌, ఇంటికి రా అమ్మ కొడుతుందన్న సోదరి హెచ్చరికతో అదృశ్యమైన బాలుడి కథ సుఖాంతమైంది. పక్కింటి దాబాపైనే రాత్రంతా పడుకున్న బాలుడిని పోలీసులు గుర్తించారు. దీంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఉదంతం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలకేంద్రానికి చెందిన ఓ దంపతుల కుమారుడు(6) బుధవారం పాఠశాలకు వెళ్లి ఇంటికి రాకుండా స్నేహితులతో ఆడుకుంటున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చే క్రమంలో అతడి వద్దకు వెళ్లిన సోదరి నువ్వుఆటలు ఆడుకుంటూ ఇంటికి రావటం లేదు, అమ్మ కొడుతుందని అని చెప్పటంతో భయంతో పక్కంటి ఇంటిపైకి వెళ్లి తలదాచుకున్నాడు. భయంతో రాత్రంతా అక్కడే ఉండి, నిద్రలోకి జారుకున్నాడు. అయితే బాలుడి కోసం తల్లిదండ్రులు వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన వారు గురువారం ఉదయం పోలీసులకు ఫిర్యాదుచేశారు. వెంటనే స్పందించిన చండూరు సీఐ వెంకటయ్య హుటాహుటిన ఇంటికి చేరుకుని వివరాలు సేకరిస్తూ పరిసరాలను గమనించారు. ఈ క్రమంలో పక్కింటిపై పరద మాటున తొంగిచూస్తున్న బాలుడిని గుర్తించి పట్టుకున్నారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో పలువురు పోలీసులను అభినందించారు. బాలుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ వెంకటయ్యను డీఎస్పీ శివరాంరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - Feb 07 , 2025 | 12:27 AM