Share News

నెల గడిచినా అందని ధాన్యం బోనస్‌

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:07 AM

మద్దతు ధరతో కలిపి ఇస్తామన్న రూ.500 బోనస్‌ ధాన్యం విక్రయించి నెల రోజులైనా రైతుల ఖాతాల్లో జమకావడం లేదు.

నెల గడిచినా అందని ధాన్యం బోనస్‌

(ఆంధ్రజ్యోతి-మోత్కూరు)

మద్దతు ధరతో కలిపి ఇస్తామన్న రూ.500 బోనస్‌ ధాన్యం విక్రయించి నెల రోజులైనా రైతుల ఖాతాల్లో జమకావడం లేదు. గత వానాకాలం సీజనలో దొడ్డు ధాన్యానికి మార్కెట్‌లో ప్రభుత్వ మద్దతు ధర కన్నా క్వింటాకు రూ.మూడు, నాలుగు వందలు మాత్రమే తక్కువ ఉండటంతో ధాన్యం ఆరబెట్టి, తూర్పారపడితే ఆ మాత్రం ఖర్చు వస్తుందిలే, ఇబ్బందులు ఎందుకని చాలామంది రైతులు ప్రైవేటువ్యాపారులకే విక్రయించారు. కొందరు మాత్రమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. సన్న ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తామని ప్రకటించినా కొందరు రైతులు మాత్రమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. అయితే సన్న ధాన్యం విక్రయించి నెల రోజులు గడిచినా బోనస్‌ డబ్బులు మాత్రం కొందరికి రాలేదు. బోనస్‌ డబ్బుల కోసం రైతులు సింగిల్‌విండో, ఐకేపీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

ప్రభుత్వానికి విక్రయించిందే తక్కువ

యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో మోత్కూరు రైతు సేవా సహకారం సంఘం 39మంది రైతుల నుంచి 3,472 బస్తాలు (1388.80 క్వింటాళ్లు), ఐకేపీలో 14మంది రైతుల నుంచి 901 బస్తాలు(360.40 క్విం టాళ్లు) సన్న ధాన్యం కొనుగోలు చేశారు. అడ్డగూడూరు సింగిల్‌ విండో 146 మంది రైతుల నుంచి 14,599 బస్తాలు(5,839.60 క్వింటాళ్ల) సన్నధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో కొందరు రైతులకు రూ.500 బోనస్‌ అందగా మరికొందరికి అందలేదు. మండలంలోని ముశిపట్ల గ్రామానికి చెందిన రైతు పైళ్ల వెంకట్‌రెడ్డి, మోత్కూరుకు చెందిన రైతులు దొంతరబోయిన రామలింగయ్య, కూరెల్ల రమేష్‌ తాము ధాన్యం విక్రయించి నెల రోజులు గడిచినా ఇంతవరకూ బోనస్‌ రాలేదని తెలిపారు. వెంకట్‌రెడ్డికి రూ.21వేలు, రామలింగయ్యకు రూ.13వేలు, రమే్‌షకు రూ.5,400 బోనస్‌ రావాలని తెలిపారు. తమకు బోనస్‌ డబ్బుల అందక వ్యవసాయ పెట్టుబడులకు అప్పులు తెచ్చామని, వాటికి వడ్డీ పెరుగుతుందని వాపోతున్నారు. ప్రభుత్వం రూ.500 బోనస్‌ ఇస్తామంటేనే ప్రభుత్వానికి ధాన్యం విక్రయించామని, లేనిపక్షంలో ప్రైవేటు వ్యాపారులకు విక్రయించినా, బియ్యం చేసి విక్రయించుకున్నా ఈ పాటికి డబ్బు చేతికి వచ్చి అవసరాలకు ఉపయోగపడేదన్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు రావాల్సిన బోనస్‌ డబ్బులు వెంటనే చెల్లించాలని రైతులు కోరుతున్నారు.

రూ.21వేలు బోనస్‌ రావాలి

నేను మోత్కూరు రైతు సేవాసహకార సంఘానికి గత డిసెంబరు 12న 108 బస్తాల (40 కిలోలవి) సన్నధాన్యం విక్రయించా. నా కుమారుడు వెంకట్‌రెడ్డి పేరున బిల్లు చేయించా. రైస్‌మిల్లరు మూడు బస్తాలు కోత విధించాడు. దాంతో సంఘం వారు 105 బస్తాలకు(42 క్వింటాళ్లకు) బిల్లు చేశారు. మద్దతు ధర క్వింటాలుకు రూ.2,320 చొప్పున డబ్బు వారం రోజుల్లోపే చెల్లించారు. క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ రూ.21 వేలు రావాల్సి ఉంది. నేటికీ రాలేదు. సింగిల్‌విండో కార్యాలయానికి వెళ్లి అడిగితే ప్రభుత్వం నేరుగా మీబ్యాంకు ఖాతాలోనే వేస్తుంది, మాకేమి తెలియదంటున్నారు. వెంటనే బోనస్‌ డబ్బు చెల్లించాలి.

పైళ్ల పాపిరెడ్డి, రైతు, ముశిపట్ల

బోనస్‌ రైతు ఖాతాలో జమవుతుంది

రైతులు విక్రయించిన ధాన్యానికి మద్దతు ధర ప్రకారం అయిన బిల్లుగాని, బోనస్‌ గాని ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. బోనస్‌ రాలేదని కొందరు రైతులు కార్యాలయానికి వచ్చి అడుగుతున్నారు. ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు పంపుతున్నందున ఎవరికి డబ్బులు వచ్చాయో, ఎవరికి రాలేదో మాకు తెలియడం లేదు.

కే వరలక్ష్మీ, సింగిల్‌విండో సీఈవో, మోత్కూరు

Updated Date - Jan 17 , 2025 | 12:07 AM