అరచేతిలో ‘ఉపాధి’ సమాచారం
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:08 AM
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పారదర్శకతను పెంచేలా కేంద్ర ప్రభుత్వం యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

కూలీలకు అందుబాటులో యాప్
చెల్లింపుల్లో పారదర్శకత
(ఆంధ్రజ్యోతి-భువనగిరి రూరల్)
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పారదర్శకతను పెంచేలా కేంద్ర ప్రభుత్వం యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉపాధి కూలీలకు సహాయకారిగా దీనిని రూపొందించారు. ఈ పథకంలో ఎలాంటి అవకతవకలు లేకుండా పూర్తిగా పారదర్శకత ఉండేలా నూతన సంస్కరణలో భాగంగా ఈ యాప్‌ను ఏర్పాటుచేశారు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్(ఎనఎంఎంఎ్‌స) యాప్‌ను కూలీలకు సులభంగా సమాచారం అందేలా తీర్చిదిద్దారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 421 గ్రామ పంచాయతీలు విస్తరించి ఉండగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 93,675 జాబ్‌కార్డులకు 1,37,262 మంది కూలీలు పనులు చేసుకుంటున్నారు.
కూలీల వేతనాల దుర్వినియోగానికి చెక్
ఉపాధి కూలీలకు రెండు, మూడు బ్యాంకు ఖాతాలు ఉండడంతో ఏ ఖాతాలో కూలీ డబ్బులు జమవుతున్నాయో తెలియడం లేదు. వారికి వేతనాలు రావడం లేదని, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వారు ఎంత పనిచేశారో తెలిసేది కాదు. ఉపాధిహామీ పని సిబ్బంది రాసిందే పని, వచ్చిందే వేతనం అన్న చందంగా ఉండేది. కానీ వారు ఎంత పనిచేశారో ఈ యాప్ ద్వారా కూలీలకు తెలుస్తుంది. తద్వారా తమకు ఎంత వేతనం వస్తుందో ముందే ఓ అంచనాకు రావచ్చు.
సెల్‌ఫోనలో డౌనలోడ్ ఇలా
స్మార్ట్‌ఫోనలోని ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌనలోడ్ చేసుకోవాల్సి ఉంది. అందులో ఆరు రకాల ఆప్షన్లు ఉంటాయి. మొదటి ఆప్షన నొక్కగానే రాష్ట్ర, జిల్లా, బ్లాక్, పంచాయతీ, గ్రామం, ఫ్యామిలీ ఐడీ వివరాలను నింపితే పూర్తివివరాలు వస్తాయి. కూలీలు ఉపాధి హామీ జాబ్‌కార్డు ఎంటర్ చేయగానే కూలీకి సంబందించిన వివరాలు కనిపిస్తాయి. జాబ్ కార్డులో కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి. అటెండెన్స ఆప్షనను ఎంచుకోవడంతో ఏ ఆర్థిక సంవత్సరంలో ఎంత పనిచేశారో. ఎన్ని రోజులు పనులు మిగిలిపోయాయి అనే వివరాలు కనిపిస్తాయి. దీనిని బట్టి ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన పనిదినాలు కనిపిస్తాయి. పేమెంట్ ఆప్షనలోకి వెళ్లి పేరు మీద క్లిక్‌చేయగానే ఎన్ని రోజులు, ఎక్కడ పని చేశారో, కూలి ఎంత, ఎ బ్యాంకులో జమ చేశారో అనే వివరాలు కనిపిస్తాయి. ఉపాధి హామీ డబ్బులు జమ కాకుంటే సదరు కూలీ ఖాతాకు సంబంధించి ఆధార్ కార్డుతో వివరాలు కనిపిస్తాయి. దీంతో కూలీల వేతనాల దుర్వినియోగానికి చెక్ పెట్టే అవకాశం ఉంది.