సన్నాలతో చిక్కులే
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:58 AM
వాతావరణంలో మార్పులు పంటల సాగు పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడం తో పాటు రాత్రి పూట చలి వాతావరణం ఉండటంతో సన్న రకాల వరి సాగు కష్టంగా మారింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సాగర్ ఆయకట్టులో సుమారు 6.5లక్షల ఎకరా ల్లో వరి సాగు అవుతుండగా, 90శాతం మేర సన్న రకాలే ఉన్నాయి.

అదునుకు ముందే కంకి
ఎదుగుదల లేక ఎర్రగా మారిన పైరు
పెరిగిన యూరియా వాడకం
వాతావరణంలో మార్పులే కారణం
శాస్త్రవేత్తల సలహాలు కరవు
(ఆంధ్రజ్యోతి, మిర్యాలగూడ వ్యవసాయం): వాతావరణంలో మార్పులు పంటల సాగు పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడం తో పాటు రాత్రి పూట చలి వాతావరణం ఉండటంతో సన్న రకాల వరి సాగు కష్టంగా మారింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సాగర్ ఆయకట్టులో సుమారు 6.5లక్షల ఎకరా ల్లో వరి సాగు అవుతుండగా, 90శాతం మేర సన్న రకాలే ఉన్నాయి. ఈ రకాల పంట వేసిన దగ్గర నుంచి ఆశించిన స్థాయిలో ఎదుగుదల లేకపోగా, పంట ఎర్రగా మారుతోం ది. పైగా అదును రాకముందే తల్లి కర్ర నుంచి కంకి బయట కు వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పంట ఎదుగుదల లోపించడంతో పాటు మిగతా కర్రల నుంచి కంకులు వచ్చే పరిస్థితి కనిపించక దిగుబడులపై ప్రభావం పడుతుందని రైతులు చెబుతున్నారు.
యాసంగిలో కష్టమే
ఆయకట్టులో ఐదేళ్లుగా ప్రైవేట్ వరి సన్న రకాలను రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. ఈ సన్నాలు ప్రధానంగా వానాకాలంలో మాత్రమే సాగుకు అనుకూలంగా ఉంటాయి. యాసంగిలో వాతావరణ పరిస్థితులను అవి తట్టుకోలేవని వ్యవసాయధికారులు చెబుతున్నారు. సన్న రకాలు చాలా సున్నితంగా ఉండటంతో అధిక ఉష్ణోగతలు, చలిని తట్టుకోలేవు. ప్రస్తుతం 36 డిగ్రీల ఉష్ణోగ్రత, రాత్రి పూట మంచుకురుస్తుండడంతో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. నవంబరు-డిసెంబరు నెలల్లో నాట్లు వేసిన వరి పైర్లు తెగుళ్లబారిన పడుతున్నాయి. రైతులు సేంద్రీయ ఎరువులు వాడకుండా కేవలం భాస్వరం ఎరువులను విచ్చలవిడిగా వినియోగిస్తుండటంతో పిలకలు రాకుండానే ముందుగానే కంకులు వస్తున్నట్టు వ్యవసాయధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెగుళ్ల బెడద
సన్నాలు నాట్లు వేసిన దగ్గర నుంచి తెగుళ్లు వెంటాడుతున్నాయి. పంట ఎర్రగా మారడంతో పాటు మొగి పురుగు వ్యాప్తి అధికంగా ఉంది. ముందుగా వేసిన వరి నాట్లు వేసి రెండు నెలలు గడిచినా, కనీసం అడుగు కంటే మించి పెరగలేదు. రైతులు ఎకరానికి 4-5బస్తాలు యూరియా వేస్తున్నారు. అధిక నత్రజని వినియోగంతో పంటకు అగ్గి తెగులు వ్యాపిస్తుండటంతో వాటి నియంత్రణకు రైతులు మందులు పిచికారీ చేస్తున్నారు. పంటల సాగు ఆశాజనకంగా లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.
సన్నాలు ఎందుకు?
సాధారణంగా యాసంగి సాగు అంటే గుర్తుకు వచ్చేది ఎంటీయు-1010 దొడ్డు రకం వరిమాత్రమే. ఈ రకం అధిక వేడిని తట్టుకుంటుంది. తెగుళ్ల బెడద ఉండదు ఎకరానికి సుమారు 45-50 బస్తాల (70కిలోలు) వరకు దిగుబడి వస్తుంది. పెట్టుబడి కూడా చాలా తక్కువ. సుమారు మూడు దశాబ్దాలుగా ఈ రకం సాగు చేసిన రైతులు ఐదేళ్లుగా వరుసగా సన్నాలను మాత్రమే సాగు చేస్తున్నారు. ఈ సన్న రకాలకు మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉండటంతో పాటు పచ్చి ధాన్యాన్ని ఆరబెట్టకుండా నేరుగా వ్యాపారులు కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఈ రకాలపై ఆసక్తి చూపుతున్నారు. దిగుబడులు 30 బస్తాలకు మించి రాకున్నా, సన్నాలను మాత్రం రైతులు వదలక పోవడంతో నష్టాలబారిన పడుతున్నారు.
సూచనలు కరువు
దొడ్డు రకాలు సాగు చేసిన రైతులు మంచి దిగుబడులతో ప్రయోజనం పొందుతున్నారు. సన్న రకాలు సాగు చేసిన రైతులు మాత్రం నష్టపోతున్నారు. సన్నాలకు వచ్చే తెగుళ్లు, సాగు యాజమన్యాలపై సరైన సూచనలు చేసే వారే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుగు మందుల దుకాణదారులు ఇచ్చే మందులనే పిచికారీ చేయడం వల్ల పెట్టుబడులు పెరగడంతో పాటు రైతులు నష్టపోతున్నారు. జిల్లాలో ప్రభుత్వ కృషి విజ్ఞాన కేంద్రాలు, వరి పరిశోధనా సంస్థలు ఉన్నా, సాగుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో సరైన సమగ్ర యాజమాన్యంపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించడం లేదని రైతులు వాపోతున్నారు. పంటల సాగులో వచ్చే సమస్యలపై ఎప్పటికపుడు అవగాహన కల్పించేలా వ్యవసాయశాఖ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
నెల రోజులకే పొట్టకు వచ్చింది : మన్నె నాగేశ్వరరావు. రైతు, తుంగపాడు, మిర్యాలగూడ మండలం
నేను ఐదెకరాల్లో సన్న రకం వరి సాగు చేశా. డిసెంబరు 5న నారు పోసి జనవరి 5వ తేదీన నాటు వేశా. నాటు వేసిన నెల రోజులకు పొట్టకు వచ్చి తల్లి కర్ర బయటికి వచ్చింది. పంట జానెడుకు మించి పెరగలేదు. నాటు వేసేటప్పుడు ఎకరానికి రెండు బస్తాల అడుగుపిండి, ఇప్పటి వరకు రెండు బస్తాల యూరియా వేశా. అయినా పంట ఎదుగుదల లోపించింది. మొగి పురుగు వ్యాపించడంతో మందులు పిచికారీ చేశా. పంట ఆశించిన స్థాయిలో ఎదగలేదు. దిగుబడులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
పెట్టుబడులు పెరుగుతున్నాయి: అంజనేయులు, రైతు, త్రిపురారం
నాలుగున్నర ఎకరాల్లో వరి సాగు చేశా. వాతావరణ మార్పులతో పంటలో ఎదుగుదల లేదు. ఇప్పటి వరకు ఎకరానికి 5 బస్తాల వరకు యూరియా వేశా. పంటలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. తల్లి కర్ర నుంచి కంకులు వస్తున్నాయి. తెగుళ్ల సమస్య అధికమైంది. పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. దిగుబడులు ఆశించిన మేర రావు. సాగులో ఇబ్బందులు పడుతున్నాం. చేసిన కష్టం చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.