కక్షతోనే ఉప్పలంచ మాజీ సర్పంచ హత్య
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:37 AM
వ్యక్తిగత కక్షతోనే శాలిగౌరారం మండలం ఉప్పలంచ గ్రామ మాజీ సర్పంచ బండారు మల్లయ్యను ప్రత్యర్థులు హత్య చేయించినట్లు నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి తెలిపారు.

నల్లగొండ క్రైం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): వ్యక్తిగత కక్షతోనే శాలిగౌరారం మండలం ఉప్పలంచ గ్రామ మాజీ సర్పంచ బండారు మల్లయ్యను ప్రత్యర్థులు హత్య చేయించినట్లు నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో గురువారం కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ హత్యలో మొత్తం 11 మంది నిందితులు ఉండగా ఏడుగురిని అరెస్టు చేశామని, మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. 2009, 2019 ఎన్నికల్లో ఉప్పలంచ గ్రామానికి చెందిన బండారు మల్లయ్య సర్పంచగా ఎన్నికై గ్రామంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించేవాడని డీఎస్పీ తెలిపారు. అయితే గ్రామంలో ఎస్సీ మాదిగ సామాజికవర్గ కులదేవత పాపమ్మకు కొంతభూమిని వారి పూర్వీకులు కేటాయించగా ఈ భూమిలో వారి పాలివాళ్లకి 12 మందికి భాగం ఉందని, ఈ గుడికి సంబంధించిన భూమిలో రుద్రారపు యాదగిరి, రుద్రారపు మల్లయ్య కొంతభూమిని ఆక్రమించి మరుగుదొడ్లు నిర్మించుకున్నట్లు తెలిపారు. రుద్రారపు యాదగిరి అలియాస్ చిన్నయాదగిరి, టైలర్ నర్సింహ గుంట భూమిని ఆక్రమించుకున్నట్లు తెలిపారు. దీంతో వారు మాజీ సర్పంచ బండారు మల్లయ్య వద్ద పంచాయితీ పెట్టారు. రుద్రారపు కుమార్ భూమిని ఆక్రమించిన వారికి మద్దతుగా మాట్లాడగా, ఆ భూమిని గ్రామస్థులు తిరిగి స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ కట్టించారు. దీనికి మాజీ సర్పంచ మల్లయ్యనే కారణమని కక్ష పెంచుకుని, మల్లయ్యను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు తెలిపారు. కిరాయి వ్యక్తులైన సూరారపు యాదగిరి, కొంపల్లి చంద్రమౌళి, కొంపల్లి శ్రీరాములు, సూరారం నర్సింహతో రూ.11 లక్షలకు సుపారీ కుదుర్చుకున్నారని వివరించారు. ఈ నెల మొదటి వారంలోనే మల్లయ్యను హత్య చేయాలని కుట్రపన్నినా అది విఫలమైందన్నారు. కాగా ఈ నెల 21వ తేదీన మల్లయ్య పొలం నుంచి ఇంటికి వస్తుండగా ముందుగా నిందితులు వేసుకున్న పథకం ప్రకారం కర్రలతో దాడి చేశారని డీఎస్పీ తెలిపారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మల్లయ్యను గ్రామస్థులు ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ చనిపోయాడన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రుద్రారపు యాదగిరి, రుద్రారపు మల్లయ్య, సూరారపు యాదగిరి అలియాస్ గడ్డం యాదగిరి, కొంపల్లి చంద్రమౌళి, కొంపల్లి శ్రీరాములు, రుద్రారపు నర్సింహ అలియాస్ నర్సయ్య, రుద్రారపు కుమార్, తాడోజు శ్రీకాంతరాజులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి ఐదుకర్రలు, కారు, మూడు మోటార్ సైకిళ్లు, ఎనిమిది ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, వీరిపై గతంలోనే పలు కేసులు ఉన్నట్లు వివరించారు. సమావేశంలో శాలిగౌరారం సీఐ కొమిరెడ్డి కొండల్‌రెడ్డి, ఎస్‌ఐ డీ సైదులు ఉన్నారు.