Share News

పట్టణ మహిళల ఆర్థిక వికాసం

ABN , Publish Date - Mar 08 , 2025 | 01:33 AM

మహిళల ఆర్థిక క్రమశిక్షణ కారణంగా మహి ళా సంఘాలకు బ్యాంకులు విరివిగా రుణాలు అందిస్తున్నాయి. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం చేస్తున్న కృషికి, బ్యాంకులు రుణాల రూపంలో సహకరిస్తున్నాయి.

పట్టణ మహిళల ఆర్థిక వికాసం

ఇప్పటివరకు రూ.90కోట్ల రుణాలు

నెలాఖరుకు మరో రూ.50కోట్లు

రూ.15కోట్లు స్త్రీనిధి, ఇందిరా మహిళా శక్తి రుణాలు అదనం

(ఆంధ్రజ్యోతి,భువనగిరి టౌన్‌) : మహిళల ఆర్థిక క్రమశిక్షణ కారణంగా మహి ళా సంఘాలకు బ్యాంకులు విరివిగా రుణాలు అందిస్తున్నాయి. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం చేస్తున్న కృషికి, బ్యాంకులు రుణాల రూపంలో సహకరిస్తున్నాయి. అయితే ప్రభుత్వ లక్ష్యానికి, బ్యాంకుల చేయూతకు విశ్వాసం కల్పిస్తున్నది మాత్రం మహిళల ఆర్థిక క్రమశిక్షణే.

జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లోని మహి ళా సంఘాలకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.90కోట్ల రుణాలను మంజూరు చేసిన బ్యాంకులు ఆర్థి క సంవత్సరం ముగిసే నాటికి మరో రూ.50కోట్లు రుణాలు ఇవ్వనున్నాయి. అంతేగాక స్త్రీనిధి, ఇందిరా మహిళా శక్తి రుణాల రూపంలో రూ.15 కోట్లు కూడా మంజూరయ్యా యి. గత ఆర్థిక సంవత్సరం లో నాలుగు నెలల వడ్డీ లేని రుణాల సబ్సిడీ రూ.1.53కోట్లు విడుదలయ్యాయి. వెరసి ప్రస్తు త ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లోని మహిళా సంఘాలకు ఇప్పటి వరకు రూ.106కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరింది.

పెరిగిన లక్ష్యం, రుణ సౌలభ్యం

జిల్లాలోని భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌, పోచంపల్లి, ఆలేరు, మోత్కూరు మునిసిపాలిటీల్లోని 3,229 మహిళా సంఘాలకు ప్రస్తు త ఆర్థిక సంవత్సరంలో రూ.70కోట్లు రుణాలు ఇవ్వాలని బ్యాంకులకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే మూడు నెలల క్రితమే బ్యాంకులు ఈ లక్ష్యాన్ని అధిగమించాయి. దీంతో మహిళా సంఘాల రుణ చెల్లింపులు, బ్యాంకుల సమ్మతితో రుణ పరపతి లక్ష్యాన్ని ఏకంగా రూ.140కోట్లకు ప్రభుత్వం పెంచింది. దీంతో మహిళా సంఘాలకు రెట్టింపు రుణ సౌలభ్యం పెరగగా, నూతన లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు రూ.20కోట్లు మహిళా సంఘాల ఖాతా ల్లో జమయ్యాయి. మిగతా రూ.50కోట్ల రుణాలు ఆర్థిక సంవత్సరం ముగిసే ఈ నెల చివరి నాటి కి విడుదల కానున్నాయని మెప్మా, బ్యాంక్‌ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఆరు పట్టణాల్లోని సుమారు 800 సంఘాలకు బ్యాంకులు రూ.90కోట్లు రుణాలుగా ఇవ్వగా, 9,000 మంది మహిళలకు లబ్ధి చేకూరింది. అలాగే మహిళలను విభిన్న వ్యాపారాల్లో ప్రోత్సహించే లక్ష్యంతో తెచ్చిన ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగం గా రూ.4.22కోట్ల రుణాలను బ్యాంకులు ఇచ్చా యి. వీటిలో మహిళలు సంఘంగా వ్యక్తిగతంగా వ్యాపారాల్లో ప్రవేశించారు. జిల్లా కోర్టు ప్రాంగణం, కలెక్టరేట్‌, భువనగిరి బస్టాండ్‌ వద్ద ఇటీవల ఆయా మహిళా సంఘాలు క్యాంటీన్లను ప్రారంభించి నాణ్యమైన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 1,675 మహిళా సంఘాలకు రావలసిన వడ్డీ లేని రుణాల సబ్సిడీకి నాలుగు నెలల సబ్సిడీ మొత్తం రూ.1.53కోట్లు ఇటీవల విడుదలైంది. మిగతా బకాయిలు కూడా త్వరలో రానున్నట్లు అధికారులు తెలిపారు. 278 సంఘాల్లోని 1,137 మంది మహిళలకు రూ.11.06కోట్లు స్త్రీనిధి రుణాలు అందాయి.

రుణాల చెల్లింపులో మహిళల నిజాయితీ

ఎస్‌.రమేష్‌ బాబు, పీడీ, పట్టణ నిరుపేద నిర్మూలన సంఘం

రుణాల చెల్లింపులో మహిళలు నిజాయితీ, చిత్తశుద్ధి చూపుతున్నారు. సకాలంలో రుణాలు చెల్లిస్తూ రికార్టు సృష్టిస్తున్నారు. దీంతో మిగతా రుణాలతో పోలిస్తే మహిళా సంఘాలకు రుణాల మంజూరులో బ్యాంకులు ఉత్సాహంగా ఉంటున్నాయి. ప్రభుత్వం, బ్యాంకుల సహకారంతో జిల్లాలోని పట్టణ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి మహిళలకు అందనున్న రూ.50కోట్ల రుణాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పట్టణ మహిళా సంఘాల రుణపరపతి రూ.140కోట్లకు చేరనుంది.

మునిసిపాలిటీ సంఘాలు సభ్యులు

భువనగిరి 1,187 11,718

చౌటుప్పల్‌ 596 5,779

పోచంపల్లి 423 4,097

ఆలేరు 378 3,529

మోత్కూరు 360 3,326

యాదగిరిగుట్ట 285 2,860

మొత్తం 3,229 31,309

Updated Date - Mar 08 , 2025 | 01:33 AM