ఎన్నికల కోడ్ కూసింది
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:35 AM
వరంగల్ - ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రవర్తనా నియమావళి అమల్లోకివచ్చింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అమల్లోకి ప్రవర్తనా నియమావళి
విగ్రహాలకు ముసుగులు వేస్తున్న సిబ్బంది
నల్లగొండ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): వరంగల్ - ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రవర్తనా నియమావళి అమల్లోకివచ్చింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన రానుండగా 10వ తేదీ వరకు నామినేషన వేసేందుకు అవకాశం ఉంది. 11న నామినేషన్లను పరిశీలిస్తారు. 13వ తేదీన ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ ఫిబ్రవరి 27న జరగనుండగా ఓట్ల లెక్కింపు మార్చి 3న నిర్వహిస్తారు. మార్చి 4వ తేదీ తరువాతే ఎన్నికల కోడ్ ముగియనుంది. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ పదవీకాలం ఈ ఏడాది మార్చి 29తో ముగియనుంది. ఎన్నికల కోడ్ రావడంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రవర్తన నియమావళిని అమలులోకి తీసుకవచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు కూడళ్లలో మహానీయుల విగ్రహాలతో పాటు రాజకీయ నాయకుల విగ్రహాలకు మునిసిపల్ సిబ్బందితో పాటు పంచాయతీ సిబ్బంది ముసుగులు వేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడి కోడ్ ముగిసిన తర్వాతే ముసుగులు తీస్తారు. కోడ్ అమల్లోకి రావడంతో కొత్త పథకాలకు శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవాలన్నీ నిలిచిపోయాయి. నెల రోజులకు పైగా ఎన్నికల కోడ్ అమలులో ఉండనుంది. అయితే ఇప్పటికే అమలుచేసిన సంక్షేమ పథకాలు కొనసాగుతాయా లేదా నిలిపివేస్తారా అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ నెల 26న రైతుభరోసాతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషనకార్డుల జారీ ప్రక్రియకు ఆటంకం కలుగనుంది. అయితే రన్నింగ్‌లో ఉన్న పథకాలకు ఎలాంటి ఇబ్బందిలేదని గతంలో పలుమార్లు అధికారులు, అప్పటి ప్రభుత్వాలు పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కూడా అలా ఉంటుందా లేక పూర్తిగా నిలిచిపోయతా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ముఖ్యంగా రైతుభరోసా వంటి పథకం అందకపోతే రైతులు తీవ్ర ఆర్థికఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కేవలం పైలెట్ ప్రాజెక్టు కింద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 73 మండలాల్లో 73 గ్రామాల్లో మాత్రమే ఈ నాలుగు పథకాలను లాంఛనంగా అమలుచేశారు. మిగతా గ్రామాల్లో, పట్టణాలల్లో, వార్డుల్లో పథకాల అమలుపై ప్రతిష్ఠంబన ఏర్పడింది. ముఖ్యంగా రైతుభరోసా నిధుల కోసం రైతులు ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.