సరస్వతీ నమస్తుభ్యం...
ABN , Publish Date - Feb 04 , 2025 | 12:49 AM
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని అవంతీపురంలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి శాంతికల్యాణ మహోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు.
మిర్యాలగూడ రూరల్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని అవంతీపురంలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి శాంతికల్యాణ మహోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ప్రతి ఏడాది వసంత పంచమిని పురస్కరించుకుని సరస్వతి ఆలయంలో నిర్వహించే అక్షరాభాస్య కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు అక్షరభ్యాసాలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి తదితరులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అవంతీపురంలో నిర్వహించిన శాంతికల్యాణ మహోత్సవం, సరస్వతీదేవి పూజా కార్యక్రమాలకు పట్టణ, మండల పరిసర ప్రాంతాల భక్తుల రాకతో జాతర వాతావరణం నెలకొంది. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు, రూరల్ పోలీసులు ఏర్పాట్లు చేపట్టారు.
ఘనంగా శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి వేడుకలు
నల్లగొండ కల్చరల్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): వసంత పంచమి పర్వదినం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని పలు దేవాలయాల్లో శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అర్చకస్వాములు అమ్మవారికి తెల్లవారుజామున నుంచే అభిషేకాలు, పూజా కార్యక్రమాలు శాసో్త్రక్తంగా చేశారు. రామగిరి సీతారామచంద్రస్వామి దేవాలయం, తులసీనగర్ భక్తాంజనేయస్వామి దేవాలయం, షేర్ బంగ్లా సంతోషిమాతా ఆలయం, వీటీకాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాలతో పాటు పానగల్లులోని పచ్చల, ఛాయ సోమేశ్వరాలయాల్లో వసంత పంచమి వేడుకలను కన్నులపండుగగా నిర్వహించారు. అనంతరం చిన్నారుల చేత సామూహికంగా అక్షరాభ్యాసానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఆలయాన్ని భక్తులతో, చిన్నపిల్లలతో సందడి చేశా యి. ఆయా కార్యక్రమాల్లో అర్చక స్వాములు కారంపూడి మోహనశర్మ, పవనశర్మ, యాదగిరిశర్మ పాల్గొన్నారు.
ఆటపాటలతో కూడిన విద్యను అందించాలి
సూర్యాపేటఅర్బన, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించాలని శ్రీసరస్వతీ విద్యానిలయం పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు ఒంటెద్దు శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీసరస్వతీ విద్యానిలయం పాఠశాలలో నిర్వహించిన వసంత పంచమి వేడుకల్లో ఆయన మాట్లాడారు. మాఘశుద్ధ పంచమిని పురస్కరించుకుని 2025-26 విద్యాసంవత్సరం ప్రారంభం కార్యక్రమం నిర్వహించామన్నారు. అనంతరం 150 మంది విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో సభ్యులు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసరావు, గుండా రమేష్, కొత్త మల్లికార్జున, లక్ష్మీనారాయణ, హైమావతి, గజ్జల వెంకటరెడ్డి, పర్వతం శ్రీధర్, శ్రీనివాస్, మురళీదర్‌రెడ్డి, నరేంద్రరావు, ప్రభాకర్ పాల్గొన్నారు.